నష్టం ఎవరికంటే…?

ఏపీకి రాజధాని లేకపోవడం ఒక పాపం. అది డెబ్బయ్యేళ్ళుగా కొనసాగుతూ వస్తున్న శాపం. మద్రాస్, కర్నూలు, హైదరాబాద్, ఇపుడు అమరావతి ఇలా రాజధాని విషయంలో ఏపీకి ఎందుకో [more]

Update: 2019-08-30 05:00 GMT

ఏపీకి రాజధాని లేకపోవడం ఒక పాపం. అది డెబ్బయ్యేళ్ళుగా కొనసాగుతూ వస్తున్న శాపం. మద్రాస్, కర్నూలు, హైదరాబాద్, ఇపుడు అమరావతి ఇలా రాజధాని విషయంలో ఏపీకి ఎందుకో లింక్ కుదరడంలేదు. అయిదేళ్ళ క్రితం విభజన ఏపీకి కొత్త రాజధాని అంటూ అమరావతిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని అంటే అన్ని వర్గాల ప్ర్జలకు అనుకుంటే అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, తొంబై శాతం మంది ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. అది నిజమేననిపించేలా అనేక సంఘటనలూ జరిగాయి. ఏపీలో బలమైన పార్టీకి సంబంధిచిన ప్రతిపక్ష నాయకుడు జగన్ సైతం ముఖ్యమంత్రిగా గెలుస్తానన్న నమ్మకం కుదిరేవరకూ అమరావతి ప్రాంతంలోకి అడుగుపెట్టలేకపోయారంటే అక్కడ ఆధిపత్యపు వర్గాల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఇక జగన్ మూడు నెలల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గత టీడీపీ సర్కార్ విధానాలను తిరగతోడాలనుకుంటున్నారు. అందులో అమరావతి రాజధానిలో అవినీతి, లోపాయి కారి రియల్ వ్యాపారంపైనా కూడా ఉంటుందని అంటున్నారు.

ఇప్పట్లో ఆగదా…?

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా అమరావతి రాజధాని తరలిపోతుందన్న దానిపై రచ్చ సాగుతోంది. బొత్స సత్యనారాయణ మంత్రి హోదాలో అమరావతి రాజధానిపై కొన్ని డౌట్లు వ్యక్తం చేశారు. వరదలు, ముంపుతో మొదలుపెట్టి ఒకే సామాజికవర్గానికి రాజధాని కట్టి ఇవ్వరు అనేదాకా వచ్చారు. ఇక ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో పెదవి విప్పడంలేదు. ఆయన స్వయంగా అమరావతి నిర్మాణాలు, ప్రగతిపైన సీఆర్డీయే అధికారులతో సమీక్ష చేసి వూరుకున్నారు. ఈ సంధర్భంగా మంత్రి బొత్స అన్న మాటలు మరింత ఆసక్తిని కలిగించాయి. 35 వేల కోట్లతో అమరావతిలో చేపట్టిన పనులకు బ్యాంకుల టైఅప్ లేదని, గ్యారంటీ అంతకంటే లేదని చెప్పుకొచ్చారు. అమరావతిలో పనులు చేపట్టడం అన్నది ప్రభుత్వం ఆర్ధిక స్థోమత మీద ఆధారపడి ఉందని కూడా బొత్స అనడం విశేషం. మొత్తానికి ఈ రచ్చ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందా అన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

చంద్రబాబే టార్గెట్….

చంద్రబాబు, టీడీపీ నోటి వెంట ఎన్ని సార్లు అమరావతి అన్న మాట వస్తే అన్ని రెట్లు వారికే రాజకీయంగా నష్టం. ఓ విధంగా నాటి ఉమ్మడి ఏపీలో తెలంగాణా సమస్యలా ఇపుడు అమరావతి రాజధాని టీడీపీ మెడకు చుట్టుకుందని అంటున్నారు. అమరావతి అనకుండా ఉండలేరు, ఎందుకంటే అక్కడ తమ వారనుకున్న అందరికీ భూములు ఉన్నాయి. అయినా గట్టిగా అమరావతి అంటే ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమకు చెడిపోతారు. మా అభివృద్ధి వద్దా, ఎంతసేపు అమరావతి మాత్రమే అభివృధ్ధి కావాలా అన్న ఆవేశం ఈ రెండు ప్రాంతాల ప్రజలకు కలుగుతుంది. తాజా ఎన్నికల్లో ఇదే టీడీపీ ఘోర పరాజయానికి కారణమైంది కూడా. ఓ విధంగా వ్యూహాత్మకంగానే జగన్ బాబును అమరావతి విషయంలో ఇరికించారనుకోవాలి. బొత్స మాట్లాడిన ప్రతీసారి అధికార వికేంద్రీకరణ అనడమే కాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అని కూడా వెనకబడిన ప్రాంతాల ప్రస్తావన ముందుకు తెస్తున్నారు. చూడబోతే అతి పెద్ద రాజకీయ ప్రణాళికతోనే వైసీపీ సర్కార్ ఉంది. చంద్రబాబు ఇపుడు కార్నర్ అయ్యారంటే ఆయన రెండు జిల్లాకే టీడీపీని పరిమితం చేసుకోవాల్సివుంటుంది.

Tags:    

Similar News