సమయం వచ్చినప్పుడు వీరంతా…?

2019 ఎన్నికలకు ముందు సీన్ మీకు గుర్తుండే ఉండుంటుంది. లోటస్ పాండ్ లో రోజూ చేరికలే. అనేక పార్టీల నుంచి నేతలు కట్టగట్టుకుని మరీ వైసీపీ కండువా [more]

Update: 2020-06-12 02:00 GMT

2019 ఎన్నికలకు ముందు సీన్ మీకు గుర్తుండే ఉండుంటుంది. లోటస్ పాండ్ లో రోజూ చేరికలే. అనేక పార్టీల నుంచి నేతలు కట్టగట్టుకుని మరీ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. జగన్ పాదయాత్ర ఫలితమో? చంద్రబాబుపై అసంతృప్తి ఉందని తెలిసో? నేతలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. వారి చేరికతోనే పార్టీ విజయం సాధించిందని చెప్పలేము కాని, విజయానికి చేరికలు బూస్ట్ ఇచ్చాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఊరికే చేరతారా?

పార్టీలో నేతలు ఊరికే చేరరు. పదవులో, ప్రయోజనాలో ఆశించి పార్టీని వీడతారు. చేరతారు. కానీ ఏడాది కావస్తున్నప్పటికీ జగన్ పార్టీలో చేరిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. కనీసం నామినేటెడ్ పదవులు కూడా వారికి దక్కలేదు. దీంతో వారిలో అసంతృప్తి నెలకొందని అంటున్నారు. అనేక చోట్ల పార్టీ కార్యక్రమాలకు కూడా వీరు దూరంగా ఉంటున్నారు. పదవులే కాదు నియోజకవర్గంలో కూడా వీరికి ప్రాధాన్యత లేకపోవడంతో వైసీపీకి వీరంతా దూరంగా ఉంటున్నారు. పార్టీ వాయిస్ ను విన్పించేందుకు కూడా కొందరు ముందకు రావడం లేదు.

బలమైన వాయిస్ ఏదీ?

సి.రామచంద్రయ్య లాంటి నేతలు పార్టీకి బలమైన వాయిస్. అయితే ఆయన పార్టీలో చేరినా ప్రాధాన్యత లభించలేదు. చల్లా రామకృష్ణారెడ్డి, ఇక్బాల్ వంటి వారికే ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఆ మండలి కూడా రద్దు దిశగా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీలో చేరిన బుట్టా రేణుక, కిల్లి కృపారాణి, ఎస్వీ మోహన్ రెడ్డి, దాడి వీరభద్రరావు లాంటి నేతలు ఇప్పటికే పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

నాలుగేళ్ల పాటు ఉన్నా…

అయితే నాలుగేళ్ల పాటు వీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా ఆ తర్వాత మాత్రం వీరు వైసీపీ అధిష్టానానికి ఝలక్ ఇస్తారంటున్నారు. అనేక మంది ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద తమగోడును వినిపిస్తున్నారు. కనీసం తమ వైపు చూసే ప్రయత్నం కూడా అధిష్టానం చేయకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. వీరు నామినేటెడ్ పోస్టులు తీసుకోరు. మండలికి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు. రాజ్యసభ స్థానాలు కూడా భవిష్యత్తులో దక్కే అవకాశం లేదు. దీంతో వారు సమయం కోసం వేచి చూస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఏడాది కాలంలో జగన్ పార్టీ నేతలను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News