ఆ నియోజ‌క‌వ‌ర్గాలే జ‌గ‌న్ టార్గెట్‌… కండీష‌న్లు ఇవే ?

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్పటి నుంచే దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే 2024 వ‌ర‌కు ఎన్నిక‌ల కోసం ఆగే [more]

Update: 2021-05-28 14:30 GMT

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్పటి నుంచే దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే 2024 వ‌ర‌కు ఎన్నిక‌ల కోసం ఆగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. 2024లోనే ఎన్నిక‌లు వ‌స్తాయి. జ‌మిలి వ‌చ్చే అవ‌కాశం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ప‌ట్టుంది. ఎక్కడెక్కడ వీక్‌గా ఉంది.. గ‌త ఎన్నిక‌ల్లో ఎలాంటి స‌మీక‌ర‌ణ‌లు ప‌నిచేశాయి ? వంటి కీల‌క అంశాల‌ను ప‌రిశీలించిన‌ట్టు స‌మాచారం.

ఈ జిల్లాల్లోనే…?

ఈ క్రమంలో.. ముఖ్యంగా టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌లుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో గెలిచినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు కృషి చేయాల‌ని.. సూచిస్తూనే.. టీడీపీ నేత‌లు గెలిచిన స్థానాల్లోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేలా.. వ్యూహాలు సిద్ధం చేయాల‌ని.. జ‌గ‌న్ త‌న కీల‌క స‌ల‌హాదారుల‌ను ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో 23 స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అదే స‌మ‌యంలో టీడీపీకి బ‌లమైన జిల్లాలుగా ఉన్న అనంత‌పురం, ఉభ‌య‌గోదావ‌రి, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోనూ వైసీపీ కొన్ని స్థానాలు ద‌క్కించుకుంది.

టీడీపీ నియోజకవర్గాలపై…

అయిన‌ప్పటికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌ల‌పై (అంటే.. జంపింగుల‌పై) ఆధార‌ప‌డ‌కుండా.. సొంత‌గా ఎదిగేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసుకోవాల‌ని.. జ‌గ‌న్ సూచించిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అమ‌లు చేస్తున్న కార్యక్రమాల‌ను ప్రతిప‌క్ష నేత‌లు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రింత ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌డం ద్వారా.. ప్రభుత్వంపై సానుభూతి పెరిగేలా చూడ‌డం, టీడీపీ నేత‌ల‌కు నేరుగా ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా.. గ‌తంలో చంద్రబాబు అనుస‌రించిన పంథాలో వైసీపీ ఇంచార్జుల‌కు నిధులు ఇచ్చి.. మౌలిక స‌దుపాయాలు అభివృద్ధి చేసేలా చూడ‌డం వంటి అంశాల‌పై దృష్టి పెట్టాల‌ని.. జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

పాలనే కలసి రావాలని….?

నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో త‌న పాద‌యాత్ర క‌లిసి వ‌చ్చింద‌ని ప్రగాఢంగా న‌మ్ముతున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు త‌న పాల‌న క‌లిసిరావాలంటే.. అభివృద్ధిని అంద‌రికీ చేరువ చేయ‌డంతోపాటు.. ప్రతిప‌క్ష నేత‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రింతగా దూకుడు ప్రద‌ర్శించాల‌ని అదే గెలుపు గుర్రం ఎక్కిస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌ని ఇప్పటి నుంచే పావులు క‌దుపుతున్నారు. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News