జగన్ ఇటు చూడకుంటే… భవిష్యత్తులో?

తూర్పుగోదావ‌రి జిల్లాలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ పోరు భారీ స్థాయిలో సాగు తోంది. ఇప్పటికే ఉన్న నేత‌ల మ‌ధ్య పోరు ఒక [more]

Update: 2020-03-03 02:00 GMT

తూర్పుగోదావ‌రి జిల్లాలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ పోరు భారీ స్థాయిలో సాగు తోంది. ఇప్పటికే ఉన్న నేత‌ల మ‌ధ్య పోరు ఒక రేంజ్‌లో సాగుతుంటే.. ఇటీవ‌ల కొత్తగా పార్టీలోకి వ‌చ్చిన నాయ‌కుడు, వేరే పార్టీ త‌ర‌ఫున గెలిచి కూడా వైసీపీ పంచ‌నే కాలం వెళ్లదీస్తున్న మ‌రో నాయ‌కుడు ఎంట్రితో పార్టీలో తీవ్రమైన వ‌ర్గ పోరు చోటు చేసుకుంది. విష‌యంలోకి వెళ్తే.. రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలోని ఇద్దరు కీల‌క నాయ‌కుల మ‌ధ్య టికెట్ పోరుతో విభేదాలు సాగుతున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు ద‌క్కాల్సిన టికెట్‌ను చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ద‌క్కించుకున్నార‌ని సీనియ‌ర్ నాయ‌కుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అక్కసుతో ఉన్నారు.

ఆధిపత్యం కోసమే….

గ‌త ఎన్నిక‌ల స‌మయంలో బోస్‌ను మండ‌పేట‌కు పంపిన జ‌గ‌న్‌.. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామ‌చంద్రపురం టికెట్ ఇచ్చారు. దీంతో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన తోట త్రిమూర్తులును ఓడించిన చెల్లుబోయిన విజ‌యం సాధించారు. అయితే, మండ‌పేట నుంచి పోటీ చేసిన బోస్ ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో బోస్ వ‌ర్సెస్ చెల్లుబోయినల మ‌ధ్య వివాదంగా మారింది. ఇంత‌లోనే టీడీపీ నుంచి ఓడిపోయిన తోట త్రిమూర్తులు వైసీపీలో చేరి అమ‌లాపురం వైసీపీ పార్లమెంటు ఇంచార్జ్‌గా చ‌క్రం తిప్పుతున్నారు. ఈ నేప‌థ్యంలో నే ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రపురంపై ప‌రోక్షంగా ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నారు.

బోస్ వర్సెస్ వేణు….

ఈ ప‌రిణామాల‌తో చెల్లుబోయిన వ‌ర్గం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇటీవ‌ల పార్టీ సీనియ‌ర్ నేత‌, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ ఇంచార్జ్ మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌ల స‌మ‌క్షంలోనే ఇజ్రాయెల్ అనే నాయ‌కుడు తోట‌పైకి చెప్పుతో దాడి చేయ‌బోయాడు. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం సృ ష్టించింది. ఈ ప‌రిణామంతో రామ‌చంద్రపురం వైసీపీలో నువ్వా-నేనా అనే రాజ‌కీయ ర‌గ‌డ జ‌రుగుతోంది. ఒక‌రిపై ఒక‌రు దూకుడు రాజ‌కీయాలు, ఆధిప‌త్య రాజ‌కీయాలు చేసుకుంటున్నారు. తోట త‌మ పార్టీలోకి వ‌చ్చినా.. త‌న‌కు ఎప్పుడూ ఆయ‌న శ‌త్రువే అంటు.. బోసు వ్యాఖ్యానించిన విష‌యం కూడా గ‌మ‌నార్హం. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బోస్ వ‌ర్సెస్ చెల్లుబోయిన వ‌ర్సెస్ తోట అన్నట్టుగా రాజకీయాలు న‌డుస్తున్నాయి.

రాజోలు ప‌రిస్తితి ఇదీ…

ఇదే జిల్లాలోని రాజోలు లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంది. మాజీ ఇరిగేష‌న్ ఇంజ‌నీర్ బొంతు రాజే శ్వ‌ర‌రావు రాజోలు వైసీపీకి అండ‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు వ‌ర్గం బొంతుకు అనుకూలంగా వ్యవ‌హ‌రించేది. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌.. బొంతుకు టికెట్ ఇచ్చిన‌ప్పుడు అల్లూరి వ‌ర్గం ఆయ‌న‌కు ప‌నిచేసింది. అయితే, ఆ ఎన్నిక‌ల్లో బొంతు ఓడిపోయారు. అనంత‌రం. అల్లూరి వ‌ర్గం బొంతుకు దూర‌మైంది. ఇక‌, 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి జ‌గ‌న్ మ‌రోసారి బొంతుకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైన‌ప్పుడు .. అల్లూరి వ‌ర్గం ఇవ్వొద్దని సూచించింది. అంతేకాదు, రాపాక వ‌ర‌ప్రసాద్‌కు ఇవ్వాల‌ని కూడా కోరింది.

పార్టీలోకి వచ్చిన వారికే…..

అయితే, పార్టీలో చిర‌కాలం నుంచి ఉన్న నేప‌త్యంలో బొంతుకే జ‌గ‌న్ మొగ్గు చూపారు. ఈ ప‌రిణామంతో అల్లూరి వ‌ర్గం వైసీపీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నిక‌ల్లో ఇక్కడ జ‌న‌సేన విజ‌యం సాధించింది. అయితే, వైసీపీ అధికారంలోకి వ‌చ్చే స‌రికి అల్లూరి వ‌ర్గం మ‌ళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకుంది. ఈ ప‌రిణామంతో బొంతు వ‌ర్గం అల్లాడిపోతోంది. త‌మ ప‌రాజ‌యానికి కార‌ణ‌మైన అల్లూరి వ‌ర్గాన్ని ఎలా చేర్చుకుంటార‌ని ప్రశ్నిస్తూనే.. మ‌రోప‌క్క, ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీసింది. అయితే, దీనిని బ‌లంగా ఢీకొట్టే క్రమంలో అల్లూరి వ‌ర్గం కోట‌నందూరు మాజీ జెడ్పీటీసీ అమ్మాజీకి మాల కార్పొరేష‌న్ చైర్ ప‌ర్సన్ ప‌ద‌వి ఇప్పించారు.

మూడు ముక్కలాటగా….

ఈ క్రమంలోనే అమ్మాజీకి రాజోలు వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇప్పించుకోవ‌డంలో కూడా అల్లూరి వ‌ర్గం స‌క్సెస్ అయ్యింది. దీంతో అమ్మాజీ.. బొంతుకు వ్యతిరేకంగా చ‌క్రం తిప్పడం ప్రారంభించారు. అదే స‌మ‌యంలో అల్లూరి వ‌ర్గానికి అనుకూలం వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన త‌ర‌పున గెలిచిన రాపాక పార్టీ మార‌క‌పోయినా.. వైసీపీ ఎమ్మెల్యేగా చ‌లామ‌ణి అవుతున్నారు. దీంతో బొంతు వ‌ర్గం తీవ్ర ఆందోళ‌న‌లో ప‌డిపోయింది. అమ్మాజీ-బొంతు వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు ఇలా ఉన్న స‌మ‌యంలో రాపాక కూడా వైసీపీలో చేర‌క‌పోయినా.. త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇక్కడ మూడు ముక్కలాటగా మారిపోయింది. ఈ ప‌రిస్థితి ఎటు దారితీస్తుందోన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Tags:    

Similar News