జగన్ ఉండి ఉంటే…?

ప్రజలు పాలకులు ఈ రెండింటి మధ్యన అతి పెద్ద అంతరం ఎప్పటినుంచో ఉంది. పాలకులు ఒక్కరే ఉంటారు, పాలితులు ఎందరో. అందువల్ల పాలకుడిపైనే అందరి చూపు ఉంటుంది. [more]

Update: 2019-08-22 03:30 GMT

ప్రజలు పాలకులు ఈ రెండింటి మధ్యన అతి పెద్ద అంతరం ఎప్పటినుంచో ఉంది. పాలకులు ఒక్కరే ఉంటారు, పాలితులు ఎందరో. అందువల్ల పాలకుడిపైనే అందరి చూపు ఉంటుంది. ఏ తప్పు చేసినా వెంటనే దొరికేస్తారు. రాచరిక వ్యవస్థలో అయితే అంతా నా ఇష్టమన్న ధోరణి సాగుతుంది. ఇక ప్రజా జీవితంలో పాలకులు పూర్తిగా ప్రజలకు బద్ధులు. అయిదేళ్లకు ఒకసారి వారి రాతను మార్చే అధికారం, అవకాశం ప్రజలకు ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా మసలుకోవాల్సివుంటుంది. ఇక ముఖ్యమంత్రులు, ప్రధానులు అన్న వారికి వెసులుబాటు ఎపుడో తప్ప దొరకదు. ఎందుకంటే వారే కదా మొత్తం బాధ్యత‌లు మోసేది. రాను రాను ప్రతి చిన్నదానికీ కూడా వారి మీదనే ఆధరపడడం ఎక్కువైపోయింది. అలా ఆ ముఖ్యమైన సీటుని తయారు చేశారు. అదే ఇపుడు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

నెలలో పదిహేను రోజులా…..

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇన్ని రోజులు ఎపుడూ సెలవ్ పెట్టలేదు ఆగస్ట్ నెలలో ఆయన దాదాపుగా పదిహేను రోజులు పాలనకు, అమరావతికి దూరమైపోయారు. జెరూసలెం, అమెరికా పర్యటనలు ఒకే నేలలో జగన్ పెట్టుకున్నారు. దాంతోనే ఇపుడు విమర్శలు వచ్చిపడుతున్నాయి. అదే సమయంలో గోదావరి, కృష్ణా నదులకు వరదలతో ఏపీని ముంచెత్తాయి. ఎగువన కురిసిన వానలతో ఏపీలో పెద్ద ఎత్తున నదులు రెండూ పొంగిపొర్లాయి. నిజంగా ఓ విధంగా ఇది మంచి పరిణామమే. అన్ని జలాశయాలు ఎండిపోయి ఉన్నాయి. తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్న జనం ఉన్నారు. దాంతో వరదలు సమయానికి వచ్చి ఆదుకున్నాయి. అయితే ఇంతటి అనుకూలత కూడ జగన్ కి ప్రతికూలతగా మారిపోయింది.

సీఎం ఎక్కడ….?

ఇపుడు ఇదే ప్రశ్నను ప్రతిపక్ష టీడీపీ అస్త్రంగా చేసుకుని జనంలోకి వెళ్ళిపోయింది. జగన్ వరదలు వచ్చినా పట్టించుకోలేదని, విదేశాల్లో విలాసాలు చేస్తున్నారని తమ్ముళ్ళు ప్రచారం మొదలెట్టేశారు. నిజంగా జగన్ అందుబాటులో లేకపోవడంతో పాలన గాడి తప్పిన సంగతి విదితమే. అసలు వైసీపీ సర్కార్ లో స్తబ్దత కూడా ఆవరించింది. సీనియర్ మంత్రులు ఎందుకో తమ పని కానట్టుగా ఉన్నారు. జూనియర్ల పొరపాట్లు, తడబాట్లు పాలనలో బాగా అనుభవం ఉన్న తమ్ముళ్ళకు ఆయుధాలుగా మారాయి. ఈ విషయంలో ఒక్క టీడీపీనే కాదు, ఇతర ప్రతిపక్షాలు కూడా గట్టిగా నోరు చేసుకుంటున్నాయి. ఏపీకి భారీ వరదలు వస్తే ముఖ్యమంత్రి విదేశాల్లో ఉండడమేంటని సీపీఐ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రచారం లేకనే…..

నిజానికి వానలు లేని చోట వరదలు వచ్చి జనానికి ఊరటను ఇచ్చాయి. ఈ విషయాన్ని జనంలో ప్రచారం చేసుకుని వరద బాధితులకు దగ్గరుండి సహాయ కార్యక్రమాలు చూసినట్లైతే జగన్ కి ఎంతో పేరు వచ్చేది. కానీ సరైన సమయంలో జగన్ కనిపించకుండా పోయారన్న అపకీర్తిని కోరి తెచ్చుకున్నారంటున్నారు. అసలు ముఖ్యమంత్రులకు, ప్రధానులకు సెలవులు ఉంటాయా అన్న చర్చ కూడా ఈ సందర్భంగా వస్తోంది. మోడీ అయితే 13 ఏళ్ల సీఎం పాలనలోనూ, అయిదేళ్ళ ప్రధాని కాలంలోనూ ఎక్కడా సెలవు పెట్టలేదని ఈ మధ్యనే చెప్పుకున్నారు. అలా చేసేవారూ ఉన్నారు, సీనియర్లను నమ్మి బాధ్యతలు అప్పగించిన వారూ ఉన్నారు. ఎటూ కాకుండా చేసినపుడే అపకీర్తిని మోయాల్సివుంటుంది మరి.

Tags:    

Similar News