పార్టీని డ్యామేజ్ చేస్తుంది వారేగా?

ఒక‌రు కాదు.. ఇద్దరు కాదు.. చాలా మంది అధికార పార్టీ నాయ‌కులు వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో ఆపార్టీ ప‌లుచ‌న అవుతోంద‌నేది వాస్తవం. ఎక్కడో ఒక‌చోట‌.. పార్టీ నాయ‌కుల‌కు `క్రమ‌శిక్షణ‌` [more]

Update: 2020-08-06 00:30 GMT

ఒక‌రు కాదు.. ఇద్దరు కాదు.. చాలా మంది అధికార పార్టీ నాయ‌కులు వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో ఆపార్టీ ప‌లుచ‌న అవుతోంద‌నేది వాస్తవం. ఎక్కడో ఒక‌చోట‌.. పార్టీ నాయ‌కుల‌కు 'క్రమ‌శిక్షణ‌' అనే ల‌క్ష్మణ రేఖ లేక‌పోతే.. ఇదిగో ఇప్పుడు ప్రతిప‌క్షాల‌కు మ‌రింత ఛాన్స్ ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నో ఆశ‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కారుప‌గ్గాలు చేప‌ట్టింది. ప్రజ‌ల‌కు అనుకూలంగానే ఉంటూ.. అనేక కార్యక్రమాలు కూడా చేప‌డుతోంది. ప్రజ‌ల వ‌ద్దకు పాల‌న -అంటూ.. గ‌త ప్రభుత్వాలు జిమ్మిక్కులు చేస్తే.. జ‌గ‌న్ మాత్రం దానిని నిజం చేశారు.

దూకుడు కామెంట్లతో……

త‌న ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప‌నినీ, కార్యక్రమాన్నీ ఆయ‌న ప్రజ‌ల‌కు చేరువ చేస్తున్నారు. అయితే, ఇది ఎంత బాగున్నా.. క‌డివెడు పాల‌లో చిన్న ఉప్పుగ‌ల్లు ప‌డిన‌ట్టుగా.. నేత‌లు చేస్తున్న దూకుడు కామెంట్లతో మంచి మొత్తం కొట్టుకుపోతోంది. పార్టీకి చెందిన కొంద‌రు కీల‌క నేత‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతోన్న తీరు, వాడుతోన్న భాష సామాన్యుల్లో, న్యూట్రల్ జ‌నాల్లో పార్టీ ప‌ట్ల, ప్రభుత్వం ప‌ట్ల యావ‌గింపున‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌న్నది నిజం.

పార్టికి నష్టమేగా….?

ప్రతిప‌క్షాల విమ‌ర్శల‌కు కౌంట‌ర్లు ఇవ్వడంలో త‌ప్పులేదు.. చాలా స్ట్రాంగ్‌గా ఇవ్వాలి కూడా… అయితే స‌హ‌నం కోల్పోతున్న కొంద‌రు వైసీపీ నేత‌లు సైతం ఘోర‌మైన, తీవ్రమైన ప‌ద‌జాలం వాడ‌డ‌మే ఇప్పుడు వ‌స్తోన్న అస‌లు స‌మ‌స్య. ఇది అంతిమంగా జ‌గ‌న్‌పై కూడా ప‌డేలా ఉంది. ఇందులో మంత్రులు కూడా ఉన్నారు. గ‌తంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల‌తో ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న‌పై మంచి ఇమేజ్ రానేలేదు. సామాజిక వ‌ర్గ ప‌రంగాను, చంద్రబాబు, టీడీపీపై దూకుడుగా విమ‌ర్శలు చేసే విష‌యంలో నానిని కొంద‌రు అభిమానించే వారు ఉన్నా… ఆయ‌న వాడుతోన్న భాష వ‌ల్ల పార్టీకి లాభం కంటే న‌ష్టమే ఎక్కువ జ‌రుగుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెపుతున్నాయి.

వాడే భాష వల్లనే….

ఈ భాష వ‌ల్ల కేవ‌లం టీడీపీకే కాకుండా అటు అన్ని ప్రతిప‌క్షాల నేత‌ల‌తో పాటు సామాన్య ప్రజ‌ల‌కు కూడా అధికార పార్టీపై విమ‌ర్శలు చేసే ఛాన్స్ ఇచ్చిన‌ట్లవుతోంది. అదేవిధంగా మరో మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ రాజ‌ధాని అమ‌రావ‌తిపై చేసిన కామెంట్లు కూడా ఇప్పటి వ‌ర‌కు చ‌ల్లార‌లేదు. పైగా ఆయ‌న అక్కడ తిరుగుతుంటే.. 'శ్మశానంలో నీకేం ప‌ని' అని ప్రశ్నించే ప‌రిస్థితి వ‌చ్చింది. అదేవిధంగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కూడా ఇటీవ‌ల కాలంలో త‌న‌లోని సౌమ్యత్వాన్ని కోల్పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్రతిప‌క్షాన్ని, ఆ పార్టీ నేత‌ల‌ను టార్గెట్ చేసే స‌మ‌యంలో కొన్ని విలువ‌ల‌ను కోల్పోతున్నార‌నే వాద‌న ఉంది.

ఛాన్స్ ఇచ్చినట్లేగా…?

ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు లాంటి వాళ్లు కూడా ఇంట‌ర్వ్యూల‌లో తీవ్రమైన భాష వాడి విమ‌ర్శల పాల‌య్యారు. నిజానికి ప్రతిప‌క్ష నాయ‌కులు ఇప్పటి వ‌ర‌కు ముగ్గురు అరెస్టయినా.. అవి వారి స్వయంకృతం. వారు చేసిన త‌ప్పుల‌తోనే వారు అరెస్టయ్యారు. కానీ, మంత్రులు స‌హా ఇత‌ర నాయ‌కులు చేస్తున్న కామెంట్ల కార‌ణంగా.. ఆ అరెస్టుల వెనుక అధికార పార్టీ నేత‌లు ఉన్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. దీనినిబ‌ట్టి.. ఇప్పటికైనా ప్రతిప‌క్షాల‌కు ఛాన్స్ ఇవ్వకుండా మెల‌గాల్సిన అవ‌స‌రం వైసీపీ నేతలకు ఎంతైనా ఉంది.

Tags:    

Similar News