బిగ్ బాస్ జగనేనా …?

రాజకీయ చదరంగంలో కులాలతో ఆటలు పరమపదసోపానానికి దరిచేరుస్తాయి లేదా పాతాళానికి పడదోస్తాయి. గత ప్రభుత్వం లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాపు రిజర్వేషన్ల అంశంలో నడిపిన వ్యవహారం ఆయనకు [more]

Update: 2019-11-04 05:00 GMT

రాజకీయ చదరంగంలో కులాలతో ఆటలు పరమపదసోపానానికి దరిచేరుస్తాయి లేదా పాతాళానికి పడదోస్తాయి. గత ప్రభుత్వం లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాపు రిజర్వేషన్ల అంశంలో నడిపిన వ్యవహారం ఆయనకు అధికారాన్ని దూరం చేసింది. అంతకుముందు ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీ కాపు సామాజికవర్గం నుంచి ఆశీస్సులు అందించి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టడంలో ప్రధాన పాత్రే వహించేలా చేసిందన్నది అందరికి తెలిసిందే. పీఠం దక్కడం వెనుక అదే పీఠం పోవడానికి కూడా కారణమైన సందర్భం రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠమనే చెప్పాలి. ఎంతో సున్నితమైన కులాలు మతాలకు సంబంధించిన ఏ చిన్న అంశంలో అయినా తేడా కొడితే ఎలా ఉంటుందో ఐదేళ్ళలో టిడిపి ఆంధ్రప్రదేశ్ లో చూపించింది.

కత్తిమీద సాము అయినా …

ఇలాంటి ఎన్నో అనుభవాలు కళ్ళముందే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టిన నాటినుంచి సాహసోపేత నిర్ణయాలవైపే అడుగులు వేస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ లో దేశంలోని రాజకీయ పార్టీలకు జగన్ కొత్త పాఠాలు నేర్పుతున్నారు. అధికారం లోకి వచ్చిరావడంతోనే జగన్ తన క్యాబినెట్ లో కులాల వారి గా పదవులు కేటాయించడం ఐదుగురికి ఉపముఖ్యమంత్రుల హోదా కల్పించడం తో వైఎస్ జగన్ ఆగలేదు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీల చిట్టా ను దాంతో బాటు ప్రకటించిన మ్యానిఫెస్టో తూచా తప్పకుండా అమలు చేసేందుకే ముందుకు సాగుతున్నారు. అందులోభాగంగా కులాల వారీగా కార్పొరేషన్లు ప్రకటించి ఆయా కులాలకు బాగా దగ్గరయ్యే అడుగు వేశారు జగన్.

అన్ని కులాలకు న్యాయం జరిగితే …

ప్రస్తుతం వున్న కాపు, బ్రాహ్మణ, వైశ్య బిసి కార్పొరేషన్ లకు తోడు 60 కులాలకు కార్పొరేషన్ లు ప్రకటించి సంచలనం సృష్ట్టించారు. ఈ కార్పొరేషన్ లలో కమ్మ, రెడ్డి, క్షత్రియ సామాజిక వర్గాలు కూడా ఉండటం విశేషం. సామాజిక అభివృద్ధి కులాలతోనే సాధ్యమని అన్ని కులాల్లో పేదరికం రూపుమాపడానికి ఈ కార్పొరేషన్ లు దోహదం చేస్తాయని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. నిధుల లేమితో అల్లాడుతున్న ఎపి లో కార్పొరేషన్ ల వారీగా జనాభా నిష్పత్తి ప్రకారం వైసిపి సర్కార్ నిధులు కేటాయించాలిసి ఉంటుంది. ఇందులో తక్కువ ఎక్కువలు కానీ లోటు పాట్లు ఏమి వచ్చినా అసలుకే సమస్య వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే అనుకున్నట్లే లక్ష్యం ప్రకారం పనిచేస్తే జగన్ లెక్కేసినట్లు గా వైసిపి ని రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పక్కా వ్యూహంతో …

అందుకే జగన్ అధికారం చేపట్టిన రోజు నుంచి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారని రాబోయే ఎన్నికలకు బలమైన పునాదిని నిర్మించే పనిలో ప్రత్యర్థికి అందనంత ఎత్తులో జగన్ వెళుతున్నారని వైసిపి వర్గాల్లో సైతం విస్తృతంగా చర్చ సాగుతుంది. స్వాత్రంత్య్రం వచ్చిన నాటినుంచి పేరుకి బిసిలు, ఎస్సిలుగా వున్నా కొందరే ఆ ఫలాలు అనుభవించడంతో అన్ని కులాల్లో కొందరే ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితిలో సమూలా మార్పుకి జగన్ సర్కార్ తీసుకున్న కొత్త నిర్ణయం ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News