అసలైన జగన్ ని అప్పుడు చూస్తారట

వైఎస్ జగన్ ఇపుడున్న రాజకీయాల్లో విలక్షణ వ్యక్తిగానే చెప్పాలి. ఆయన మిగిలిన నాయకుల మాదిరిగా ఇచ్చిన హామీలను తప్పడంలేదు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఎనిమిది హామీలను [more]

Update: 2020-01-12 13:30 GMT

వైఎస్ జగన్ ఇపుడున్న రాజకీయాల్లో విలక్షణ వ్యక్తిగానే చెప్పాలి. ఆయన మిగిలిన నాయకుల మాదిరిగా ఇచ్చిన హామీలను తప్పడంలేదు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఎనిమిది హామీలను వరసగా తీర్చేశారు. నవ రత్నాలను మ్యానిఫేస్టోలో పెట్టి జనం వద్దకు వెళ్ళి ఓట్లు తీసుకున్న జగన్ బంపర్ మెజారిటీతో నెగ్గారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండే ఆయన ఒక్కో హామీని నెరవేరుస్తూవస్తున్నారు. తాజాగా అమ్మ ఒడి పేరిట 45 లక్షల కుటుంబాలకు 6 కోట్ల యాభై లక్షల నిధులను విడుదల చేసి ఒక్కో తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేశారు. దీంతో జగన్ ఎనిమిది హామీలను నెరవేర్చారని అంటున్నారు. ఇక మిగిలింది పాతిక లక్షల ఇళ్ళ నిర్మాణం.

ఉగాదితో సరి….

ఉగాది వేళ ఆ హామీని కూడా తీర్చేందుకు జగన్ సిధ్ధపడుతున్నారు. విడతల వారీగా అయిదేళ్ళ కాలంలో పాతిక లక్షల ఇళ్ళను పేదలకు నిర్మించి ఇవ్వాలన్నది జగన్ ఆలోచన. దానిలో భాగంగా అయిదు లక్షల ఇళ్ళని నిర్మించి ఇచ్చే భారీ పధకానికి ఉగాది వేళ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. దాంతో జగన్ నవరత్నాల హామీలు పూర్తి అవుతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. జగన్ మాదిరి ఇచ్చిన మాట మీద కట్టుబడి హామీలను తీర్చే నేత దేశంలోనే మరొకరు కనిపించరని ఆయన కొనియాడారు. ఇదే విషయమై కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి కూడా జగన్ ని మెచ్చుకున్నారు. ఏపీ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా జగన్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పేద తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు వేశారని గుర్తుచేశారు.

ఇక దూకుడేనా…?

రాజకీయంగా ఇక దూకుడుగా జగన్ ఉంటారని పార్టీలో వినిపిస్తోంది. ఇంతవరకూ హామీల విషయంలో మల్లగుల్లాలు పడిన జగన్ వాటిని కష్టపడి, ఇష్టపడి మరీ నెరవేర్చారని, ఇక రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతూ ముప్పయ్యేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఏపీని పాలించేలా ప్రణాళికలను సిధ్ధం చేస్తున్నారని అంటున్నారు. జగన్ ఇప్పటిదాకా కేవలం ముఖ్యమంత్రి గానే గట్టిగా పనిచేశారని, ఇకపై వైసీపీ అధినేతగా కూడా మరొ వైపు చూపు సారిస్తారని, అపుడు ఏపీలో విపక్షాలకు చోటు దక్కడమే కష్టమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అభివృధ్ధితో అలా…..

ఇంతవరకూ సంక్షేమం అజెండాను వేగంగా అమలు చేసిన జగన్ ఇకపైన అభివృధ్ధికి పెద్ద పీట వేస్తారని, తాను ఇచ్చిన మాట ప్రకారం ఏపీలోని మూడు ప్రాంతాలను ప్రగతిపధంలో నడిపించిన మీదటనే ఆయన 2024 ఎన్నికల్లో ఓటు అడుగుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ జిల్ల్లాలోనూ అభివృధ్ధి పధకాలు అమలు చేయడం, మొత్తం ఏపీని జోన్లుగా, సెక్టార్లుగా, జిల్లాలుగా విభజించి మరీ క్షేత్ర స్థాయిలోకి ప్రగతి ఫలితాలు వచ్చేలా చేయడం జగన్ యాక్షన్ ప్లాన్ గా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రిగా రెండవ ఏడాదిలో అసలైన జగన్ ని అంతా చూస్తారన్న మాట.

Tags:    

Similar News