జగన్ మాస్టర్ స్ట్రోక్ ..టార్గెట్ చినబాబు?

చంద్రబాబు మాటల మనిషి. చేతలకు వెళ్లడానికి చాలా ఆలోచిస్తారని తమ్ముళ్ళు ఆఫ్ ది రికార్డుగా అంటారు. అదే జగన్ విషయం తీసుకుంటే ఆయన మాటలు తక్కువగా ఉంటాయి. [more]

Update: 2020-06-12 06:30 GMT

చంద్రబాబు మాటల మనిషి. చేతలకు వెళ్లడానికి చాలా ఆలోచిస్తారని తమ్ముళ్ళు ఆఫ్ ది రికార్డుగా అంటారు. అదే జగన్ విషయం తీసుకుంటే ఆయన మాటలు తక్కువగా ఉంటాయి. మనసులో ఏముందో ఎవరితోనూ పంచుకోరు. ఆయన ఎత్తులు, ఎత్తుగడల కంటే దూకుడునే నమ్ముకుంటారు. అలాంటి దూకుడే ఇపుడు మళ్ళీ కనిపిస్తోంది. గత చంద్రబాబు సర్కార్లో జరిగిన అవినీతి మీద సీబీఐ విచారణకు జగన్ మంత్రివర్గం ఆదేశించడాన్ని ఆ విధంగానే చూడాలి. ఇందులో విశేషం ఏంటి అంటే చంద్రన్న పధకాలు పేరిట జరిగిన అవినీతితో పాటు, అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ మీద ఉచ్చు బిగించేలా జాగ్రత్తగా కధ నడిపించారు. ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో జరిగిన వందల కోట్ల స్కాం మీదనే సీబీఐ విచారణ చేస్తుందని అంటున్నారు.

సవాల్ కి జవాబు ….

చంద్రబాబు గత ఏడాదిగా ఎపుడూ సవాల్ చేస్తూ వచ్చారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించుకోండి అంటూ గట్టిగానే మాట్లాడారు. మాది స్వచ్చమైన ప్రభుత్వం, ఎక్కడా ఒక్క అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. తోక ముడిచారు అంటూ ఘాటుగానే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక తండ్రి వైఎస్సార్ హయాంలోనే ఎన్నో కమిటీలు వేసి నిరూపించలేదు, జగన్ ఏం చేయగలడని కూడా బాబు రంకెలు వేశారు. అయితే ఇపుడు దానికి సరైన జవాబు అన్నట్లుగా జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారు, పైగా నేరుగా బాబు, ఆయన కొడుకు లోకేష్ టార్గెట్ గా ఈ విచారణ అంశాలు ఉండడం విశేషం.

చూసీ చూడనట్లుగా…

జగన్ ఏడాది పాటు చంద్రబాబు సర్కార్ లో ఎక్కడ అవినీతి జరిగింది అన్న దానిమీదనే దృష్టి పెట్టారు. ఓ వైపు అమరావతి స్కాం విషయంలో ఆయన సీఐడీ విచారణ జరిపిస్తున్నారు. అది తీగను దాటి డొంక వైపుగా కదులుతోంది. ఇంకోవైపు ప్రభుత్వపరంగా వివిధ శాఖల్లో జరిగిన అవినీతి మీద కూడా ఉప సంఘాన్ని నియమించారు. ఇక్కడే జగన్ మాస్టర్ మైండ్ బాగా పనిచేసిందనుకోవాలి. మంత్రి వర్గం ఉప సంఘమే చాలా వరకూ ఆధారాలు సేకరించి నివేదిక సమర్పించింది. దాంతో ఈ దీని మీద సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా జగన్ కీలక ఆధారాలే వారికి అందించి దర్యాప్తు సులువు చేయబోతున్నారు. ఇక నాడు తీసుకున్న అనేక నిర్ణయాలు విధి విధానాలు ఏవీ పట్టని తీరును చూసీ చూడనట్లుగా జరిగాయని అంటున్నారు. ఎందుకంటే జగన్ ని కనీసం పట్టించుకోకుండా 2050 వరకూ మేమే అధికారంలో ఉంటామన్న అతి ధీమాతో టీడీపీ సర్కార్ నాడు తీసుకున్న అనేక నిర్ణయాలు ఇపుడు కొంప ముంచబోతున్నాయని అంటున్నారు.

ఇరుక్కున్నట్లేనా..?

ఫైబర్ గ్రిడ్ పేరిట జరిగిన మొత్తం వ్యవహారాలను నాడు ఐటీ మంత్రి లోకేష్ చూశారు, ఆయనతో కొంతమంది సన్నిహితులైన వారు జతచేరి తమకు కోరినట్లుగా కధ నడిపించారని అప్పట్లోనే ప్రచారంలో ఉంది. ఇపుడు గురి చూసి మరీ దీని మీదనే సీబీఐ విచారణను వేయడం ద్వారా జగన్ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసింది. నాటి ఐటీ మంత్రి మీద కూడా విచారణ తప్పనిసరిగా ఉంటుందని మంత్రి పేర్ని నాని స్పష్టంగా చెప్పడంతో జగన్ టార్గెట్ పక్కాగా ఉందని అర్ధమైపోతోంది. సీబీఐ విచారణను ఇంతకాలం కోరిన బాబు, ఇప్పటిదాకా దాని పనితీరు మెచ్చుకున్న పెద్దయాన ఇపుడు కిక్కురుమనలేని పరిస్థితుల్లోనే జగన్ వేగంగా దూకుడుగా పావులు కదిపారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ పాలిటిక్స్ లో ది బిగ్ మూవ్ అంటున్నారు.

Tags:    

Similar News