విరుగుడు మంత్రం ఇదేనా?

ఏమైనా ఐడియాలు ఉండాలి కానీ ఎటువంటి గండమైనా గట్టెక్కవచ్చు. ఇపుడిపుడే గాడిలో పడుతున్న వైసీపీ సర్కార్ పాలనకు తోడు పెద్దలు కూడా తమ మెదడుకు పదును పెడుతున్నారు. [more]

Update: 2020-04-28 12:30 GMT

ఏమైనా ఐడియాలు ఉండాలి కానీ ఎటువంటి గండమైనా గట్టెక్కవచ్చు. ఇపుడిపుడే గాడిలో పడుతున్న వైసీపీ సర్కార్ పాలనకు తోడు పెద్దలు కూడా తమ మెదడుకు పదును పెడుతున్నారు. అందుకే కొత్త ఆలోచనలతో విపక్షాలను చిత్తు చేయాలనుకుంటున్నారు. పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసిన వైసీపీ గత కొంతకాలంగా కోర్టు మొట్టికాయలతో సతమతమవుతోంది. ఇక మూడు నెలలలు గడువు తాజాగా ఇచ్చిన హైకోర్టు అప్పటికి రంగులు మొత్తం మార్చేయాలని సూచించింది. దీనికి ఇపుడు విరుగుడు మంత్రాన్ని వైసీపీ కనిపెట్టేసింది. ఉన్న మూడు రంగులకు తోడు కొత్తగా మరో రంగు కలిపేస్తే కొత్త రంగులు అయిపోతాయి. అదే ఇపుడు వైసీపీ సర్కార్ ఆలోచన చేస్తోంది. ఈ మాస్టర్ మైండ్ తో అటు కోర్టు ఆదేశాలను మన్నిస్తూనే ఇటు విపక్షాల రాజకీయ బాధలను తప్పించుకోవచ్చునని ఆలోచిస్తోందిట.

సబ్ కమిటీ పేరిట….

ఇక వైసీపీ సర్కార్ ప్రభుత్వ భవనాలకు రంగులు ఎలా ఉండాలన్న దాని మీద ఇప్పటికే ఉన్నత అధికారులతో ఒక సబ్ కమిటీని వేసింది. ఆ కమిటీ జాతీయ ప్రభుత్వ భవనాల కోడ్ ని మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సూచనలు చేసిందట. దాని ప్రకారం ప్రభుత్వ ఆఫీసులకు రంగులు వాటి ఉద్దేశ్యాలను తెలియచేయాలని, అలాగే అవి అక్కడ భౌగోళిక పరిస్థితులకు, ప్రకృతికి అద్దం పట్టాలని సూచించిందట. దాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఇపుడు కొత్తగా మరో రంగును చేర్చుతున్నారు.

బీజేపీ కూడా….

ఇక కొత్తగా చేర్చే రంగు మట్టి రంగు. అది భూమికి, మట్టికి సంబంధించిన సూచికగా చెబుతారు. దాన్ని పరిగణలోకి తీసుకుని మట్టి రంగుని ఇపుడు పంచాయతీ భవనాలకు పూస్తారు. అంటే వైసీపీ మూడు రంగులు ఉండగానే బీజేపీ రంగు కూడా వచ్చి చేరుతుంది. దాంతో సహజంగానే బీజేపీ పెద్దలు కూడా ఏమీ అనలేరు. టీడీపీ, జనసేన కూడా దూకుడు చేయలేరు. అదే విధంగా కాషాయం పూతతో పెద్ద ముప్పుని తప్పించుకోవలన్నది వైసీపీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. మరో వైపు సబ్ కమిటీ సూచించిన రంగులలో ఆకు పచ్చ వ్యవసాయ విప్లవానికి, నీలి రంగు ఆక్వా విప్లవానికి, తెలుపు రంగు క్షీర విప్లవానికి గుర్తుగా భావిస్తున్నారుట. రేపటి రోజున ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా సబ్ కమిటీ సిఫార్సులు, జాతీయ ప్రభుత్వ భవనాల మార్గదర్శకాలను జోడించి మరీ రంగుల కధను తమకు అనుకూలంగా వైసీపీ మలచుకుంటోంది.

తక్కువ ఖర్ఛుతో…..

నిజానికి ఎవరు సలహా ఇచ్చారో, మరే ఉత్సాహం నడిపించిందో తెలియదు కానీ దాదాపు 1500 కోట్లు వెచ్చించి మరీ పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేసి పారేశారు. ఇపుడు ఆ రంగులు మార్చాలన్నా, మొత్తం తిరగతోడాలన్నా కూడా మరో 1500 కోట్లు ఖర్చు అవుతాయి. ఇక కరోనా కాటు వేసిన వేళ ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వం వద్ద లేదు. దాంతో అన్నింటికీ పరిష్కారంగా కొత్త రంగును కూడా చేర్చితే తక్కువ ఖర్చుతో పూర్తిఅయిపోవడమే కాకుండా కోర్టు తీర్పుని కూడా మన్నించినట్లవుతుందని అంటున్నారు. చూడాలి మరి. వైసీపీ ప్లాన్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.

Tags:    

Similar News