కాగల కార్యాన్ని ఆయనే తీర్చేస్తున్నారుగా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నది జరగాలనుకుంటారు. అడ్డు వచ్చిన వారిపై వేటు వేయడానికి ఏమాత్రం వెనకడగు వేయరు. అది ఆయన వీక్ నెస్ అనుకోవాలా? లేక [more]

Update: 2020-04-11 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నది జరగాలనుకుంటారు. అడ్డు వచ్చిన వారిపై వేటు వేయడానికి ఏమాత్రం వెనకడగు వేయరు. అది ఆయన వీక్ నెస్ అనుకోవాలా? లేక నైజం అని భావించాలా? అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసి కేవలం పదినెలలు మాత్రమే. ఈ పది నెలల్లో ఎన్నో వివాదాలు. ఎన్నో నిర్ణయాలు. వీటిలో దాదాపు 90 శాతం కక్ష పూరిత నిర్ణయాలేనన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.

ఒడిదుడుకులు సహజం….

రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం. 151 సీట్లు ఇచ్చినంత మాత్రాన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడ ఎంతవరకూ సబబు? రాజ్యాంగ పరంగా జగన్ కు అన్ని హక్కలు సంక్రమించినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. జగన్ తన నిర్ణయాలకు అడ్డు చెప్పిన వారిని ఎవరిపైనైనా నిర్దాక్షిణ్యంగా వేటువేస్తారనడానికి ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందు కన్పిస్తున్నాయి.

ఏకపక్ష నిర్ణయాలతో…..

శాసనమండలిలో తమ ప్రభుత్వం బిల్లులను అడ్డుకుంటుందన్న కారణంటా ఏకంగా మండలినే జగన్ రద్దు చేశారు. తనకు అత్యంత ఆప్తుడిగా మెలిగిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇంటికి పంపారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించడం కూడా అంతే. జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. పరిపాలన అనుభవం తక్కువ. తాను అనుకున్నది చేయాలనుకున్నప్పుడు సాంకేతికంగా, రాజ్యాంగ పరంగా అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. అయితే వీటిని సానుకూల దృష్టితో చూడాల్సిన జగన్ అధికారులు పనికి రారని భావించడం ఎంతవరకూ కరెక్ట్? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అభ్యంతరం చెబితేనే అడ్డుతొలగిస్తారా?

నిజానికి జగన్ సంక్షేమ కార్యక్రమలను ఎన్నో అమలుపర్చారు. వీటికి వేల కోట్ల నిధులు అవసరం అవుతుంది. రాష్ట్రాన్ని నడిపించాల్సిన అధికారులు ఆదాయం, వ్యయం వివరాలను బేరీజు వేసుకునే నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ మార్గాలను పెంచడం కోసం శ్రమించాల్సిన పాలకపక్షం అభ్యంతరం చెబితే అడ్డుతొలగించుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలను వైసీపీ నేతలు గుడ్డిగా సమర్థించవచ్చు. అయితే భవిష్యత్తులో మాత్రం దీని ప్రభావం పార్టీపై ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఎన్నికల సంస్కరణ కోసమేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును జగన్ ఎంత సమర్థించుకున్నా ప్రజలకు మాత్రం జరుగుతున్నది స్పష్టంగా అర్థమవుతోంది.

Tags:    

Similar News