వైసీపీకి వార్నింగ్ ఇచ్చినట్లేగా?

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి భవిష్యత్ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రణాళికాబద్దంగా పావులు కదుపుతోంది. ఏ విషయంలోనూ వైసీపీ సర్కారును వెనకేసుకురాకూడదని [more]

Update: 2020-06-11 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి భవిష్యత్ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రణాళికాబద్దంగా పావులు కదుపుతోంది. ఏ విషయంలోనూ వైసీపీ సర్కారును వెనకేసుకురాకూడదని నిర్ణయించుకున్నట్లుగానే కనిపిస్తోంది. అగ్రనాయకులతో సాన్నిహిత్యాన్ని ఆసరాగా చూపుతూ రాష్ట్రంలో బీజేపీ నేతలను నియంత్రించాలని వైసీపీ కొంతమేరకు ప్రయత్నించింది. అయితే దానిని తిప్పికొట్టే రివర్స్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు కమలనాథులు. గతంలో తెలుగుదేశంతో సాన్నిహిత్యం పార్టీ ఎదుగుదలను నిరోధించింది. వైసీపీ పట్ల అదే ధోరణి కనబరిస్తే పార్టీకి భవిష్యత్ ఉండదన్న విషయాన్ని స్థానిక నాయకులు బీజేపీ అగ్రనాయకత్వానికి స్పష్టంగానే చెప్పేశారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించిన తర్వాత టీడీపీకి, బీజేపీకి ఉన్న సామీప్యత తగ్గుతూ వచ్చింది. ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడి స్వయంకృతాపరాధం దూరాన్ని మరింత పెంచింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ వైపు ఎన్నికల్లో వేలెత్తి చూపకుండా వైసీపీ అధికారంలోకి వచ్చేసింది. మరోవైపు టీడీపీ తప్పుడు రాజకీయ అంచనాలతో బోల్తా కొట్టింది. ప్రధాన ప్రత్యర్థి వైసీపీని విస్మరించి తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అన్నతరహాలో ప్రచార సరళిని అనుసరించింది. ప్రధాని మోడీని టార్గెట్ చేసింది. ఫలితం అందరికీ తెలిసిందే.

చేష్టలుడిగిన శ్రేణులు…

అధికారపార్టీతో పోలిస్తే పదిశాతం పైచిలుకు ఓట్ల తేడాతో బలహీనమైన ప్రతిపక్షంగా టీడీపీ మిగిలిపోయింది. నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు అటు వైసీపీ వైపో, బీజేపీ వైపో క్యూ కడుతున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ అధిష్ఠానం ముందు సాగిలపడుతోంది. ప్రత్యేకహోదా వంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. తాను కమలం పార్టీతో కలిసి నడుస్తానని సంకేతాలు ఇస్తోంది. వైసీపీ కూడా బీజేపీని సానుకూలంగానే ఆదరిస్తోంది. ఈ రెండు పార్టీలతో సమ దూరం పాటిస్తూ సొంత బలాన్ని, బలగాన్ని నిర్మించుకోవాలనేది బీజేపీ వ్యూహం. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పార్టీల ప్రత్యర్థులుగా కాకుండా వ్యక్తిగత శత్రువులుగా రాజకీయ వైఖరిని అనుసరిస్తున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా కొన్ని త్యాగాలు చేసైనా బీజేపీకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారపార్టీ అధినేతగా ఉన్న జగన్ కు ఆ అవకాశం లేదు. అందుకే టీడీపీ పాత తప్పులను పక్కనపెట్టి వైసీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ దూసుకు వెళుతోంది. వైసీపీకి బలం, బలగం ఉంది. బీజేపీని దీటుగా ఎదుర్కోగలదు. కానీ బీజేపీని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేసేందుకు ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. దీంతో పార్టీ శ్రేణులు చేష్టలుడిగి ఉండిపోవాల్సి వస్తోంది.

విజయసాయి వ్యూహం…

పార్టీలో రెండో స్థానంలో ఉన్నట్లుగా వైసీపీ నేతలు భావించే విజయసాయి రెడ్డి వైసీపీకి, బీజేపీకి మధ్య బ్యాలెన్స్ నెలకొల్పే ప్రయత్నం చాలా వరకూ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వంటి కాలిమీద లేచి పోరాటం చేస్తున్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు సైతం అదే పంథాను అనుసరిస్తున్నారు. దీనిని వ్యూహాత్మకంగా తిప్పికొట్టాలని విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. కన్నా లక్ష్మీనారాయణకు, టీడీపీ అధినేతకు సంబంధం అంటగట్టి బీజేపీని, కన్నాను వేరు చేయాలనే ధోరణిలో విమర్శలు చేశారు. బీజేపీ ఎంచుకున్న కార్యాచరణను, రాష్ట్రశాఖ అధ్యక్షుడి వ్యక్తిగత కాతాలో వేయాలని చూశారు. తద్వారా బీజేపీ అధిష్ఠానానికి వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని చెప్పాలని యత్నించారు. అయితే ఈ విషయంలో కొంత నియంత్రణ, పరిమితి లేకుండా వ్యక్తిగతంగా విమర్శల పరిధి దాటడంతో బీజేపీ అధిష్ఠానానికి రాష్ట్రశాఖ ఫిర్యాదు చేసింది. దీంతో ముఖ్యమంత్రికి సైతం చిక్కులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రానికి అనేక సమస్యలు విన్నవించేందుకు అగ్రనాయకత్వంతో భేటీకి సంప్రతించినా బీజేపీ రాష్ట్ర నాయకులు గండి కొట్టారనే వాదనలున్నాయి. విజయసాయి రెడ్డి ప్రధాని, అమిత్ షా లతో నేరుగా సత్సంబంధాలు నెరుపుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరాటాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడలు వేస్తున్నారనేది అధిష్టానానికి ఆంతరంగికంగా అందిన ఫిర్యాదు. ఫలితంగానే వైసీపీ అగ్రనాయకత్వంతో బీజేపీ అగ్రనాయకత్వం ఏరకంగానూ సన్నిహితంగా బహిరంగంగా కనిపించకూడదని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విజయసాయి వ్యూహం వికటించినట్లుగానే చెప్పాలి.

అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్…

బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర శాఖ వైఖరికి సంపూర్ణంగా మద్దతు పలుకుతోంది. ఇది వైసీపీ సర్కారుకు కొంత ఇబ్బందికరమే. టీడీపీ క్రమేపీ బలహీనపడుతున్న స్థితిలో బీజేపీ, జనసేన కాంబినేషన్ కు రాష్ట్రంలో మంచి అవకాశాలున్నట్లు బీజేపీ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో వివిధ అంశాలపై సర్కారుపై ఉద్యమాలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర శాఖకు మద్దతుగా నిలవాలని అధిష్టానం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ తరఫున నిన్నామొన్నటివరకూ వెంకయ్యనాయుడు పెద్దన్న పాత్ర వహించేవారు. ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న సమయంలో బీజేపీతో టీడీపీకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటుండేవి. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రెండుపార్టీల మధ్య దూరం పెరగడానికి రాజకీయ అవసరాలు కారణమయ్యాయి. ఈ విషయంలో వైసీపీ సైతం సకాలంలో సరైన పాచికలనే ప్రయోగించింది. ఎన్నికలకు ఏడాది ముందే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రాతిపదికగా చేస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. దాంతో తాము రాజకీయంగా నష్టపోతామనే భావనతో టీడీపీ తొందరపాటును ప్రదర్శించింది. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వైసీపీ ట్రాప్ లో తెలుగుదేశం పడిపోయిందని ప్రధాని మోడీ కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్నరాజకీయ వాతావరణంలో బీజేపీ అధిష్టానం సమరానికే సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీలో అగ్రశ్రేణి నాయకునిగా ఉన్న రాం మాధవ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రశాఖ శ్రేణుల్లో ఉన్న సందిగ్ధానికి తెర దించుతూ వైసీపీ సర్కార్ పై పోరాటానికి న్యాయస్థానాల తీర్పులు, నిర్ణయాల్లో రివర్స్ విధానాన్ని ప్రశ్నిస్తూ ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీకి ఇది ఒక హెచ్చరిక కిందే చెప్పాలి . అదే సమయంలో బీజేపీలో ఏర్పడిన వర్గాలకు మార్గనిర్దేశం చేసినట్లే. అయితే టీడీపీ పరోక్ష సహకారంతో బలం పుంజుకున్నప్పుడే వైసీపీకి ప్రత్యర్థిగా బీజేపీ , జనసేనలు నిలవగలుగుతాయనేది రాజకీయ వాస్తవం. దీనికి తనను తాను కుదించుకుని రాజకీయ ఆత్మత్యాగానికి టీడీపీ ఎంతవరకూ సిద్దమవుతుందనేది వేచి చూడాల్సిన అంశం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News