బీజేపీ ముసుగు రాజ‌కీయం.. వైసీపీపై ఎఫెక్ట్..!

త‌న వ్యూహాల‌ను ఏదో ఒక‌ర‌కంగా అమ‌లు చేసే వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీని క‌ట్టడి చేయ‌డం వైసీపీకి త‌ల‌కు మించిన భారంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఎప్పుడు [more]

Update: 2020-09-12 06:30 GMT

త‌న వ్యూహాల‌ను ఏదో ఒక‌ర‌కంగా అమ‌లు చేసే వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీని క‌ట్టడి చేయ‌డం వైసీపీకి త‌ల‌కు మించిన భారంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఎప్పుడు ఎటు నుంచి వ్యూహాత్మకంగా త‌మ‌పై దాడి చేస్తుందో తెలియ‌క వైసీపీ నాయ‌కులు త‌ల్లడిల్లుతున్నారు. ఇప్పటికే న‌ర‌సాపురం ఎంపీ స‌హా మ‌రొక‌రిని త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో బీజేపీ స‌క్సెస్ అయింద‌ని చెబుతున్నారు. స‌హ‌జంగా ఏ ఎంపీ అయినా.. త‌న‌కు భ‌ద్రత క‌ల్పించాల‌ని కేంద్రాన్ని కోరితే.. స‌ద‌రు ఎంపీకి చెందిన పార్టీకి కేంద్రం నుంచి స‌మాచారం అందుతుంది. కానీ, న‌ర‌సాపురం ఎంపీ విష‌యంలో కేంద్రం క‌నీసం స‌మాచారం వైసీపీకి అందించ‌కుండానే ఆయ‌న‌కు వై కేట‌గిరీ భ‌ద్రత‌ను క‌ల్పించింది.

అలుసుగా తీసుకుని….

ఇక‌, మ‌రో కీల‌క ఎంపీ ఒక‌రికి కూడా బీజేపీ గేలం వేస్తోంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాలు వైసీపీని ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. పైగా జీఎస్టీకి సంబంధించి రావాల్సిన నిధులు ఇవ్వక‌పోగా.. అప్పులు చేసుకోవాల‌ని సూచించ‌డం కూడా పార్టీకి రుచించ‌డం లేదు. అలాగ‌ని.. పైకి ఆరోప‌ణ‌లు చేసే సాహ‌సం కూడా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేంద్రంలో సుస్థిరంగా ఉన్న బీజేపీతో క‌య్యం కంటే.. వియ్యమే బెట‌ర‌నే ధోర‌ణిని జ‌గ‌న్ ప్రద‌ర్శిస్తున్నారు. అయితే, దీనిని అలుసుగా భావిస్తున్న కేంద్రంలోని పెద్దలు అదును చూసుకుని జ‌గ‌న్ డైల్యూట్ చేసే ప‌నిని చేస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి.

లేఖను కూడా రాజకీయం చేసి…..

ఇటీవల తిరుప‌తి ఎమ్మెల్యే భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి ఉప‌రాష్ట్రప‌తికి.. వ‌ర‌వ‌ర‌రావు గురించి రాసిన లేఖ‌ను బీజేపీ రాజ‌కీయం చేసింది. ఈ క్రమంలో సీఎం జ‌గ‌న్‌ను కూడా లాగాల‌ని ప్రయ‌త్నించింది. అయితే, ఇది స‌మ‌సిపోయింది. కానీ, బీజేపీ నేత‌లు మాత్రం ఏపీపై ప‌ట్టు పెంచుకునేందుకు ప్రజ‌ల్లోకి వెళ్లడం మానేసి.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నార‌ని, అధికార పార్టీకి చెందిన నేత‌ల‌ను లోబ‌రుచుకునే వ్యూహాల‌కు పెద్దపీట వేస్తున్నార‌నే ప్రచారం సాగుతోంది.

వ్యాపారాలుండటంతోనే…..

వైసీపీ నేత‌ల్లో కొంద‌రు వ్యాపారాలు చేస్తుండ‌డం, మ‌రికొంద‌రు కాంట్రాక్టుల్లో మునిగి తేల‌డంతో బీజేపీకి ఈ ప‌రిణామం అనుకూలంగా మారింద‌ని చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ దూకుడు మ‌రింత‌గా పెరిగినా.. పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను ముందుగానే గుర్తించి, అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే.. బీజేపీ దూకుడును మున్ముందు ఎదుర్కొన‌డం క‌ష్టమ‌నే భావ‌న వ్యక్తమ‌వుతుంద‌ని చెబుతున్నారు. గ‌త టీడీపీ ప్రభుత్వాన్ని కూడా చివ‌రి వ‌ర‌కు న‌మ్మించి బీజేపీ త‌న వ్యూహంలోకి లాగి వ‌దిలేసింది. చివ‌ర‌కు చంద్రబాబు బీజేపీని అంచ‌నా వేసే విష‌యంలో ఘోరంగా ప్లాప్ అయ్యారు. ఇక ఇప్పుడు ఇదే విష‌యంలో జ‌గ‌న్ ఉదాసీన‌త ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News