అంతా ఆయనేనట… ఇంక ఈయనెందుకంట?

క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజ‌యం సాధించింది. వాస్తవానికి 2014లోనూ ఎస్వీ మోహ‌న్‌రెడ్డి ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత ఆయ‌న [more]

Update: 2020-03-27 03:30 GMT

క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజ‌యం సాధించింది. వాస్తవానికి 2014లోనూ ఎస్వీ మోహ‌న్‌రెడ్డి ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత ఆయ‌న త‌న బావ దివంగ‌త నేత భూమా నాగిరెడ్డితో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడ గత ఏడాది మ‌హ్మద్‌ హ‌ఫీజ్ ఖాన్‌కు జ‌గ‌న్ ప‌గ్గాలు అప్పగించారు. ఆ ఎన్నిక‌ల్లో హ‌ఫీజ్ ఖాన్ టీడీపీ అభ్యర్థి టీజీ.భ‌ర‌త్‌పై విజ‌యం సాధించారు. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ ఎస్వీ త‌న పాత‌పార్టీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకైతే తీసుకున్నా ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో ఖాన్ విజ‌యం సాధించారు. అయితే తాను ఎమ్మెల్యే కాక‌పోయినా కూడా ఎస్వీ ఎమ్మెల్యేను మించి ఇక్కడ చ‌క్రం తిప్పుతున్నారు.

పేరుకే ఎమ్మెల్యేనా?

అన్నీ తానై వ్యవ‌హ‌రిస్తున్నారు ఎస్వీ మోహన్ రెడ్డి. దీంతో హఫీజ్ ఖాన్ పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఏప‌ని జ‌ర‌గాల‌న్నా కూడా ఎస్వీ మోహన్ రెడ్డి ఆమోదం పొందాల్సి వ‌స్తోంద‌ట‌. దీంతో ఖాన్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయిన త‌న ప్రాధాన్యం త‌గ్గిపోవ‌డంపై ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక పెన్షన్, రేషన్ కార్డు ఇప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింద‌ని ఆయ‌న వాపోతున్నారు. ఇక‌, ఇప్పుడు క‌ర్నూలు కార్పొరేష‌న్ ఎన్నికలు కూడా ఖాన్‌కు ప‌రీక్షగా మారాయి. నేను గెలిస్తే మిమల్ని అన్ని విధాలా ఆదుకుంటా అని కింది స్థాయి నేతలకు హామీలు ఇచ్చిన హఫీజ్ ఖాన్ కి షాక్ తగిలింది.

ఎస్వీ వర్గానికే….

ఈ విషయంపై హ‌ఫీజ్ ఖాన్ అధిష్టానం వ‌ద్ద చాలా సార్లు పంచాయ‌తీ పెట్టినా ఆయ‌న్ను ప‌ట్టించుకున్న నాథుడే లేడు. ఇక జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పి.అనిల్ కుమార్ యాద‌వ్ సైతం ఈ విష‌యంలో చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి. తాను పంపిన లిస్ట్ లో చాలా పేర్లు మారిపోయి అత్యధిక సీట్లు ఎస్వీ మోహన్ రెడ్డి వర్గానికి దక్కడం, బీ ఫారం లు కూడా ఆయనే ఇవ్వడంతో హఫీజ్ ఖాన్ కి నియోజికవర్గంలో మొహం చెల్లడం లేదు. దీంతో మైనార్టీ వర్గాల్లో భవిష్యత్తు పార్టీ నాయకుడు అనుకున్న హఫీజ్ ఖాన్ చాప్టర్ కి త్వరలోనే ఎండ్ కార్డు పడటంతో మైనార్టీ కార్యక‌ర్తలు, ఆయ‌న్ను న‌మ్ముకున్న వైసీపీ కేడ‌ర్ తీవ్ర గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది.

పట్టు నిలుపుకునేందుకు….

ఇక నందికొట్కూరు త‌ర‌హాలోనే రేపో మాపో నియోజికవర్గం పగ్గాలు పూర్తి స్థాయిలో ఎస్వీకి దక్కినా ఆశ్చర్యపోన‌క్కర్లేద‌న్న సందేహాలు కూడా వ్యక్త‌మ‌వుతున్నాయి. నిజానికి ఈ వివాదం మూడు నాలుగు నెల‌ల నుంచి తీవ్రస్థాయిలో ఉంది. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి త‌న‌ప‌ట్టును నిలుపుకొనేందుకు, జ‌గ‌న్ దృష్టిలో మంచి మార్కులు వేయించుకునేందుకు చేస్తున్న ప్రయ‌త్నాల‌తో ఖాన్ మ‌రింత‌గా డీలా ప‌డుతున్నారు. ఈ క్రమంలో ఏం జ‌రుగుతుందో? మైనారిటీ ఓట్లు ఎటు ప‌డ‌తాయో ? చూడాలి.

Tags:    

Similar News