జగన్ చర్య తో ఇరుకున పడ్డ కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మరో కీలక హామీని అమల్లో పెట్టేశారు. నష్టాలబాటలో వున్న ఎపిఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. [more]

Update: 2019-09-04 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మరో కీలక హామీని అమల్లో పెట్టేశారు. నష్టాలబాటలో వున్న ఎపిఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి తన ఆమోదం తెలిపారు వైఎస్ జగన్. దశాబ్దాల కాలంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పరిశీలించి అమల్లో పెట్టడం విశేషం. పాదయాత్రలో భాగంగా తొలుత చిత్తూరు, ఆ తరువాత రాజమండ్రి లో చివరిగా పలాస లో వైఎస్ జగన్ ఆర్టీసీ విలీనం పై తన హామీని ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే విలీన ప్రక్రియపై దృష్టిపెట్టారు వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇది అయ్యే పనేనా అని అంతా పెదవి విరిచిన సమయంలో వైఎస్ జగన్ తాను చెప్పింది చేసి చూపించారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఎపి లోని ఆర్టీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా తెలంగాణ సర్కార్ కి కొత్త చిక్కు తెచ్చిపెట్టింది.

టి సర్కార్ అమలు చేయక తప్పదా …?

ఇప్పటికే ఆర్టీసీని విలీనం చేయాలంటూ టీఎస్ ఆర్టీసీ ఉద్యమ బాట పెట్టింది. అయితే దీనిపై అక్కడి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైఎస్ జగన్ సర్కార్ చేయగా లేనిది మీరెందుకు చెయ్యరు అని ఇప్పుడు కెసిఆర్ పై మరింత వత్తిడిని టి ఎస్ ఆర్ టి సి తేవడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు న్యాయం చేయలేదని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. పక్క రాష్ట్రం తో ప్రతీ అంశం పోల్చి చూసుకునే నేపథ్యంలో వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ సర్కార్ మెడకు చుట్టుకుంది. ఈ నేపథ్యంలో టి సర్కార్ సైతం ఇదే విధానంలో వెళుతుందా లేక ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి పరిష్కారం వెతుకుతుందో చూడాలి.

ప్రయివేట్ కి చెక్ పెడతారా …?

ప్రభుత్వ అనుబంధంగా వున్న ఆర్టీసీ ని ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ కార్యక్రమాలకు విరివిగా వాడుకుని మరింత నష్టాల బాట పట్టిస్తూ వచ్చాయి. ప్రతి ఏడూ ప్రభుత్వ చర్యలవల్ల సమస్యలు మరింత పెరుగుతూ ఎదోఒకరోజు ఆర్టీసీని ప్రయివేట్ పరం చేస్తారన్న ప్రచారం నిత్యం కార్మికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ వచ్చేది. వేలకోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా నష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ నిర్వహణ లో చతికిల పడుతూ పేదవాడి ప్రయాణ వాహకం ఇంతకాలం సాగుతూ వస్తుంది. అధికారంలో వున్నవారు ప్రయివేట్ ఆపరేటర్లకు ద్వారాలు తెరుస్తూ ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టివేశాయి. దాంతో పాదయాత్రలో ఈ సమస్యపై అధ్యయనం చేసిన వైఎస్ జగన్ ఆర్టీసీని విలీనం చేసి బలోపేతం చేయాలని భావించారు. ఆ విధంగానే చారిత్రిక నిర్ణయం తీసుకుని ఆర్టీసీ కార్మికుల గుండెల్లో నిలిచారు.

Tags:    

Similar News