వాళ్ళు వెళ్ళరు..వీళ్ళు వెళ్తే ఒప్పుకోరట

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. తెలుగుదేశంలో మునుపటి జోష్ కరవైంది. జోష్ అంటే అదే, అధినేత చంద్రబాబుతో సహా తమ్ముళ్ళంతా ఈ పాటికి జనంతోనే ఉంటూ [more]

Update: 2020-04-07 11:00 GMT

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. తెలుగుదేశంలో మునుపటి జోష్ కరవైంది. జోష్ అంటే అదే, అధినేత చంద్రబాబుతో సహా తమ్ముళ్ళంతా ఈ పాటికి జనంతోనే ఉంటూ వారి మాటే వింటూ, వారితో కలసి తింటూ తెగ హడావుడి చేయాలి. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. అధినేత చంద్రబాబే పరాయి రాష్ట్రంలో ఉంటే తమ్ముళ్ళు మాత్రం జనాలకు ఎడం పాటిస్తున్నది నిష్టుర సత్యం. విశాఖ లాంటి మహానగరంలో నలుచెరగులా గెలిచిన సైకిల్ పార్టీ తమ్ముళ్ళు ఇపుడు ఎక్కడ ఉన్నారంటే కార్యకర్తలే జవాబు చెప్పాలి. ఒకనాడు హుదూద్ టైంలో చేసిన హడావుడితో పోలిస్తే టీడీపీ తమ్ముళ్ళు ఇపుడు ఫుల్ సైలెంట్. అది విశాఖ జనాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

ఎంతైనా కాదుగా…?

మరో వైపు చూస్తే వైసీపీ నేతలు జనంలో ఉంటున్నారు. వారితో పాటుగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్ధుల సందడి చాలా ఎక్కువగానే ఉంది. వారే రేషన్ సరకులు ఇస్తున్నారు. వేయి రూపాయల ఆర్ధిక సాయం పక్కనా కనిపిస్తున్నారు. నిజంగా ఇదోరకం ఎన్నికల ప్రచారమే. కానీ మరో వైపు విపత్తు కూడా ఉంది దాంతో. అటు సాయం, ఇటు చైతన్యం అంటూ రెండు వైపులా వైసీపీ నేతలు ఉంటున్నారు. అయితే ఎంతలా వైసీపీ నేతలు ప్రజలతో కనిపిస్తున్నా గతంలో టీడీపీ తమ్ముళ్ళు చేసినట్లుగా మాత్రం లేదు. ఎందుకంటే ఆ హడావుడే వేరు. వార్డులో పది మంది టీడీపీ తమ్ముళ్ళు ఉంటే వారంతా కూడా జనంలోకి ఎవరికి వారే అన్నట్లుగా వచ్చేసేవారు. పైగా వారే మొత్తం సొమ్ము అంతా తమ చేతుల నుంచి ఇస్తున్నట్లుగా ఫోజులు కొట్టేవారు. వైసీపీకి ఎంత చేద్దామన్నా అది అబ్బడంలేదు కదా, ఎబ్బెట్టుగా కూడా ఉందన్న సెటైర్లు ఉన్నాయి.

విమర్శలతో….

వైసీపీ నేతలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారంటూ పసుపు పార్టీ నేతలు కుళ్ళుకుంటున్నారు. వారు ఎందుకు అలా తిరగాలి, వారు ఎందుకు అలా ఫోటోలకు ఫోజులు ఇవ్వాలీ ఇదీ తమ్ముళ్ళు వేస్తున్న ప్రశ్నలు, తమ పాలనలో చేసిన వన్నెలూ చిన్నెలూ మరచిపోయి ఇపుడు కడుపు మంటతోనే వైసీపీ నేతల మీద ఇలా విమర్శలు చాస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు. మరో వైపు తాము కూడా జనంలోకి రావచ్చు కదా, తగిన సాయం చేసి మార్కులు కొట్టేయవచ్చు కదా అని తటస్తులు, టీడీపీ అభిమానుల నుంచి కూడా వస్తున్న ప్రశ్నలు. ఎందుకో కానీ తమ్ముళ్ళు మాత్రం ఆ గట్టు దాటి ఈ గట్టుకు రావడంలేదు. దానికి కరోనా భయమని వైసీపీ నేతలు ఎకసెక్కం ఆడుతున్నారు.

అది బాధ్యత …..

ఇక టీడీపీ నేతల విమర్శలపైన మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. తాము జనంలో ఉంటే తప్పు అంటున్నారు. లేకుంటే ఇవే పచ్చ నోళ్ళు ఎక్కడ ఉన్నారు మీరు అని అడిగేవే, కడిగేసేవే అని కూడా అంటున్నారు. తమ బాధ్యత జనంలో ఉండడం, ఈ కష్టకాలంలో వారిని ఆదుకోవడం, కరోనా గురించి తెలియచెప్పి చైతన్యం చేయడం కూడా తమ బాధ్యత అని ఆయన సమర్ధించుకుంటున్నారు. ఇక రాజకీయం చేస్తున్నామని, ఓట్ల కోసమే జనాల వద్దకు వెళ్తున్నామని వస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. అన్నం తిన్న వాడెవడైనా ఈ సమయంలో ఓట్లు అడుగుతారా అంటూ తమ్ముళ్ళ తీరుపైన మండిపడ్డారు. మొత్తానికి వైసీపీ టీడీపీ నేతలకు ఇది కూడా పెద్ద రాజకీయమైపోయింది. జనాలకు సాయం చేయడం కూడా రచ్చగా మారుతోందా. సాయంలో కూడా రాజకీయం ఉందా అన్నది జనాలే తేల్చాలి మరి.

Tags:    

Similar News