జగన్ ఆ జాబితాలో లేరట

తెలుగు రాజకీయాల్లో పాగా వేయాలన్నది బీజేపీ చిరకాల కోరిక. అయితే అది ఎప్పటికీ నేరవేరని కలగానే మారుతూ వస్తోంది. దేశాన్ని గుప్పిట పట్టినా తెలుగు రాష్ట్రాలు మాత్రం [more]

Update: 2019-08-23 09:30 GMT

తెలుగు రాజకీయాల్లో పాగా వేయాలన్నది బీజేపీ చిరకాల కోరిక. అయితే అది ఎప్పటికీ నేరవేరని కలగానే మారుతూ వస్తోంది. దేశాన్ని గుప్పిట పట్టినా తెలుగు రాష్ట్రాలు మాత్రం దక్కడంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో మార్పు వచ్చినా, బెంగాల్ టైగర్ మమతను ఓడించి పశ్చిమ బెంగాల్లో కాలుపెట్టిన మోడీ షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం మింగుడుపడడంలేదు. దాంతో సామదానభేధ దండోపాయాలను మోడీషా ద్వయం ప్రయోగిస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే రాజకీయ కురువృధ్ధుడు చంద్రబాబు అధికారం నుంచి తప్పుకోవడం బీజేపీకి పెద్ద వూరట. అదే సమయంలో అపరిమితమైన ప్రజాదరణతో జగన్ అధికారంలోకి రావడం జీర్ణించుకోలేని పరిణామం. మరో వైపు తెలంగాణాలో టీఆర్ఎస్ మొదటి అయిదేళ్ళు అనధికార మిత్రపక్షంగా ఉంది. రెండవసారి గెలిచిన తరువాతనే కేసీఆర్ కేంద్రంతో లడాయి పెట్టుకున్నారు. దాంతో ఆపరేషన్ టీఆర్ఎస్ కి కమలం కుతూహలపడుతోంది. ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రల విషయంలో రెండు విధాలుగా మోడీ షా వ్యూహాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెద్ద శత్రువుతో మొదలుపెట్టి….

జగన్ తో పోలిస్తే కేసీఆర్ బీజేపీకి పెద్ద శత్రువు. అనేక యుధ్ధాలలో ఆరితేరిన కేసీఆర్ ను ఇంటికి పంపించాలంటే బీజేపీ సర్వ శక్తులు ఒడ్డాలి. అందుకోసమే ఇప్పటి నుంచి తెలంగాణాలో సరంజామా రెడీ చేసుకుంటోంది. కేసీఆర్ వ్యూహాలు గొప్పవి. ఆయన జనం మధ్య నుండి పోరాడుతారు. నీటిలో మొసలి మాదిరిగా ఆయన బలం జనంలో ఉంది. తెలంగాణా సెంటిమెంట్ ని రెచ్చగొట్టి కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. అందువల్ల అదే సెంటిమెంట్ తో దెబ్బతీయాలన్నది బీజేపీ ఆలోచన. దానికి మతాన్ని కూడా మేళవిస్తే కేసీఆర్ చిత్తు అవుతారన్నది కొత్త ఎత్తుగడ. తెలంగాణాలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ. అందువల్ల అక్కడ బీజేపీ కార్డ్ బాగానే ఉపయోగపడుతుంది. దాంతో కేసీఆర్ మీదనే ఇపుడు బీజేపీ చూపు అంతా ఉంది. ఈ క్రమంలో జగన్ ని ప్రస్తుతానికి అంత ప్రమాదంగా భావించడంలేదు.

స్నేహ హస్తం అందిస్తున్నారా?

ఇక జగన్ విషయంలో బీజేపీ లెక్కలు వేరేగా ఉన్నాయి. ఏపీలో మతం కార్డ్ చెల్లదు, పైగా విశేష ప్రజాభిమానం జగన్ కి ఉంది. ఆయన వయసు కూడా తక్కువ. మరో మూడు దశాబ్దాల పాటు ఆయన రాజకీయం చేసే స్థితిలో ఉన్నారు. ఆయనతో పెట్టుకున్నా తిరిగి ఉత్తుంగ తరంగంలా పైకి లేవగల సమర్ధుడు. అదే కేసీఆర్ విషయం అయితే ఆయన రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారు. ఆయన్ని పడదోస్తే మళ్లీ లేచి నిలబడడం కష్టం. వారసుడు కేటీఆర్ కి పార్టీలో ఎంత వరకూ మద్దతు ఉందో కూడా తెలియదు. అందువల్ల కేసీఆర్ తోనే మోడీ, షా పోటీ అంటున్నారు. జగన్ ని మాత్రం మచ్చిక చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అంతర రాష్ట్ర మండలిలో జగన్ కి సభ్యత్వం ఇవ్వడం. ఇక జగన్ ఏపీలో అధికారంలో ఉన్నా కూడా తమ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాడు, ఎదురు తిరగడన్న నమ్మకం కూడా మోడీ షాలకు ఉంది. ఏపీలో బాబు మళ్ళీ లేవకుండా ఉండాలంటే జగన్ కి మద్దతు ఇవ్వడం కూడా రాజకీయ అనివార్యం. ఈ లెక్కలు అన్నీ సరిచూసుకున్నాకే బీజేపీ జగన్ తో చేతులు కలుపుతోందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఇక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటల్లో చెప్పాలంటే ఏపీలో ఉన్నది స్నేహపూర్వక ప్రభుత్వం. అంటే మోడీ శత్రువుల జాబితాలో జగన్ ఇప్పటికైతే లేరు.

Tags:    

Similar News