Ys jagan : ఈదురు గాలుల్లోనూ వీరతాళ్లు పడలేదే?

తుఫాన్ అంటే హంగామా ఏది……! హడావుడి ఏది? సచివాలయం మొదటి బ్లాక్ లో ఆర్టీజీఎస్ లో నిలబడి…, తుఫాన్ ను తీరం దాటించే దృశ్యాలు ఏవి? ఆ [more]

Update: 2021-09-27 05:00 GMT

తుఫాన్ అంటే హంగామా ఏది……! హడావుడి ఏది? సచివాలయం మొదటి బ్లాక్ లో ఆర్టీజీఎస్ లో నిలబడి…, తుఫాన్ ను తీరం దాటించే దృశ్యాలు ఏవి? ఆ బీచ్ ఒడ్డుకు వెళ్లిన వారికి వెలగపూడి నుంచి వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం ఏది? ఆర్టీజీఎస్ పీఆర్వోలు విడతల వారీగా ప్రభుత్వ ప్రాధాన్య ఛానళ్ల వారికి వార్ రూమ్ నుంచి న్యూస్ రూమ్ అప్ డేట్స ఇప్పించే కార్యక్రమం కూడా లేదు. 72గంటల ముందు నుంచి ముఖ్యమంత్రి హెచ్చరికలు, ప్రకటనలు…., తుఫాను సన్నద్దతలు లేవు.

ఆ హడావిడి ఏదీ?

శ్రీకాకుళం తుఫాన్ కోసం చిత్తూరు నుంచి ప్రత్యేక దళాలు బయలుదేరిన దాఖలాలు లేవు. చెన్నై బెంగళూరు నుంచి విద్యుత్ సామాగ్రి తరలింపు లేదు. అయిదేళ్ల క్రితం తుపాను వచ్చిన సమయంలో ఇదే సీన్ చూశాం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హడావిడి చూశాం. తుపాను ఎదుర్కొనడానికి ఆయన శ్రమించిన తీరు. నిద్రాహారాలు లేకుండా తుపాను నుంచి ప్రజలను సురక్షితంగా బయటపడేసిన కథనాలను మీడియాలో ఎన్నో చూశాం.

ఏం చేశారో?

కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో జగన్ ఉన్నారు. ఆయనకు ఏమీ చేతకాదు. గులాబ్ తుపాను ను ఎదుర్కొనేందుకు ఆయన ఏం సమీక్షలు చేశారో? ఎవరికి ఆదేశాలు ఇచ్చారో? ఎవరికీ తెలియదు. గులాబ్ తుపాను మాత్రం తీరం దాటేసింది. అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ జగన్ కు అనుకున్న మైలేజీ మాత్రం రాలేదు. మరి ఈ విషయంలో జగన్ ఫెయిల్యూర్ కాదంటారా?

మీడియాలో కన్పించినవి….

ఈ సమయంలో మీడియాలో అంతటా జగనే కన్పించాలి. అది జరగలేదు. కేవలం తుపానువల్ల వచ్చిన ఈదురు గాలుల శబ్దమే మీడియాలో విన్పించింది. పడిన చినుకులే కన్పించాయి. అధికారులే అన్ని పనులు చేసి, గుట్టుగా సమీక్షలు చేస్తే జగన్ కు ఇమేజ్ ఎలా వస్తుంది. ఒకవర్గం మీడియాలో జగన్ పై గులాబ్ ఫెయిల్యూర్ ముద్రపడుతుంది. పోనీ తుఫాన్ ఏర్పాట్ల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారా అంటే అదీ లేదు…. కాలు బెణికింది అన్నారు. అసలు ఎంత పెద్ద ఈవెంట్. సంక్షోభంలో అవకాశం…..! ఏమి లేవు….. ఓన్లీ రెయిన్.

Tags:    

Similar News