ఈసారీ జ‌గ‌న్ త‌ప్పు చేస్తున్నారా ? ఆ నిర్ణయంతో..?

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో వివాదాస్పద నిర్ణ‌యం తీసుకున్నట్టు అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ తీసుకున్న చాలా నిర్ణయాల్లో కొన్ని వివాదాలుగా మారాయి. [more]

Update: 2021-04-25 08:00 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో వివాదాస్పద నిర్ణ‌యం తీసుకున్నట్టు అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ తీసుకున్న చాలా నిర్ణయాల్లో కొన్ని వివాదాలుగా మారాయి. వీటిని ఏపీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు న్యాయ‌మూర్తులు సైతం త‌ప్పుబ‌ట్టిన ప‌రిస్థితి ఉంది. దీంతో ఆయా నిర్ణయాల‌ను వెన‌క్కి తీసుకోక త‌ప్పని స‌రి ప‌రిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయ‌మే జ‌గ‌న్ తీసుకున్నార‌నే ప్రచారం జ‌రుగుతోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా.. నేరుగా రాష్ట్రప‌తి నియామ‌కంతో రాష్ట్రాల్లో ప‌నిచేసే ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్ ఎస్ అధికారుల‌కు సంబంధించింది కావ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది.

వీరి పర్యవేక్షణలోనే….

ప్రస్తుతం జిల్లాల్లోని క‌లెక్టర్లు, ఎస్పీలు, ఫారెస్ట్ స‌ర్వీసు అధికారుల ప‌నితీరు ఎలా ఉంది? వారు ఏవిధంగా.. ముందుకు సాగుతున్నారు. ప్రజ‌ల‌కు ఎలాంటి సేవ‌లు అందిస్తున్నారు. ప్రభుత్వాల‌తో క‌లిసి ఎలా ప‌నిచేస్తున్నారు? అవినీతి ఆరోప‌ణ‌లు.. ఇలా అనేక రూపాల్లో వార్షిక నివేదిక‌ల‌ను ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి ప‌రిశీలిస్తున్నారు. వార్షిక ప‌ద్ధతిలో క‌లెక్టర్లపై ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శికి ప‌ట్టుటుంది. త‌ద్వారా వారిని ఆయ‌న నియంత్రించే అధికారం కూడా ఉంది. ఇక‌, పోలీసుల‌కు సంబంధించి ఎస్పీలు.. ఎలా ప‌నిచేస్తున్నారు? వివాదాస్పద అంశాల జోలికి వెళ్తున్నారా? లేదా? శాంతి భ‌ద్రత ప‌రిర‌క్షణ జిల్లాల్లో ఎలా ఉంది ? అనే అంశాల‌ను డీజీపీ నేరుగా ప‌రిశీలించి.. వార్షిక నివేదిక‌ల‌ను ఆమోదిస్తున్నారు.

పనితీరు నివేదికను…..

అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ వీటిని పూర్తిగా త‌న అధీనంలోకి తెచ్చుకునేలా పావులు క‌దిపారు. అంటే.. ఇక‌పై జిల్లాల్లోని క‌లెక్టర్లు, ఎస్పీల ప‌నితీరుకు సీఎం జ‌గ‌నే మార్కులు వేయ‌నున్నారు. వారు బ‌దిలీ కావాల‌న్నా.. లేక కేంద్ర ప్రభుత్వ స‌ర్వీసుల‌కు వెళ్లాల‌న్నా.. కూడా సీఎందే అంతిమ నిర్ణయంగా మార‌నుంది. అదే స‌మ‌యంలో వారిపై ఫిర్యాదులు, స‌త్కారాలు వంటివి కూడా పూర్తిగా ఆయ‌న‌కే ద‌ఖ‌లు ప‌డ‌తాయి. డీజీపీకానీ, ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి కానీ.. నిమిత్తమాత్రులుగా మార‌తారు. దీనికి సంబంధించి ఇకపై ఐఏఎస్, ఐపీఎస్‍ల పనితీరు నివేదికను సీఎం ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

మరోసారి చంద్రబాబు లాగా….

అయితే.. ఈ నిర్ణయంపై మెజారిటీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అంత‌ర్గతంగా చ‌ర్చిస్తున్నారు. సీఎం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ రాజ‌కీయ కోణంలోను, ఆ పార్టీకి స‌బందించి ఫేవ‌ర్ చేసేవిగాను ఉంటాయ‌నే విష‌యం వీరి మ‌ధ్య చ‌ర్చకు వ‌స్తోంది. పైగా కేంద్ర స‌ర్వీసు ఉద్యోగుల‌కు సంబంధించి న నియంత్రణ అంతా కూడా డీవోపీటీ చేతిలో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సీఎం క‌నుక ఈ బాధ్యత‌లు తీసుకుంటే.. త‌మ‌కు న‌ష్టమ‌నే అబిప్రాయంతో ఉన్నారు. దీనిపై వారు త్వర‌లోనే ఒక నిర్ణయానికి వ‌చ్చి.. దీనిని వ్యతిరేకించే అవ‌కాశం పుష్కలంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. గ‌తంలో చంద్రబాబు కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకుని.. డీవోపీటీ నుంచి వ్యతిరేక‌త ఎదుర్కొని వెన‌క్కి త‌గ్గారు. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా ఇలాంటి ప‌రాభ‌వం త‌ప్పదా? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి.

Tags:    

Similar News