ఇద్దరికీ కలసిరాలేదా?

ప్రస్తుతం రాజ‌ధాని వ్యవ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప‌క్షాల్లోనూ ఆందోళ‌న పెల్లుబుకుతోంది. ముఖ్యంగా అధికార ప‌క్షంలోనూ కొంత మేర‌కు ఆవేద‌న, ఆందోళ‌నా ఉన్నప్పటికీ నాయ‌కుడిపై [more]

Update: 2020-02-01 13:30 GMT

ప్రస్తుతం రాజ‌ధాని వ్యవ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప‌క్షాల్లోనూ ఆందోళ‌న పెల్లుబుకుతోంది. ముఖ్యంగా అధికార ప‌క్షంలోనూ కొంత మేర‌కు ఆవేద‌న, ఆందోళ‌నా ఉన్నప్పటికీ నాయ‌కుడిపై ఉన్న భ‌రోసాతో ఇప్పటి వ‌ర‌కు లాక్కొచ్చారు. కానీ, ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ప్రభుత్వ నిర్ణయానికి ఎదురు దెబ్బలు త‌గులుతుండ‌డంతో ఏం చేయాలో అర్ధం కాక నాయ‌కులు త‌ల ప‌ట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు లేడీ ఎమ్మెల్యే విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది.

విడ‌ద‌ల ర‌జ‌ని:

రాజ‌ధాని విష‌యంలో ఆందోళ‌న వ్యక్తం చేస్తున్న వారిలో పైకి చెప్పక‌పోయినా లోలోన ఆందోళ‌న చెందుతోన్న నాయ‌కురాలు విడ‌ద‌ల ర‌జ‌ని. 2019 ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఎన్నారై మ‌హిళ ర‌జ‌ని. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి తొలి ప్రయ‌త్నంలోనే ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. వాస్తవానికి ఆమెకు రాజ‌కీయంగా పెద్ద ప‌లుకుబ‌డి లేదు. అయినా త‌న‌మాట తీరుతోపాటు కొంత ఖ‌ర్చు కూడా క‌ల‌సి వ‌చ్చింది. ఇదే, ఆమెను రాజ‌కీయంగా డెవ‌ల‌ప్ చేసింది. దీనికి తోడు జ‌గ‌న్ హ‌వా కూడా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేసింది. వీటికితోడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కూడా ఆమెకు సహకారం అందించారు.

కలసి వస్తున్న వారు….

అయితే, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు పార్టీ త‌ర‌పున క‌లిసి వ‌స్తున్నవారు త‌గ్గిపోయారు. త‌న‌కు ఎన్నికల స‌మ‌యంలో అన్ని విధాలా సాయం చేసి, త‌న టికెట్‌ను సైతం వ‌దులుకున్న మ‌ర్రితో ఇప్పుడు విడ‌దలకు ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని వ‌ర్గాల‌కు ఆమెకు దూర‌మైంది. ఇక‌, ఇప్పుడు రాజ‌ధాని వివాదంతో ఉద్యమం చేస్తున్నవారిని త‌ప్పించుకుని తిరుగుతున్న ప‌రిస్థితి ఏర్పడుతోంది. రాజ‌ధాని ఏరియాకు ఆనుకునే ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ప్రభావం ఎక్కువుగా ఉండ‌డంతో ర‌జ‌నికి క‌ష్టాలు త‌ప్పడం లేదు. ఈ క్రమంలో నిన్నటి వ‌ర‌కు దూకుడుగా ఉన్న ర‌జ‌ని ఇప్పుడు త‌న‌ను తాను నిరూపించుకునేందుకు కూడా ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. సో.. మొత్తానికి ఆమె కుమిలిపోతున్నారు.

ఉండ‌వ‌ల్లి శ్రీదేవి:

రాజ‌ధాని ప్రాంతంలోని తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన డాక్టర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా ఆమె హైద‌రాబాద్‌లో ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అనూహ్యంగా వైఎస్ జ‌గ‌న్ కుటుంబంతో ఉన్న స‌ఖ్యత నేప‌థ్యంలో టికెట్ సాధించారు. రాజ‌కీయాల‌కు కొత్త అయినా జ‌గ‌న్ హ‌వాలో విజ‌యం సాధించారు. అయితే, రావ‌డం వైద్య వృత్తి నుంచి వ‌చ్చినా అన‌తి కాలంలోనే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు శ్రీదేవి తాప‌త్రయ‌ప‌డ్డారు.

తొలిసారి ఎమ్మెల్యే అయి…..

విపక్ష టీడీపీపై తీవ్ర విమ‌ర్శలు చేయ‌డంలోను, అటు అసెంబ్లీలోను, ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ విప‌క్షాన్ని ఇరుకున పెట్టడంలోనూ ఆమె స‌క్సెస్ అయ్యారు. అయితే ఆమె దూకుడు నేప‌థ్యంలో ఆమె చుట్టూ లెక్కలేన‌ని వివాదాలు ముసురుకున్నాయి. చివ‌ర‌కు ఆమె కుల వివాదం కూడా అనేక విమ‌ర్శల‌కు కార‌ణ‌మైంది. రాజ‌ధాని విష‌యం తెర‌మీదికి రావ‌డంతో ఇబ్బంది ప‌డుతున్నారు. గ‌తంలో నిత్యం నియోజ‌వ‌క‌ర్గంలో ప‌ర్యటించిన శ్రీదేవి ఇప్పుడు ఇక్కడి ప్రజ‌లు డిమాండ్ చేస్తున్నా క‌నిపించ‌డం లేదు. పైగా తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజయం సాధించిన అటు విడ‌ద‌ల ర‌జ‌ని, ఇటు ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ఇద్దరూ కూడా ఇప్పుడు రాజ‌ధాని విష‌యంలో మాత్రం తీవ్రంగా మ‌ద‌న ప‌డుతు న్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలతో…..

త్వర‌లోనే స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో పార్టీత‌ర‌ఫున ఇక్కడ గ‌ట్టిగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, ఇప్పుడు రాజ‌ధాని విష‌యం ఈ ఇద్దరినీ తీవ్రంగా క‌ల‌త‌కు గురిచేస్తోంది. పైగా ఈ ఇద్దరూ కూడా స్థానికంగా ప‌ట్టున్న వారు కాక‌పోవ‌డంతో పాటు ఇద్దరూ అటు గ్రూపు రాజ‌కీయాలు, ఇటు రాజ‌ధాని ఉద్యమంతో ఇబ్బంది ప‌డుతుండ‌డంతో వీరి ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి చందంగా మారింది. మ‌రి వీరు ఈ స‌వాళ్లను ఎలా ఎదుర్కొంటారో ? చూడాలి.

Tags:    

Similar News