అడుగు ముందుకు పడేది ఎలా?

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ అయితే పెట్టారు. కానీ దానిని ముందుకు తీసుకు పోవడం ఎలా అన్నది అర్థం కాకుండా ఉంది. ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నా వారు [more]

Update: 2021-07-25 13:30 GMT

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ అయితే పెట్టారు. కానీ దానిని ముందుకు తీసుకు పోవడం ఎలా అన్నది అర్థం కాకుండా ఉంది. ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నా వారు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికే పనికొస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వారి సలహాలు, సూచనలు ఉపయోగపడటం లేదు. అసలు పార్టీ నాయకత్వాన్ని స్వీకరించేందుకే అనేక చోట్ల ముందుకు రాకపోతుండటం విశేషం.

పొరుగు రాష్ట్రం నేతగానే?

వైఎస్ షర్మిలను తెలంగాణలో పొరుగు రాష్ట్రం నేతగానే చూస్తున్నారు. తాను పదే పదే తెలంగాణ బిడ్డనని చెప్పినా షర్మిల మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. సమావేశాలకు, సభలకు ఎప్పటిలాగానే జనాన్ని పోగు చేస్తున్నారు తప్పించి బలమైన నాయకులు పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. వైఎస్ షర్మిల పార్టీ పట్ల నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పాలి.

రెండు, మూడు జిల్లాలు మినహా….

ఒక్క ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలు మినహా ఎక్కడా షర్మిల పార్టీకి స్పందన కన్పించడం లేదంటున్నారు. కొత్తగా పార్టీ పెట్టడం, పైగా పక్కా తెలంగాణ కాకపోవడంతో ఆర్థికంగా బలమున్న వారు కొందరు పార్టీలోకి వచ్చేందుకు జంకుతున్నారు. తాముపార్టీలో చేరితే తమ వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయం కావచ్చు. ఇక రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహం ఉండి, వేరే పార్టీల్లో ఎదగలేని వారు మాత్రం వైఎస్ షర్మిల పార్టీ వైపు చూస్తున్నారు.

వారు వస్తామంటున్నా…?

వీరి వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా అదనంగా ఖర్చు తప్పదని పార్టీయే వీరిని దూరం పెడుతుందంటున్నారు. ఇక వైఎస్ షర్మిల మాత్రం ఏదోఒక సమస్యతో ప్రజల్లో ఉండేలా ప్రోగ్రాం లు ప్లాన్ చేసుకుంటున్నారు. నిరుద్యోగ సమస్యను ఆమె హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంత కష్టపడినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానమున్న వారు సయితం వైఎస్ఆర్టీపీ వైపు చూడకపోవడం విశేషం. వైఎస్ షర్మిల పాదయాత్ర చేసినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News