జగన్ కు ఆ ప్రమాదం ఎప్పటికైనా తప్పదా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బలమైన నేత. కష్టపడి.. చెమటోడ్చి సీఎం పీఠాన్ని అధిష్టించారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారు. ఆయన అన్నింటినీ లైట్ [more]

Update: 2021-04-28 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బలమైన నేత. కష్టపడి.. చెమటోడ్చి సీఎం పీఠాన్ని అధిష్టించారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారు. ఆయన అన్నింటినీ లైట్ గా తీసుకుంటున్నారు. రాజకీయ నేత అన్నాక, పార్టీ అధినేత అన్నాక ప్రజల ముందుకు రావాల్సిందే. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను, సందేహాలను ఆ స్థానంలో ఉన్న జగన్ మాత్రమే నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఇక విపక్షాలు చేసే విమర్శలకు సయితం జగన్ సమాధానం చెబితేనే ప్రజలు నమ్ముతారు.

రెండేళ్లుగా….

కానీ జగన్ గత రెండళ్లుగా మీడియా ముందుకు రాలేదు. ఎన్ని విమర్శలొచ్చినా, ఎన్ని ఆరోపణలు తనపైనా, తన ప్రభుత్వంపైన విమర్శలు వచ్చినా జగన్ పట్టించుకోలేదు. మంత్రులపై అవినీతి ఆరోపణలొచ్చినా జగన్ స్పందించలేదు. సదరు మంత్రిపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు దానిని నిజమనే అనుకునే ప్రమాదముంది. అమరావతి రాజధాని భూ కుంభకోణంపై కూడా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు. అసెంబ్లీలో మాట్లాడటం తప్ప దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

బాబాయి హత్య కేసులో….

ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక ఆరోపణలు వస్తున్నాయి. వివేకా కూతురు సునీత సయితం తన అన్న న్యాయం చేయలేదని దేశ రాజధానిలో నినదించారు. దీనికి కూడా జగన్ సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. తల్లి విజయమ్మ చేత వివరణ ఇప్పించి మౌనంగా ఉన్నారు. దీనిపై టీడీపీ యువనేత నారా లోకేష్, చంద్రబాబులు సయితం సవాల్ విసిరారు. కానీ జగన్ మాత్రం తన బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో నామమాత్రపు స్పందన కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మౌనం అర్ధాంగీకారం….

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలోనూ అంతే. జగన్ విశాఖ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడారు. తర్వాత ప్రధాని మోదీకి లేఖ రాశారు. కానీ ఇంతవరకూ ప్రయివేటీకరణ విషయంలో మంత్రులు తప్ప జగన్ నోరు మెదపలేదు. కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక అంశాలపై జగన్ నుంచి జనం క్లారిటీ కోరుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం వేటిపైనా స్పందించేందుకు ఇష్టపడటం లేదు. ప్రతిపక్ష నేతగా తరచూ మీడియా ముందుకు వచ్చే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెస్పాండ్ కాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇలాగే ఉంటే జగన్ పై వచ్చే విమర్శలు, ఆరోపణలు ప్రజలు నిజమనుకునే ప్రమాదముంది.

Tags:    

Similar News