లక్ష కోట్ల జగన్… ?

జగన్ విషయంలో టీడీపీ ఇప్పటికీ ఒకే పాట పాడుతూ ఉంటుంది. అదేంటి అంటే లక్ష కోట్లు మింగేశాడు, అవినీతి చేశాడు అని వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు [more]

Update: 2021-06-05 14:30 GMT

జగన్ విషయంలో టీడీపీ ఇప్పటికీ ఒకే పాట పాడుతూ ఉంటుంది. అదేంటి అంటే లక్ష కోట్లు మింగేశాడు, అవినీతి చేశాడు అని వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు తెర చాటు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు అని. నిజానికి ఈ లక్ష కోట్ల వెనక అసలు గుట్టును మాజీ మాంత్రి మైసూరారెడ్డి ఏనాడో విప్పారు కూడా. పెద్ద నంబర్ అయితే బాగుంటుంది అని లక్ష కోట్లు అని జగన్ కి తగిలించారు అని ఆయన చెప్పారు. ఇక ఈ లక్ష కోట్ల దోపిడీ అన్నది 2011 నుంచి 2014 వరకూ ఏపీలో తెగ మోత మోగిపోయింది. అయినా కూడా జనాలు వైసీపీకి ఆ ఎన్నికల్లో 67 సీట్లు ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా నిలబెట్టారు. ఇక 2019లో మరోసారి ఆ కార్డు తీసినా కూడా 151 సీట్లు వైసీపీ పరం అయ్యాయి.

అదే నిజమా …?

అయితే ఆ లక్ష కోట్ల మాటను జగన్ ముఖ్యమంత్రిగా రెండేళ్ల ఏలుబడిలో నిజం చేసుకుంటున్నారు అంటున్నారు. అదెలా అంటే జగన్ సంక్షేమ పధకాల ద్వారా జనాలకు డైరెక్ట్ గా నగదు బదిలీ స్కీం తో అందించినది అక్షరాలా లక్ష కోట్ల పై మాటే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అయితే తమ ప్రభుత్వం ప్రతీ పేద కుటుంబానికి నాలుగైదు పధకాల కిందన మొత్తం లక్షా 31 వేల కోట్ల రూపాయలతో నగదు ని ఏ మధ్యవర్తీ లేకుండా వారి ఖాతాలకే అందించింది అని ప్రకటించారు. ఇది జగన్ సర్కార్ గొప్పతనం అని కూడా ఆయన పొగిడారు.

లక్ష దాకా…?

ఇక ఏపీలో మొత్తం కోటీ యాభై లక్షలకు పైగా పేద కుటుంబాలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు. లక్షా ముప్పయి వేల కోట్ల రూపాయలతో ప్రతీ కుటుంబాన్ని ఆర్ధికంగా జగన్ ఆదుకున్నది అన్నది నిజం. ఆ లెక్కన చూస్తే సగటున ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయలు తగ్గకుండా సంక్షేమ పధకాల కింద నగదు డైరెక్ట్ గా ఖాతాలో జమ అయింది అంటున్నారు. అంటే జగన్ ఒక విధంగా ప్రతీ నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేశారని అంతా ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా చూసినా జగన్ కి లక్షకు మద్యన ఒక అందమైన లింక్ ని ఇపుడు ఇక్కడ చెప్పుకోవాల్సిందే.

అరుదైన ఘనత :

జగన్ సర్కార్ మ‌రో మూడేళ్ళు అధికారంలో ఉంటుంది. అయితే అప్పటికి కచ్చితంగా మరో లక్షన్నర రూపాయల దాకా ప్రతీ కుటుంబానికి నగదు బదిలీ ద్వారా అందుతుంది అని ధీమాగా చెప్పవచ్చు. అంటే జగన్ కి ఓటేసిన ప్రతీ పేద కుటుంబానికీ అయిదేళ్ళ కాలానికి రెండున్నర లక్షల దాకా నేరుగా నగదు ఇంటికి వచ్చిందంటే అది వైసీపీ సర్కార్ కి శ్రీరామ రక్షగానే ఉంటుంది అంటున్నారు. ఈ నగదు బదిలీ పధకాన్ని 2009 లో టీడీపీ వల్లె వేసినా అలాగే దేశంలో చాలా చోట్ల అరకొరగా అమలు చేసినా కూడా ఇంతటి విసృత స్థాయిలో జనాలకు లక్షల కోట్లు వెచ్చించి మరీ డబ్బుల మూటలను అందిస్తున్నది మాత్రం అచ్చంగా జగనే అని చెప్పాలి. ఆ విధంగా చూస్తే జగన్ అరుదైన ఘనతను సాధించారు అంటున్నారు. మొత్తానికి జగన్ భాషలో చెప్పాలంటే పేదవాడిని గత రెండేళ్ళలో లక్షాధికార్లను చేసి వారి జీవితాల్లో ప్రగతి ఫలాలను తెచ్చారనే భావించాలి.

Tags:    

Similar News