మనశ్శాంతి లేకపోవడంతో?

ముఖ్యమంత్రిగా జగన్ వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనకు వచ్చిన బంపర్ మెజారిటీ కూడా దానికి కారణం అవుతోంది. ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలకు వారు కోరుకున్న [more]

Update: 2020-01-30 06:30 GMT

ముఖ్యమంత్రిగా జగన్ వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనకు వచ్చిన బంపర్ మెజారిటీ కూడా దానికి కారణం అవుతోంది. ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలకు వారు కోరుకున్న విధంగా పాలన చేయకపోతే అధికారం ఎందుకన్న ధోరణిలో జగన్ ముందుకు సాగుతున్నారు. ఆయన వస్తూనే గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ ని అమలుచేశారు. ఇక మూడు రాజధానులు, నాలుగు ప్రాంతీయ బోర్డులు అంటున్నారు. దానికి తోడు అన్నట్లుగా కొత్త జిల్లాలను తొందరలో ప్రకటిస్తారని కూడా టాక్ ఉంది. ఇపుడు మరో అతి పెద్ద నిర్ణయం దిశగా జగన్ ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు.

ఆది నుంచి కష్టాలేనా…?

ఇపుడు మరో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మారుస్తారన్నదే ఆ ప్రచారం. ఆంధ్ర ప్రదేశ్ పేరు ఏ విధంగానూ అచ్చిరావడంలేదని వైసీపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారుట. దానికి చారిత్రక కారణాలను కూడా చూపిస్తున్నారు. ఉమ్మడి మద్రాస్ నుంచి వేరు పడిన నాటి నుంచి కూడా కష్టాలే తప్ప సుఖాలు లేవని, ఎవరి అభివృధ్ధి కోసమో పనిచేయడం తప్ప సొంత రాష్ట్రం బాగుపడింది లేదని అంటున్నారు. ఇక రాజధానులు కూడా ఏపీకి కలసిరాకపోవడం వెనక కూడా ఆంధ్ర ప్రదేశ్ పేరు ఉండడమేనని భావిస్తున్నారుట. దాంతో ఆంధ్ర ప్రదేశ్ పేరు మారుస్తారని చెబుతున్నారు.

అరడజను రాజధానులైనా…?

జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులతో కలుపుకుంటే ఏపీకి అచ్చంగా అరడజను రాజధానులవుతున్నాయి. అయినా ఎక్కడా సుఖం శాంతి, అభివృధ్ధి మాత్రం కానరావడంలేదు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మద్రాస్ రాజధాని, తరువాత ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు, ఆ మీదట‌ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాద్, అయిదేళ్ళ నవ్యాంద్రాలో అమరావతి, ఇపుడు కొత్తగా కర్నూలు, విశాఖ ఇలా రాజధానుల చుట్టూ తిరగడంతోనే ఏపీ కధ అయిపోతోందని అభివృద్ధికాముకులు మదన పడుతున్నారు. మరో వైపు చూసుకుంటే ఎపుడు రాజధాని ప్రస్తావనకు వచ్చినా కూడా వివాదాలే ముందుకు వస్తున్నాయి. దీంతో ఏపీ రాష్ట్రం పేరే మార్చేస్తే పోలా అన్న నిర్ణయం విషయంలో వైసీపీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారట.

తెలుగునాడుగా…..

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయాక వారు తమిళనాడుగా పేరు మార్చుకున్నారు. బాగా అభివృధ్ధి చెందారు. ఇక హైదరాబాద్ స్టేట్ గా ఉన్న రాష్ట్రం ఉమ్మడి ఏపీలో విలీనం అయింది. ఇపుడు విభజన తరువాత దాన్ని అచ్చమైన తెలుగులో తెలంగాణా అని పిలుచుకుంటున్నారు. పొరుగున ఉన్న ఒరిస్సా కూడా తన పేరును ఒడిషా గా మార్చుకుని ప్రగతి దారి పట్టింది. పశ్చిమ బెంగాల్ కాస్త పశ్చిమ బంగాగా పేరు మార్చుకుంది. ఇలా దేశంలో అనేక రాష్ట్రాలు భావి కోసం ఆశ పడుతూ పేర్లు మార్చుకున్న దాఖలాలు కళ్ళ ముందే ఉన్నాయి. ఆ బాటలో ఏపీ కూడా నడవాలనుకుంటోందట. అందుకోసం కొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ప్రముఖంగా తెలుగునాడు అన్నది ముందుకు వస్తోంది.

అన్న గారి కోరిక…

నిజానికి తెలుగునాడు అన్నది అన్న గారి కోరిక అని చెబుతారు. తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వాడి గుండె తలుపు తట్టిన నందమూరి అదే ఊపులో రాష్ట్రానికి కూడా తెలుగుదనం పూయాలనుకున్నారు. కాంగ్రెస్ పెద్ద నెహ్రూ ఆనాడు పెట్టిన ఆంధ్ర ప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాల‌నుకున్నారు. అయితే ఏ కారణం చేతనో అది ఆగింది. ఇపుడు ఆ ముచ్చట జగన్ తీరుస్తారా అన్న చర్చ సాగుతోంది. జగన్ అనుకుంటే ఆపేవారు లేరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా పెడితే జాతకరిత్యా, సంఖ్యాశాస్త్రం రిత్యా కలసివస్తుందని అనేవారూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ పేరులోనే దుష్ట సమాసం ఉందని, పైగా హిందీ పదమైన ప్రదేశ్ ని చేర్చడం వల్ల విచిత్రంగా మారి ఇపుడు విధి విషాదంగా ఏపీ అభివృద్ధినే అది అడ్డుకుంటోందన్న చర్చ కూడా చాలాకాలం క్రితమే మేధావులు లేవనెత్తారు. మరి జగన్ వీటిని దఋష్టిలో పెట్టుకుని అచ్చమైన తెలుగు పేరుని ప్రకటిస్తే ఏపీ కష్టాలు తప్పుతాయేమో చూడాలి.

Tags:    

Similar News