అక్కడ వైసీపీ ఎటుపోతోంది…ఎవరికీ తెలియదట
అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం. ఇది టీడీపీకి పెట్టని కోట. అయితే, అదే సమయంలో ఇక్కడి ప్రజలు ఇటీవల కాలంలో ఆ పార్టీ తరఫున రెండు [more]
అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం. ఇది టీడీపీకి పెట్టని కోట. అయితే, అదే సమయంలో ఇక్కడి ప్రజలు ఇటీవల కాలంలో ఆ పార్టీ తరఫున రెండు [more]
అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం. ఇది టీడీపీకి పెట్టని కోట. అయితే, అదే సమయంలో ఇక్కడి ప్రజలు ఇటీవల కాలంలో ఆ పార్టీ తరఫున రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే బాలయ్యపై ఒకింత అసహనంతో ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఉన్న వైసీపీ కొంత పుంజుకుంటే ప్రజలు ఈ పార్టీని ఆదరించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఎక్కడైనా రాజకీయాలంటే ఎదుటి పార్టీ వీక్‌నెస్ నుంచే పుడతాయనేది వాస్తవం. అయితే, దీనికి భిన్నంగా వ్యవహరిస్తోందని వైసీపీపై విమర్శలు వస్తున్నాయి. ఆ పార్టీ సానుభూతిపరులు కూడా పార్టీ నేతలపై మండిపడుతున్నారు. దీంతో హిందూపురంలో వైసీపీ రాజకీయాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఇద్దరు కీలక నాయకులు ఉన్నారు. గత ఎన్నికల వరకు పార్టీని నడిపించిన నాయకుడు నవీన్ నిశ్చల్. గత ఏడాది ఎన్నికల్లో అనూహ్యంగా తెరమీదికివచ్చి టికెట్ దక్కించుకున్న మహమ్మద్ ఇక్బాల్… ఈ ఇద్దరి మధ్య సమన్వయం లేదు. ఇరువురూ కూడా కోట్లాడుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది.
పోటా పోటీ సమావేశాలతో….
నాకు దక్కాల్సిన టికెట్‌ను నువ్వు కొట్టేశావంటూ.. ఇక్బాల్‌పై నవీన్ మండిపడుతున్నారు. దీంతో పార్టీలో చీలిక వచ్చింది. పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఇక్బాల్‌కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపైనా నవీన్ మండిపడుతున్నారు. ఇన్నాళ్లు పార్టీని పాపాయిగా పెంచిన తనకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. అయితే, నువ్వు అసమర్ధుడువి కాబట్టే జగన్ నాకు అవకాశం ఇచ్చారంటూ ఇక్బాల్ ప్రతి దాడి మొదలు పెట్టారు. దీంతో ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఇద్దరు నాయకులు పోటా పోటీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ అనుచరులతో బలాబలా ప్రదర్శనకు దిగారు. నవీన్‌నిశ్చల్‌తో పాటు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
కరోనా వైరస్ అంటూ…..
ఈ సమావేశంలో నవీన్ మాట్లాడుతూ 2019లో వైసీపీ హిందూపురం అసెంబ్లీ టికెట్‌ను 'గజిని'కి ఇచ్చారని, అయినా పార్టీ కోసం కష్టపడి పనిచేశామన్నారు. సొంత పార్టీ నాయకులు, నిజమైన వైసీపీ కార్యకర్తలపైనే ఎమ్మెల్సీ దాడి చేస్తూ హిందూపురం వైసీపీకి పట్టిన కరోనా వైరస్ అని, ఇది ఉంటే పార్టీని, మనల్ని నాశనం చేస్తుందని విమర్శించారు. నేను ముందడుగు వేస్తే వారి అంతం చూసే వరకు ఆగనన్నారు. బోడి గుండు కొట్టించి వలసదారుడిని సాగనంపుదామన్నారు. మనమంతా ఐక్యంగా పోరాటం చేసి హిందూపురం వైసీపీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఇక్బాల్ కూడా ప్రతిగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నవీన్‌నిశ్చల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నవీన్ అసమర్థుడు కాబట్టే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనను హిందూపురానికి పంపారన్నారు. గత ఎన్నికల్లో నవీన్‌నిశ్చల్ ద్రోహం చేయడం వల్లే ఓటమి చెందానన్నారు.
సస్పెండ్ చేయాలంటూ…
ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నవీన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని, పార్టీకి ద్రోహం చేసే వారిని సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని గట్టిగా కోరతానన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు ఇద్దరు నాయకులు చెరోవైపు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో ఎమ్మెల్యే బాలయ్య పై అసంతృప్తి ఉందని, దీనిని తమకు అనుకూలంగా చేసుకునేందుకు నాయకులు ముందుకు రాకపోగా, పార్టీని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈపరిణామాలు వైసీపీని రోడ్డున పడేశాయి. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ?చూడాలి.