అన్న చెప్పింది వినకుంటే అంతేనమ్మా?

చెల్లెమ్మ అసలు బలం ఏంటో తెలిసిపోయింది. తండి చాటు తనయగా. అన్న చాటు చెల్లెలిగా ఒక వెలుగు వెలిగింది. కానీ అంతా తానే అయ్యేసరికి మాత్రం రంగు [more]

Update: 2021-08-22 03:30 GMT

చెల్లెమ్మ అసలు బలం ఏంటో తెలిసిపోయింది. తండి చాటు తనయగా. అన్న చాటు చెల్లెలిగా ఒక వెలుగు వెలిగింది. కానీ అంతా తానే అయ్యేసరికి మాత్రం రంగు వెలిసిపోయింది. టాలెంట్ తేలిపోయింది. రాయలసీమ బిడ్డ వైఎస్ షర్మిలమ్మ తెలంగాణాలో అపుడే కాడె వదిలేసేలా ఉన్నారు. పార్టీ పుట్టి ఇంకా పురిటి వాసన పోలేదు కానీ అపుడే అంపశయ్య మీద కూర్చేబెట్టేసేలా సీన్ ఉంది. వైఎస్ షర్మిలమ్మ తరువాత కీలక నేతగా చెప్పుకునే తెలంగాణాలో ఒక మోస్తరు నాయకురాలు ఇందిరా శోభన్ పార్టీకి తాజాగా గుడ్ బై కొట్టేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన విమర్శలు మాత్రం అసలే పునాది లేని వైఎస్ షర్మిలమ్మ పార్టీని కుప్ప కూల్చేలా ఉన్నాయి.

అది నిజమేనా…?

వైఎస్ షర్మిల బయట బాగానే ఉంటారు. ఆమె ఉపన్యాసాలు పదునుగా ఉంటాయి. పంచ్ డైలాగులు బాగా వేస్తారు. జగన్ జైలులో ఉన్నపుడు ఆమె చేసిన పాదయాత్ర కూడా వైసీపీని గట్టిగా నిలబెట్టింది. ఆమె 2019 ఎన్నికల వేళ కూడా సుడిగాలి పర్యటనలు చేసి పార్టీకి కొత్త ఉత్తేజం తెచ్చారు. కానీ వైఎస్ షర్మిలమ్మ ఎలా ఉంటారు. ఆమె మనస్తత్వం ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. వైఎస్ షర్మిలమ్మ పక్కా ఇగోయిస్టు అని అంతా అంటారు. అంతవరకూ ఎందుకు జగన్ కోసం బంగారం లాంటి మంత్రి పదవిని వదులుకున్న కొండా సురేఖ అయితే ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమె అహంభావి అని విమర్శించారు. తాజాగా పార్టీని విడిచి పోతూ ఇందిరా శోభన్ అదే మాట అన్నారు. వీళ్లే కాదు, దగ్గర ఉన్న వారు కూడా ఆమె తోటి వారికి పెద్దగా పట్టించుకోరు, రెస్పెక్ట్ ఇవ్వరు అని చెబుతున్నారు.

ఆ లక్షణాలు లేవా..?

అంతే కాదు, వైఎస్ షర్మిలలో నాయకత్వ లక్షణాలు కూడా లేవు అని ఇందిరా శోభన్ తో సహా అంతా అంటున్నారు. ఆమె ఎవరిని ఎలా చూడాలో ఇప్పటికీ తెలుసుకోలేదు అంటున్నారు. రాజకీయ నాయకత్వం అంటే ప్రజలతో మమేకం కావడం. తన సాటి వారిని కూడా పక్కన చోటిచ్చి కూర్చోబెట్టుకోవడం. కోపతాపాలు ఉన్నా కూడా బయటపడకుండా ఉండడం. ఇవన్నీ ఉండాలి. వీటికి మించి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇపుడు అవే వైఎస్ షర్మిలకు లేవని అంటున్నారు. పార్టీ ఇంకా ఒక షేపుకూ రూపుకూ రాకముందే చాలా మంది నాయకులు వదిలేసిపోయారు. మరో వైపు షర్మిల పార్టీకి సిద్ధాంతాలు లేవు అంటున్నారు. అవును ఆమె పార్టీ విధానాలు ఏంటో కూడా ఈ ఆరు నెలల కాలంలో ఎక్కడా చెప్పలేకపోయారు. కేసీయార్ ని తిట్టిపోయడమే విధానం కాదు కదా.

అదే మైనస్..?

వైఎస్ షర్మిల తాను ఎంత తెలంగాణా కోడలు అంటున్నా కూడా ఆమె పార్టీ పేరే ఆమెకు కేరాఫ్ ఆంధ్రా అనేలా చేస్తున్నాయి. వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టి తెలంగాణాలో ఓట్లు అడగడమే ఆమె రాజకీయ అవహాగాహన లేమికి నిదర్శనం అంటున్నారు. మరి వైఎస్సార్ ని తీసేస్తే వైఎస్ షర్మిల జీరో. అలా ఆమె వైఎస్సార్ పేరిట రాజకీయం చేయలేక మానలేక పెద్ద ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన వారు షర్మిల ఎక్కువ రోజులు పార్టీని నడపలేదు అంటున్నారు. అలా కాకుండా ఆమె మొండిగా కొనసాగించినా సొంత నిధులు ఖర్చు అవుతాయి తప్ప లాభం ఏమీ ఉండదని కూడా విశ్లేషిస్తున్నారు. మొత్తానికి అన్నను కాదని వైఎస్ షర్మిల వేసిన ఈ అడుగులు తడబడుతున్నాయి. తెలంగాణాలో పార్టీ విస్తరణ కుదరదు అని జగన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు అని వైఎస్ షర్మిల తొందరలోనే తెలుసుకుంటారు అంటున్నారు.

Tags:    

Similar News