జగన్ ఫినిషింగ్ టచ్ ఇస్తారా? మూడు జిల్లాల్లోనూ?

అధికార వైసీపీలో పంచాయ‌తీలు రోజు రోజుకు ముదురుతున్నాయి. వీటికి తన‌దైన శైలిలో సీఎం జ‌గ‌న్ ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాల్లోని కీల‌క [more]

Update: 2020-05-26 05:00 GMT

అధికార వైసీపీలో పంచాయ‌తీలు రోజు రోజుకు ముదురుతున్నాయి. వీటికి తన‌దైన శైలిలో సీఎం జ‌గ‌న్ ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాల్లోని కీల‌క నియో జక‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు, విభేదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. నిజానికి త‌మ పార్టీ అధికారం లో ఉంది క‌నుక ప‌నిచేసి.. ఆ ర‌కంగా పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నేత‌ల‌పై ఉంది. అయితే, ఆ ర‌కంగా కాకుండా.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నవిధంగా నేత‌లు వ్యవ‌హ‌రించ‌డ‌మే ఇప్పుడు వైసీపీని రోడ్డున ప‌డేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

టీడీపీ నుంచి వచ్చిన నేతలతో….

ఈ మూడు జిల్లాల నుప‌రిశీలిస్తే.. పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న నాయ‌కుల‌ను ఇటీవ‌లే పార్టీ త‌ర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ నాయ‌కులు డామినేట్ చేయాల‌ని చూడ‌డం, దీనికి పార్టీలోని మ‌రికొంద‌రు స‌హక‌రిస్తుండ‌డం వంటివి పార్టీని డైల్యూట్ చేసే ప‌రిణామాలుగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ప్రకాశం ను తీసుకుంటే.. రెండు నియోజ‌క‌వ‌ర్గాలు.. చీరాల‌, అద్దంకిలో క‌ర‌ణం వ‌ర్సెస్ గ‌ర‌ట‌య్య, ఆమంచిల వ్యవ‌హారం రోజు రోజుకు ముదురుతోంది. చీరాల‌లో ఆమంచి వ‌ర్సెస్ క‌ర‌ణం వార్‌… అద్దంకిలో గ‌ర‌ట‌య్య వ‌ర్సెస్ క‌ర‌ణం వార్ జోరుగా న‌డుస్తోంది.

కృష్ణా జిల్లాలోనూ….

ఇక‌, కృష్ణాను తీసుకుంటే.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బొప్పన భ‌వ ‌కుమార్ వ‌ర్సెస్ దేవినేని అవినాష్‌ల మ‌ధ్య రోజు రోజుకు వివాదాలు ముదురుతున్నాయి. అవినాష్‌ను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆయ‌న‌కు తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇచ్చి.. భ‌వ‌కుమార్‌కు న‌గ‌ర పార్టీ అధ్యక్ష ప‌ద‌వి ఇచ్చినా కూడా ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. ఇక ఈ రెండు వ‌ర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇలా ఈ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో ఈ రెండు వ‌ర్గాల‌కు తోడు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పార్టీని న‌డిపించిన మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వ‌ర్గం కూడా ఉంది.

గుంటూరు వెస్ట్ లోనూ….

ఇక‌, గుంటూరులోనూ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో లేళ్ల అప్పిరెడ్డికి, ఇటీవ‌లే పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరికి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డివేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ ప‌రువు రోడ్డున ప‌డు తోంది. అప్పిరెడ్డి జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు కావ‌డంతో ఎక్కడా వెన‌క్కి త‌గ్గడం లేదు. ఇక ఇంత వ్యతిరేక‌త గాలిలోనూ టీడీపీ నుంచి గెలిచిన మ‌ద్దాలి గిరికి క‌మ్యూనిటీ బ‌లంతో పాటు కాస్త సొంత బ‌లం ఉంది. దీంతో వీరిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనేంత‌గా ఢీ కొడుతున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్‌చార్జ్ చంద్రగిరి ఏసుర‌త్నం ఆట‌లో ఆర‌టి పండుగా మారిపోయారు.

లాక్ డౌన్ ఎత్తివేశాక…..

నిజానికి జ‌గ‌న్ చెబుతున్నది ఒక‌టైతే.. పార్టీ నేత‌లు చేస్తోంది మ‌రొక‌టి అన్న విధంగా ప‌రిస్థితి మారి పోయింది. ప్రభుత్వం చేస్తున్న ప‌నులను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని జ‌గ‌న్‌ప‌దేపదే చెబుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల‌పై ప్రజ‌ల‌ను చైత‌న్యం చేయాల‌ని అంటున్నారు. అయినా కూడా నేత‌లు ఒక‌రితో ఒక‌రు తంపులు పెట్టుకుని రోజులు వెళ్లదీస్తున్నారు త‌ప్పితే జ‌గ‌న్‌ను ఎక్కడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పటికే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌గ‌న్ కు ఫిర్యాదులు అందాయ‌ని లాక్‌డౌన్ ఎత్తేశాక‌.. పార్టీలో నేత‌ల‌కు త‌లంట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News