ప్రతీకారం…సభా సమయం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రతీకారం కోసమేనన్నట్లు కన్పిస్తుంది. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతూ ప్రజా సమస్యలను పక్కకు నెట్టేస్తున్నారు. [more]

Update: 2019-12-13 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రతీకారం కోసమేనన్నట్లు కన్పిస్తుంది. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతూ ప్రజా సమస్యలను పక్కకు నెట్టేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న వారెవరైనా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయక తప్పదు. వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేసుకుంటుంటే, చంద్రబాబు జగన్ పై కాలు దువ్వడం నిత్యం కన్పించే దృశ్యంగా మారింది.

నిన్న జరిగిన సంఘటనపై…..

నిన్న మార్షల్స్ తో తెలుగుదేశం పార్టీ నేతలు గొడవ పడిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ చంద్రబాబును అసెంబ్లీ లోపలికి రానివ్వకపోవడంతోనే ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యారన్నది కాదనలేని వాస్తవం. నిన్న జరిగిన ఆ సంఘటనపై గురువారమే అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై స్పీకర్ తాను విచారిస్తానని చెప్పి సభను సజావుగా నడిపించారు. అయితే శుక్రవారం ఈ అంశం మళ్లీ రచ్చకావడానికి కారణం మీడియానే నంటున్నారు. నిజానికి ఈ సంఘటనను నిన్ననే అధికార పార్టీ వదిలేసింది.

ఆ మీడియాయే కారణమా….

అయితే ఏపీలోని కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్ష నేతకు అవమానం జరగిందంటూ పెద్దపెద్ద హెడ్ లైన్స్ తో బ్యానర్ ఐటమ్స్ వేయడంతో జగన్ పార్టీ నేతలకు కాలిందంటున్నారు. మార్షల్స్ మీద దాడికి దిగి, వారిపై దుర్భాషలాడిన టీడీపీ నేతలయితే, అవమానం అంటూ చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా పతాక శీర్షికలో రావడంతోనే నిన్నటి దృశ్యాలను బయటకు తీసి వైసీపీ నేతలు సభలో ప్రదర్శించారంటున్నది పార్టీ ఇన్నర్ వర్గాల టాక్.

వ్యక్తిగత దూషణలతో…

ఈరోజు సభాసమయం దాదాపు రెండున్నరగంటల పాటు వృధా అయింది. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు, తమపై దాడికి దిగిన మార్షల్స్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. చివరకు నిన్న జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పుడు మాటలు అనలేదని చంద్రబాబు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఇలా సభా సమయాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవడం కోసమే వృధా చేస్తున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సభలో ప్రజా సమస్యలపై చర్చించాలని, గత ఐదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన తరహాలోనే టీడీపీని చేయాలని చూడటం వైసీపీకి తగదన్న సూచనలు వస్తున్నాయి.

Tags:    

Similar News