జమ్మలమడుగులో జరిగేది అదేనా?

జమ్మలమడుగులో ఏం జరగబోతుంది? పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీలోని రెండు వర్గాలతో పాటు బీజేపీ కూడా ఇక్కడ పోటీ చేయనుంది. జమ్మలమడుగు అధికార పార్టీ వైసీపీ లో [more]

Update: 2021-02-06 12:30 GMT

జమ్మలమడుగులో ఏం జరగబోతుంది? పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీలోని రెండు వర్గాలతో పాటు బీజేపీ కూడా ఇక్కడ పోటీ చేయనుంది. జమ్మలమడుగు అధికార పార్టీ వైసీపీ లో వర్గ విభేదాలు గత కొంతకాలంగా తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఉప్పు నిప్పు గా ఉంది. ఇక్కడ పంచాయతీలన్నీ ఏకగ్రీవం చేయాలని వైసీపీ అధినేత జగన్ చెప్పినట్లు తెలిసింది. ఏకగ్రీవాలపైనే దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించడంతో ఈ ఇరువురు నేతలు ఏ మేరకు ఆ దిశగా ప్రయత్నిస్తారన్న చర్చ జరుగుతోంది.

రెండు వర్గాలూ…..

జమ్మలమడుగులో ఇప్పుడు టీడీపీ లేదు. అక్కడ టీడీపీకి నేత లేకుండా పోయారు. రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఇక్కడ టీడీపీ తరుపున నామినేషన్ వేసేవారు కూడా లేరు. కేవలం వ్యక్తుల ప్రభావంతోనే ఇక్కడ నామినేషన్ లు వేస్తారు. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి తమ వర్గానికి చెందిన వారికే పదవులు దక్కాలని భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కష్టమని భావించిన ఈ ఇద్దరు నేతలు తమ వ్యూహాలకు పదును పెట్టినట్లు తెలిసింది.

ఆది బీజేపీలో చేరి…..

మరోవైపు ఆదినారాయణరెడ్డి బీజేపీ వైపు నుంచి నామినేషన్లు వేయించేందుకు రెడీ అవుతున్నారు. ఆదినారాయణరెడ్డి బీజేపీ లో చేరడంతో ఆయన వర్గం నేతలు ఇప్పుడు పోటీకి సై అంటున్నారు. అందువల్ల జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏకగ్రీవాలు ఎక్కువగా అయ్యే అవకాశాలు లేవంటున్నారు. టీడీపీ నుంచి కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కడ నామినేషన్లను వేసేందుకు అభ్యర్థులను వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

సయోధ్య కుదురుతుందా?

రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలను ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, గుర్తు లేకుండా జరుగుతుండటంతో తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. దీంతో జమ్మలమడుగు వ్యవహారం అధికార వైసీపీ కి తలనొప్పి గా మారింది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు జమ్మలమడుగులో మరోసారి నిప్పును రాజేశాయనే చెప్పాలి.

Tags:    

Similar News