పార్టీ మారినా, ఎమ్మెల్యే మారినా సీన్ మారలేదు ?
ఏపీలో అధికార వైసీపీలోని చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు మామూలుగా లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో [more]
ఏపీలో అధికార వైసీపీలోని చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు మామూలుగా లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో [more]
ఏపీలో అధికార వైసీపీలోని చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు మామూలుగా లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ గ్రూపు రాజకీయాలే పార్టీకి దెబ్బేశాయి. ఇప్పుడు వైసీపీలోనూ అదే తంతు నడుస్తోంది. విచిత్రం ఏంటంటే నాడు టీడీపీ కేడర్ కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుతో ఎలా నలిగిందో ? పార్టీకి ఎలా దెబ్బ పడిందో ? ఇప్పుడు వైసీపీలోనూ అదే నియోజకవర్గాల్లో మళ్లీ అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పోరుతో కేడర్ నలుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్సెస్ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మధ్య గ్రూపు పాలిటిక్స్ హీటెక్కాయి.
టీడీపీలోనూ…
గత టీడీపీ ప్రభుత్వంలో చింతలపూడి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న పీతల సుజాత వర్సెస్ నాటి ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు వర్గాలు ఏ మాత్రం తగ్గలేదు.. కరవమంటే కప్పకుకోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా రెండు వర్గాలు వ్యవహరించాయి. చివరకు ఈ గ్రూపు పోరులోనే మంత్రి పీతల సుజాత మంత్రి పదవి సైతం కోల్పోయారు. అయినా కూడా గత ఎన్నికలకు ముందు వరకు రెండు వర్గాల పంతం అలాగే నడిచింది. చివరకు సుజాత నాలుగన్నరేళ్ల పాటు చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవిని కూడా భర్తీ చేయలేదు. చివరకు ఎన్నికల వేళ సుజాతకు టిక్కెట్ కూడా రాలేదు. మాగంటి సీటు దక్కించుకున్నా ఘోరంగా ఓడిపోయారు.
ఇప్పుడు వైసీపీలోనూ సేమ్ సీన్…
కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది.. చింతలపూడిలో వైసీపీ ఎమ్మెల్యే, ఏలూరులో వైసీపీ ఎంపీయే ఉన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య వార్‌లో పార్టీ కేడర్ ఎలా నలిగిపోయిందో ఇప్పుడు వైసీపీ కేడర్ కూడా అలాగే నలుగుతోంది. గత ఎన్నికల్లో గెలిచాక తొలి యేడాది బాగానే ఉన్న ఎమ్మెల్యే ఎలీజా, ఎంపీ శ్రీధర్ మధ్య ఇప్పుడు తీవ్రమైన ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పలు కీలక పంచాయతీల్లో వైసీపీలోనే రెండు వర్గాల ఫ్యానెల్స్ పోటీ చేశాయి. ఈ పోరులో ఎలీజా వర్గం ఎక్కడ పోటీ చేసినా చిత్తుగా ఓడిపోయింది.
ఎంపీ సొంత నియోజకవర్గం కావడంతో…?
చింతలపూడి నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి యేడాది క్రితమే ఎంపీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని అనుకున్నారు. ఈ వర్గ పోరు తర్వాత ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన నేతకు చైర్మన్ పదవి కట్టబెట్టుకోవాలని చూశారు. చివరకు రెండు వర్గాలు పంచాయితీ సీఎం వద్దకు చేరడంతో సీఎం మధ్యేమార్గం బీసీలకు ఈ పదవి ఇచ్చేశారు. ఇప్పుడు ఎంపీపీల విషయంలోనూ వీరి మధ్య పంచాయితీ తెగేలా లేదు. వాస్తవంగా చూస్తే ఎంపీ శ్రీధర్‌కు చింతలపూడి సొంత నియోజకవర్గం కావడం… ఆయన తండ్రి కోటగిరి విద్యాధరరావు ఇక్కడ రెండున్నర దశాబ్దాలుగా ఏకచక్రాధిపత్యంగా రాజకీయాలు చేయడంతో ప్రతి గ్రామంలోనూ కోటగిరి వర్గం బలంగా ఉంది.
రెండుగా చీలిపోయి….
అయితే కోటగిరి వర్గానికి ధీటుగా తాను కూడా పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తోన్న ఎమ్మెల్యే కొన్ని వర్గాలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఎంపీ వర్గం ఎక్కువుగా ఉండడంతో అక్కడ ప్రయార్టీ లేదనుకున్న వారంతా ఇప్పుడు ఎమ్మెల్యే వర్గంలో చేరిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎంపీకి బలమైన వ్యతిరేక వర్గంగా ఉన్న టీడీపీ నేతలను ఎమ్మెల్యే స్వయంగా పార్టీలో చేర్చుకుంటున్నారు. పైగా ఎంపీ సొంత మండలంలోనూ ఎమ్మెల్యే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో జరిగే ప్రాధమిక సహాకార సంఘాల ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే తన సొంత ఫ్యానెల్స్‌ను పోటీలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ శ్రీధర్ మాత్రం.. తన సొంత మండలంలో తన కేడర్‌ను స్ట్రాంగ్ చేస్తే పార్టీకి.. అటు ఎమ్మెల్యేగా కూడా ప్లస్సే కదా ? అని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ రెండు వర్గాల పోరులో చింతలపూడి కేడర్ రెండుగా చీలిపోతోంది.