పౌరుషానికి పోయి అసలుకే ఎసరు తెస్తున్నారే?

సీమ పౌరుషం అంటే అదేనేమో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలసికట్టుగా ఉండే నేతలు [more]

Update: 2020-10-10 12:30 GMT

సీమ పౌరుషం అంటే అదేనేమో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలసికట్టుగా ఉండే నేతలు అధికారంలోకి రాగానే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా ఎంతకైనా తెగిస్తారు. రాయలసీమకు నీళ్లు రాకపోయినా ఒప్పుకుంటారు కానీ పెత్తనం కోసం ప్రయత్నిస్తే ఒప్పుకోరు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇది ఎక్కువగా కన్పిస్తుంది.

టీడీపీ హయాంలోనూ….

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో గ్రూపు రాజకీయాలకు కొదవేమీ ఉండేది కాదు. జేసీ దివాకర్ రెడ్డి ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని ప్రభాకర్ చౌదరి ప్రయత్నించేవారు. కాల్వ శ్రీనివాసులుకు దీపక్ రెడ్డి అడ్డం పడే వారు. పల్లె రఘునాధరెడ్డికి నిమ్మల కిష్టప్ప కాళ్లు అడ్డంపెట్టేవారు. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గొడవలు పడుతూ పార్టీని ఇబ్బంది పెట్టేవారు. చివరకు ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో చూపించింది.

వైసీపీలోనూ….

ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇందులో ఏమాత్రం మార్పు రాలేదు. కాకుంటే నేతలు మారారు. తప్పించి అవే విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఇతర వైసీపీ నేతలకు పడటం లేదు. ఉరవ కొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా మరో వర్గం తయారయింది. హిందూపురం నియోజవర్గం వైసీపీలో మూడు గ్రూపులుతయారయ్యాయి.

అన్ని నియోజకవర్గాల్లో…..

ఇక మంత్రి శంకరనారాయణ తన నియోజకవర్గమైన పెనుకొండలో తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. అక్కడి అసమ్మతి నేతలకు మద్దతుగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. అదే సయమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అసమ్మతివాదుల వెంట నడుస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అసమ్మతి నేతలు ఎక్కువవుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. జగన్ సత్వర చర్యలు తీసుకోకుంటే, ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News