మండ‌పేట వైసీపీలో మంట‌లు… కారణమదేనట

తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉందా? కీల‌క‌మైన నాయ‌కుల‌కు మధ్య చోటు చేసుకున్న విభేదాలు క్షేత్ర స్థాయిలోనూ పార్టీని బ‌ల‌హీన ప‌రుస్తున్నాయా? అంటే.. తాజాగా [more]

Update: 2020-03-21 14:30 GMT

తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉందా? కీల‌క‌మైన నాయ‌కుల‌కు మధ్య చోటు చేసుకున్న విభేదాలు క్షేత్ర స్థాయిలోనూ పార్టీని బ‌ల‌హీన ప‌రుస్తున్నాయా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు గ‌మ‌నించిన వారు ఔననే అంటున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించింది. 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో 14 నియోజ‌క‌వ‌ర్గాలు కైవ‌సం చేసుకుంది. మూడు ఎంపీ స్థానాల‌ను కూడా త‌న బుట్టలో వేసుకుంది. అదే స‌మ‌యంలో టీడీపీని మ‌రింత‌గా దెబ్బకొట్టే క్రమంలో ఆ పార్టీ నుంచి సీనియ‌ర్లను కూడా వైసీపీలో చేర్చుకున్నారు. దీంతో పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని అనుకున్నారు. అయితే, అంత‌ర్గత కుమ్ములాట‌ల కార‌ణంగా పార్టీ ఇప్పుడు వీధిన ప‌డుతోంది.

ఎవరు కారణం?

మ‌రీ ముఖ్యంగా మండ‌పేట వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో తీవ్ర విభేదాలు సాగుతున్నాయి. ఇక్కడ స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌ల‌ప‌డింది. నిజానికి వైసీపీ బ‌లం ఎక్కువ‌గా ఉన్నప్పటికీ టీడీపీ బ‌ల‌ప‌డ‌డం, రెండు ఎంపీటీసీ స్థానాల‌ను ఏక‌గ్రీవంగా సైకిల్ ఎక్కించుకోవ‌డం వంటి ప‌రిణామాలు వైసీపీలో చ‌ర్చనీయాంశంగా మారాయి. దీనికి నువ్వే కార‌ణం.. అంటే కాదు నువ్వే కార‌ణం అంటూ నేత‌లు రోడ్డెక్కారు. ఈ ర‌గ‌డ సాక్షాత్తూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డంతోనే పార్టీలో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. మండ‌పేట వైసీపీ స‌మావేశం తాజాగా జ‌రిగింది. దీనికి మంత్రి పిల్లి బోస్ స‌హా అమ‌లాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వయక‌ర్త తోట త్రిమూర్తులు హాజ‌ర‌య్యారు.

టీడీపీ ఏకగ్రీవంతో….

అయితే, ఈ స‌భ‌లో.. రెండు ఎంపీటీసీ స్థానాలు టీడీపీ ఏక‌గ్రీవం చేసుకున్న విష‌యం ప్రస్థావ‌న‌కు వ‌చ్చింది. దీంతో వైసీపీకి చెంది న ఇద్ద‌రు నాయ‌కుల‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పట్టణానికి చెందిన వేగుళ్ల పట్టాభిరామయ్య, అర్తమూరుకు చెందిన పాపారా యుడులు.. ప‌ర‌స్పరం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకున్నారు. వేగుళ్ల కార‌ణంగా రెండు ఎంపీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయ‌ని పాపారాయుడు చేసిన విమ‌ర్శ దుమారం రేపింది. అయితే, దీనికి ప్రతిగా వేగుళ్ల కూడా తీవ్ర స్వరంతో రెచ్చిపోయారు. మండ‌పేట రూరల్‌లో పాపారాయుడు వల్ల పార్టీ నాశనం అవుతోంద‌ని విమ‌ర్శించారు. ఇదిలావుంటే, వైసీపీ సీట్లను టీడీపీ కౌన్సిలర్‌లకు ఇచ్చారని మ‌రో నాయ‌కుడు న‌ల్లమిల్లి వీర్రెడ్డి చేసిన ఆరోపణ ఒక్కసారిగా క‌ల‌క‌లం రేపింది.

త్రిమూర్తులను పంపినా?

దీంతో స‌భ మొత్తం ఆరోప‌ణ‌లు, ప్రత్యారోప‌ణ‌ల‌తో నిండిపోయింది. చివరకు త్రిమూర్తులు కల్పించుకుని వారిద్దరికి సర్దిచెప్పారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన సభలో వివాదం చోటు చేసుకోవటంపై వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ఇక ఇప్పటి వ‌ర‌కు ఇక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యస‌భ‌కు ఎంపిక కావ‌డంతో ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వికి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఇక్కడ ఇన్చార్జ్ ప‌ద‌విని సైతం తోట త్రిమూర్తుల‌కు ఇచ్చారు. అయితే త్రిమూర్తుల‌కు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన రామచంద్రాపురంలో ఖాళీ లేక‌పోవ‌డంతో ఇక్కడ‌కు పంపారని… ఆయ‌న స్థానిక ఎన్నిక‌ల వ‌ర‌కే ఉంటార‌ని కొంద‌రు చెపుతుంటే.. త్రిమూర్తులు వ‌ర్గం మాత్రం కాదు కాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇక్కడ పోటీ చేస్తార‌ని చెపుతోంది. ఏదేమైనా మండ‌పేట వైసీపీ రాజ‌కీయం ముదిరి పాకాన ప‌డుతోంది.

Tags:    

Similar News