ఆ లక్ష్యం నెరవేరుతుందా?

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పట్ల సీరియస్ గానే ఉన్నారు. ఆషామాషీగా ఆలోచించడం లేదు. కనీసం కొన్ని ప్రాంతాల్లోనైనా తన బలం నిరూపించాలన్నది వైఎస్ షర్మిల లక్ష్యంగా [more]

Update: 2021-06-20 13:30 GMT

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పట్ల సీరియస్ గానే ఉన్నారు. ఆషామాషీగా ఆలోచించడం లేదు. కనీసం కొన్ని ప్రాంతాల్లోనైనా తన బలం నిరూపించాలన్నది వైఎస్ షర్మిల లక్ష్యంగా కన్పిస్తుంది. తెలంగాణలో వైఎస్ఆర్ కు ఇప్పటికీ అభిమానులున్నారు. వీరితో పాటు రెడ్డి సామాజిక వర్గం నేతలు, దళిత ఓటు బ్యాంకుపైనే వైఎస్ షర్మిల ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కన్పిస్తుంది. 2023 ఎన్నికలకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

వచ్చే నెలలో….?

వైఎస్ షర్మిల పార్టీ పేరు కూడా ఖరారయింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె జనం ముందుకు రాబోతున్నారు. వచ్చే నెలలో వైఎస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించే అవకాశముంది. దీంతో పాటు జులై నెల తర్వాత ఎప్పుడైనా ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి క్యాడర్ నిర్మాణం చేసుకోవడమే ఇప్పుడు వైఎస్ షర్మిల ముందున్న లక్ష్యం.

క్యాడర్ లేక…?

తెలంగాణలో అనేక చోట్ల వైఎస్ షర్మిల పార్టీకి క్యాడర్ లేదు. నాలుగైదు జిల్లాలు మినహాయిస్తే ఎక్కడా బలమైన నేతలు కూడా లేరు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి నెలరోజులు దాటిపోయినప్పటికీ వైఎస్ షర్మిల పార్టీలోకి నేతలు ఎవరూ చేరకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద యెత్తున తన పార్టీలోకి వస్తారని వైఎస్ షర్మిల భావించారు.

శాసనసభలో ప్రాతినిధ్యానికి…?

కానీ ఏ నేత కూడా వైఎస్ షర్మిల పార్టీలోకి వచ్చే సాహసం ఇప్పటి వరకూ చేయలేదు. తెలంగాణలో హుజూరాబాద్ ఎన్నిక మినహా ఇప్పట్లో మరే ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలతో సహా అన్ని ఎన్నికలు ముగిసిపోయాయి. అయితే ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ వంటి జిల్లాలపైనే వైఎస్ షర్మిల ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. 2023 ఎన్నికల్లో తెలంగాణ శాసనసభలోకి తమ పార్టీ ప్రాతినిధ్యం ఉండాలన్నది ఆమె లక్ష్యంగా కన్పిస్తుంది. మరి ఆమె లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News