గ్రేటర్ విశాఖలో వైసీపీకి డేంజర్ సిగ్నల్స్ ?

విశాఖ మహా నగరాన్ని ఒడిసిపట్టాలని, రాజకీయంగా జెండా ఎగరేయాలని ఓ వైపు కసిగా వైసీపీ హై కమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు [more]

Update: 2021-01-16 08:00 GMT

విశాఖ మహా నగరాన్ని ఒడిసిపట్టాలని, రాజకీయంగా జెండా ఎగరేయాలని ఓ వైపు కసిగా వైసీపీ హై కమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు చూస్తే పూర్తిగా తేడా కొట్టేలా ఉన్నాయని అంటున్నారు. గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలు ఇప్పటికిపుడు జరిగితే వైసీపీ అభ్యర్ధులు సగానికి సగం చోట్ల ఓటమి పాలు అవుతారని ఇంటలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ హాట్ హాట్ సమాచారంతో వైసీపీ హై కమాండ్ అప్రమత్తం అయిందని ప్రచారం సాగుతోంది.

అంతలా వ్యతిరేకతా…?

జీవీఎంసీ ఎన్నికలను 2020 మార్చిలో నిర్వహించాలనుకున్నారు. అభ్యర్ధులను కూడా హడావుడిగా ఖరారు చేశారు. మొత్తం 98 డివిజన్లకు గానూ అభ్యర్ధుల ఎంపిక జరిగిపోయింది. బీ ఫారాలూ కూడా ఇచ్చేస్తారనగానే ఎన్నికల సంఘం హఠాత్తుగా ఎన్నికలను వాయిదా వేసింది. ఈ పరిణామంతో అంతా ఖిన్నులు అయ్యారు. ఇక గత తొమ్మిది నెలలుగా చూసుకుంటే వైసీపీ అభ్యర్ధులలో కొందరు తాము అపుడే ఎన్నికైపోయినట్లుగా భావిస్తూ జనాల్లో దందా చేయడం మొదలెట్టారని టాక్ అయితే ఉంది. దానికి తోడు ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరకుండా చేతివాటం చూపడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని హడావుడి చేయడంతో జనంలో కావాల్సినంత చెడ్డ పేరు మూటకట్టుకున్నారని వైసీపీ అధినాయకత్వానికి నివేదికలు వెళ్లాయని అంటున్నారు.

మార్చకపోతే ఓటమే….?

స్థానిక సంస్థలకు ఎన్నికలను మేలో నిర్వహిస్తారని అంటున్నారు. అంటే చాలా సమయం ఉంది. ఈలోగా ఈ అభ్యర్ధులను ఇలాగే వదిలేస్తే మరింత దందాలు జరిగి వైసీపీ మీద పూర్తి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. దాంతో కనీసంగా మూడవ వంతు మంది అభ్యర్ధులను అయినా ఎన్నికల వేళకు మార్చకతప్పదని నివేదికలు చెబుతున్నాయట. వారి స్థానంలో రిజర్వేషన్లతో పాటు అంగ బలం, అర్ధబలం ఉన్న కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖలో వైసీపీ పరిస్థితి, విజయావకాశాల మీద సర్వేలు చేయిస్తున్న అధినాయకత్వం ఈ చేదు నిజాలు తెలిసి ఖంగు తిందని అంటున్నారు.

కుమ్ములాటలేనా…?

ఇపుడు వైసీపీ ఈ విషయంలో నానా హైరానా పడుతోందని తెలుస్తోంది. మొదట్లో అభ్యర్ధులను ప్రకటించి హఠాత్తుగా ఇపుడు మారిస్తే వారు రెబెల్స్ గా మారి కొంప ముంచుతారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. వేరే వారిని టికెట్లు ఇస్తే వారికి ఎంత మేరకు మార్చేసిన అభ్యర్ధులు సహకరిస్తారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయట. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ మేయర్ పీఠాన్ని కొట్టాలని ఆరాటపడుతున్న వైసీపీకి ఈ పరిణామాలు ఎంత మాత్రం మింగుడు పడడంలేదు అంటున్నారు. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో విశాఖలో పొలిటికల్ గా ఏమైనా తేడా వస్తే మొత్తం వైసీపీ సర్కార్ మీద ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి జీవీఎంసీ ఎన్నికలు వైసీపీకి పెను సవాల్ ని విసురుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News