ఆట మొదలయింది.. వెనకబడితే బలి కావాల్సిందే?
రాజకీయ చదరంగంలో తన, పర భేదం ఉండదు. ఆటసాగుతూ ఉండాల్సిందే. వెనకబడితే బలి కావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు మంత్రుల పదవులకు పరీక్షగా మారుతున్నాయి. జిల్లాలు, [more]
రాజకీయ చదరంగంలో తన, పర భేదం ఉండదు. ఆటసాగుతూ ఉండాల్సిందే. వెనకబడితే బలి కావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు మంత్రుల పదవులకు పరీక్షగా మారుతున్నాయి. జిల్లాలు, [more]
రాజకీయ చదరంగంలో తన, పర భేదం ఉండదు. ఆటసాగుతూ ఉండాల్సిందే. వెనకబడితే బలి కావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు మంత్రుల పదవులకు పరీక్షగా మారుతున్నాయి. జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణ చేసి మంత్రి వర్గ కూర్పు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి . రెండున్నర సంవత్సరాల తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయని మొదట్లోనే ప్రకటించారు. అంత టైమ్ ఇస్తే మంత్రుల్లో అలసత్వం నెలకొంటుందే మోననే అనుమానంతో ఆరునెలల తర్వాత వారి పనితీరును మదింపు చేస్తామని తర్వాత ప్రకటించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత ప్రస్తుతం స్థానికసంస్థల ఎన్నికలు వచ్చిపడ్డాయి. జిల్లాల్లో మంత్రులు తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం ఇది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ స్థానిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
అంతా తానే అయి…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నవరత్నాల అమలుకు పెద్ద పీట వేశారు. వాటన్నిటినీ పూర్తిగా అమల్లోకి తెచ్చిన తర్వాతనే ప్రజల్లోకి వెళ్లాలని ఆయన బలంగా భావించారు. అందుకే అమ్మ ఒడి వంటి పథకానికి సైతం దాదాపు ఆరువేల కోట్ల రూపాయలు జనవరిలోనే పంపిణీ చేశారు. నిజానికి ఈ పథకానికి పాఠశాలలు తెరిచే సమయం జూన్ వరకూ వ్యవధి ఉంది. అయినా ముందుగానే పథకాన్ని అమలులోకి తెచ్చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికే స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయింది. అయినప్పటికీ నవరత్నాల అమలు తర్వాతనే ఎన్నికలు అనే భావనతోనే వేగంగా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో పరిపాలనను ముఖ్యమంత్రి కోణంలోనే ప్రజలు చూస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రభావం చాలా తక్కువ. కర్త,కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి పంచాయతీ ఫలితాల విషయంలో మంత్రులపై బాధ్యతలు పెట్టడమేమిటని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పథకాల రూపకల్పన, నిధుల పంపిణీ పై ముఖ్యమంత్రి శ్రద్ధ పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో వాటిని సక్రమంగా అమలు చేయించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిపక్షాలు చేస్తున్నవిమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాల్సిన బాధ్యత సైతం మంత్రులు, ఎమ్మెల్యేల పరిధిలోనే ఉంటుంది. అందుకే స్థానిక ఎన్నికల ఫలితాలకు, ప్రజాప్రతినిధుల పెర్ ఫార్మెన్స్ కు సీఎం లింకు పెడుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అమాత్యులకు సెగ…
అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ఘనమైన మెజార్టీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి బెంచ్ మార్కుగా మారింది. అదే ఇప్పుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు పరీక్షగా మారుతోంది. సవాల్ విసురుతోంది. ఏడింట ఆరువంతుల అసెంబ్లీ సీట్లను వైసీపీ చేజిక్కించుకోగలిగింది. అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల్లో 90 శాతం వైసీపీకే రావాలంటూ ముఖ్యమంత్రి నిర్దేశిస్తున్నారు. సర్వసాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీ ఆధిక్యం సాధించడం ఆనవాయితీ. 70శాతం పైచిలుకు స్థానాలు పవర్ లోని పార్టీ ఖాతాలోనే పడుతూ ఉంటాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో స్థానికంగా ఉండే ప్రాధాన్యాలు, నాయకులు ముఖ్యపాత్ర పోషిస్తుంటారు. సుమారు నలభై సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానపార్టీగా ఉన్న తెలుగుదేశం గ్రామాల్లో పాతుకుపోయింది. అక్కడ ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. అందువల్ల వైసీపీ 90 శాతం లక్ష్యం చిన్నవిషయం కాదు. అభ్యర్థుల ఎంపికలో ఎక్కువగా ఎమ్మెల్యేలు కీలకంగా ఉంటారు. వారు సరైన వారిని ఎంపిక చేయకపోతే ఆ ప్రభావం మంత్రులపై పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే వివిధ అంశాల్లో సరైన విధంగా వ్యవహరించడం లేదనే అసంత్రుప్తి కొందరు మంత్రులపై పార్టీలో నెలకొంది. ఇప్పుడు ఎన్నికల పుణ్యమా? అని కొందరిపై వేటు పడే సూచనలు ఉన్నాయనేది పార్టీ వర్గాల సమాచారం. దానివల్ల అర్హులైన ఆశావహులకు అవకాశాలు లభిస్తాయి.
నిధుల యావే…
స్థానిక సంస్థల పట్ల ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చిన్నచూపే. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పదవీకాలాలు ముగిసినప్పటికీ అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పంచాయతీల ఎన్నికలకు ముందుగా వెళ్లి రిస్క్ చేయడానికి చంద్రబాబు సాహసించలేదు. అధికారంలో ఉన్నపార్టీగా లభించే ప్రయోజనాలను చేజేతులారా టీడీపీ కోల్పోయింది. తాజా ఎన్నికల్లో కచ్చితంగా అధికారపార్టీ ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయని తటస్థ రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ వెనకబడిన తరగతుల కార్డును బయటికి తీస్తోంది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసింది. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తంతు మాత్రమే అని విమర్శకులు పేర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం సైతం గడచిన తొమ్మిదినెలల కాలవ్యవధిలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకుండా నాన్చివేత ధోరణిని అనుసరించింది. రానున్న 25 రోజుల కాలవ్యవధిలో ఎన్నికలు పూర్తి చేయించేందుకు హడావిడి పడుతోంది. స్థానిక సంస్థలకు రావాల్సిన అయిదువేల కోట్ల రూపాయల నిధులు మురిగిపోతాయనే ఆందోళన ప్రభుత్వంలో కనిపిస్తోంది. పంచాయతీల్లో ప్రజాస్వామ్యం, అధికార పంపిణీ వంటి అంశాల కంటే ఆర్థిక అవసరాలే ప్రభుత్వానికి ఒక రాజకీయ అనివార్యతను కల్పిస్తున్నాయి. సిబ్బంది ఎంపిక, శిక్షణ, బందోబస్తు వంటి అంశాలు ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిజమైన సవాల్ గా చెప్పుకోవాలి.
-ఎడిటోరియల్ డెస్క్