జగన్ కు షర్మిల ఇబ్బంది కానుందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు చెల్లెలె షర్మిల పక్కలో బల్లెంలా మారనున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. [more]

Update: 2021-04-25 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు చెల్లెలె షర్మిల పక్కలో బల్లెంలా మారనున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ తో సానుకూలంగా ఉన్నారు. నీటి ప్రాజెక్టులు ఏపీలో కడుతున్నా పెద్దగా యుద్ధం చేయడం లేదు. ట్రైబ్యునల్, న్యాయస్థానాల ద్వారానే కేసీఆర్ కొంత జగన్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కేసీఆర్ తో సంబంధాలు….

జగన్ కు, కేసీఆర్ కు మధ్య సంబంధాలు ఇప్పటి వరకూ బాగానే ఉన్నాయి. కానీ ఆ సంబంధాలను షర్మిల దెబ్బతీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. షర్మిల అధికార పార్టీని, వ్యక్తిగతంగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకోవడంతో ఇక ఏపీ పైన కూడా కేసీఆర్ నజర్ పెట్టే అవకాశముందంటున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన అంశాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇద్దరూ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్న సమయంలో షర్మిల ఎంట్రీ వీటికి బ్రేక్ లు వేస్తుందంటున్నారు.

తెలంగాణాకే పరిమితమవుతారా?

కేవలం తెలంగాణ వరకే షర్మిల పరిమితం కాదన్నది విశ్లేషకుల అంచనా. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణలో షర్మిల జస్ట్ వార్మప్ కోసమే పార్టీ పెట్టారన్నడంలో నిజం లేకపోలేదు. నిజానికి షర్మిల చూపు కూడా ఏపీ పైనే ఉందంటున్నారు. అయితే అన్న అక్కడ అధికారంలో ఉండటంతో ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితమయ్యారన్న వార్తలు వస్తున్నాయి. జగన్ తనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎలాంటి ప్రాధాన్యత కల్పించడకపోవడ వల్లనే షర్మిల జగన్ అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారంటున్నారు.

తెలంగాణ ఎన్నికల తర్వాత?

ముందు తెలంగాణ ఎన్నికలు వస్తాయి. 2023 ఎన్నికల్లో షర్మిల పార్టీ తెలంగాణలో పోట ీచేస్తుంది. ఇక్కడ ఫలితాలను చూసి ఏపీలోనూ షర్మిల రంగంలోకి దిగుతారంటున్నారు. అయితే జగన్ ను కాదని షర్మిల ఏపీవైపు చూసే అవకాశం లేదని కొందరు వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నా, ఆమె దూకుడు చూస్తుంటే రాజకీయాల్లో తానేంటో నిరూపించుకోవాలని మాత్రం చూస్తున్నారు. మొత్తం మీద షర్మిల పార్టీతో జగన్ కు ఇటు ముఖ్యమంత్రిగా, అటు పార్టీ అధినేతగా ఇబ్బందులు తప్పవంటున్నారు.

Tags:    

Similar News