జగన్ అపాత్ర దానం చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నదే చేస్తారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జగన్ పదవులను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ భర్తీ చేసిన [more]

Update: 2021-04-22 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నదే చేస్తారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జగన్ పదవులను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ భర్తీ చేసిన పదవులు పార్టీ కోసం కష్టపడ్డవారికి కాకుండా, సామాజికవర్గాల సమీకరణ చూసే జగన్ చేశారన్న విమర్శలు పార్టీ నుంచి విన్పిస్తున్నాయి. వైసీపీ నేతలు ఎందరో ఆశలు పెట్టుకున్నా జగన్ మాత్రం పార్టీ పునాదులు మరింత పటిష్టం చేసేందుకు ఎంపిక చేసిన వారికి ఇస్తున్నారు.

ఎంపిక చేసిన వారెవ్వరూ….?

అయితే జగన్ ఇప్పటి వరకూ ఎంపిక చేసిన వారు పార్టీకి ఎందుకూ ఉపయోగపడటం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. జగన్ అధికారంలోకి రావాలని ఎంతోమంది నేతలు ఎదురు చూశారు. దాదాపు పదేళ్ల పాటు శ్రమించారు. తమ నియోజకవర్గాల్లో పార్టీ ని బలోపేతం చేసేందుకు వారు ఆర్థికంగా కూడా నష్టపోయారు. కానీ ఎమ్మెల్సీల ఎంపికలో జగన్ కేవలం సామాజికవర్గాలనే చూడటం సరికాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

వారి సామాజికవర్గాలను కూడా…?

ఎందుకంటే ఇప్పుడు జగన్ ఎంపిక చేసిన నేతలను వారి సామాజికవర్గాలను ప్రభావితం చేసే వారు కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదిమంది ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు. వీరిలో టీడీపీ నుంచి వచ్చిన పండుల రవీంద్రబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీతతోపాటు మరికొందరు మైనారిటీ నేతలు కూడా ఉన్నారు. కానీ వీరివల్ల పార్టీకి ఉపయోగం లేదన్నది సీనియర్ నేతల అభిప్రాయం.

ఈసారైనా వారికి…?

త్వరలోనే మరో 14 ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటాతో పాటు స్థానిక సంస్థల కోటా కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటూ వైసీపీకి బలం ఉంది కాబట్టి మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకి దక్కే అవకాశముంది. ఈసారి జగన్ ఎవరికి అవకాశమిస్తారా? అన్న చర్చ పార్టీలో ఇప్పటి నుంచే ప్రారంభమయింది. మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, దాడి వీరభద్రరావు, ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి లాంటి వాళ్లు ఆశలు పెట్టుకున్నారు. ఈసారైన జగన్ కష్టపడిన వారికి అవకాశమిస్తారా? సామాజికవర్గాలను చూస్తారా? అన్నది చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News