షాక్ ట్రీట్ మెంట్…తేరుకోలేక పోతున్నారా?

అమరావతి ఒక సామాజికవర్గానికి చెందినదని గత అయిదేళ్ళుగా అంతా అంటూ వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ సర్కార్ కూడా ఆరోపించింది. [more]

Update: 2020-02-26 08:00 GMT

అమరావతి ఒక సామాజికవర్గానికి చెందినదని గత అయిదేళ్ళుగా అంతా అంటూ వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ సర్కార్ కూడా ఆరోపించింది. దానికి తగినట్లుగా ఇపుడు సిట్ విచారణ కూడా జరిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే అమరావతిలో పేదలు, సామాన్యులు అందరూ ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు అనేక పర్యాయాలుగా ప్రకటిస్తున్న నేపధ్యంలో ఆ దిశగా చర్యలు ఇపుడు మొదలయ్యాయి. ఓ విధంగా చంద్రబాబుకు, ఇతర ప్రతిపక్షాలకు గట్టి ఝలక్ ఇచ్చేలా జగన్ అమరావతి రాజధాని విషయంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇపుడు అక్కడ పేదలకు ఆస్తిగా విలువైన భూమి దఖలు పడబోతోంది.

పేదలకు ఇళ్ళు….

ఉగాది నాటికి ఏపీలో పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో అయితే ల్యాండ్ పూలింగ్ ద్వారా గత సర్కార్ తీసుకున్న భూముల్లో కొంత భాగాన్ని పేదలకు ఇళ్ళ కోసం జగన్ కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. నిజంగా ఇది టీడీపీకి, ఇతర ప్రతిపక్షాలకు కూడా కక్కలేక, మింగలేక అన్నట్లుగా మారుతుందని అంటున్నారు. అక్కడ పేదలకు ఇళ్ళ స్థలాల కోసం పంపిణీ చేసేందుకు నిర్ణయించ‌డ‌మే కాదు…అందుకు త‌గ్గ ఉత్తర్వుల‌ను కూడా జగన్ సర్కార్ జారీ చేసింది. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉన్న మొత్తం 54,307 మంది లబ్ధిదారులకు సెంటు భూమి చొప్పున రాజ‌ధానిలో 1,251.5065 ఎకరాల భూమిని కేటాయిస్తూ మునిసిపల్‌ పరిపాలన శాఖ జీవో నెంబరు. 107ని తాజాగా విడుదల చేసింది.

చిత్తు అయ్యారా…?

ఓ విధంగా అమరావతి ఉద్యమం ఎత్తుగడలకు జ‌గ‌న్ స‌ర్కార్ వేసిన పై ఎత్తుగా దీన్ని పేర్కొంటున్నారు. అక్కడే రాజధాని ఉండాలని, ఆ విలువైన భూములు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగపడాలని దబాయించి మరీ పెత్తందార్లు కొందరు చేయిస్తున్న ఆందోళనలకు జగన్ తనదైన రీతిలో షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారని అంటున్నారు. అక్కడ ఉన్న ఖరీదైన భూమి ఎటూ ప్రభుతానికి రైతులు ల్యాండ్ పూలింగులో ఇచ్చారు. దాన్ని దళితులు, పేదలకు జగన్ ఇవ్వడం ద్వారా విపక్షానికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని అంటున్నారు. ఇపుడు ఆ భూమిని పేదలకు, అందునా దళితులకు ఇవ్వవద్దని అడిగే దమ్ము ధైర్యం విపక్షాలకు లేనేలేదు. మరో వైపు ఆ భూములు పొందిన పేదలు, లబ్దిదారులు అర లక్షకు పైగా కుటుంబాలు ఉన్నారు. వారంతా ఇపుడు జగన్ సర్కార్ కి అనుకూలంగా ఉంటారు. దాంతో రాజధానిలో వైసీపీ బలం ఒక్కసారిగా పెరిగిపోతుంది.

బ్యాలన్స్ చేశారా?

అమరావతి అంటే సంపన్నుల రాజధానిగా మార్చాలని గత సర్కార్ చూసింది పేరుకు తెల్లకార్డుదారులు అక్కడ భూములు కొన్నారు కానీ వారంతా పెద్దలకు బినామీలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఇపుడు అసలైన పేదలు, అట్టడుగు సామాజికవ‌ర్గాల వారు అక్కడ చోటు సంపాదించేలా జగన్ సర్కార్ తీసుకున్న చర్యల వల్ల ప్రజా రాజధానిగా అమరావతి మారుతుందని అంటున్నారు. సామాజిక సమతూల్యత కూడా దీని వల్ల సాధ్యపడుతుందని భావిస్తున్నారు. తొందరలోనే అమరావతి రాజధాని ప్రాంతాన్ని మునిసిపాలిటీగా మారుస్తున్నారు. దాంతో మరింతగా అభివృధ్ధి చేసి అన్ని వర్గాల ప్రజలకు అవకాశం ఇచ్చేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. అదే జరిగితే అమరావతి రాజధాని రోదన కేవలం 29 గ్రామాల్లో కూడా వినిపించే అవకాశాలు ముందు ముందు ఉండకపోవచ్చేమో.

Tags:    

Similar News