వైసీపీలో వైషమ్యాలు కంటిన్యూ… రాజుకున్న రాజ‌కీయం..?

రాజ‌కీయాల్లో సామాజిక వ‌ర్గాల పాత్ర కీల‌కం. నాయ‌కులుగా ఎదిగేందుకు, నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాల్లో చ‌క్రం తిప్పేందుకు కూడా సామాజిక వ‌ర్గాల బ‌లం, బ‌ల‌హీన‌త‌లు ఎంతో ప్రాధాన్యం వ‌హిస్తాయి. అయితే, [more]

Update: 2020-05-04 00:30 GMT

రాజ‌కీయాల్లో సామాజిక వ‌ర్గాల పాత్ర కీల‌కం. నాయ‌కులుగా ఎదిగేందుకు, నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాల్లో చ‌క్రం తిప్పేందుకు కూడా సామాజిక వ‌ర్గాల బ‌లం, బ‌ల‌హీన‌త‌లు ఎంతో ప్రాధాన్యం వ‌హిస్తాయి. అయితే, ఈ సామాజిక వ‌ర్గ పోరు చొన్ని చోట్ల ప్రత్యర్థుల మ‌ధ్య పీక్ స్టేజ్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిస్థితి ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీల ప్రభావం క‌న్నా కూడా వ్యక్తుల‌, సామాజిక వ‌ర్గాల ప్రభావం ఎక్కువ‌గా ఉంది. గ‌తంలో ఇక్కడ చ‌క్రం తిప్పిన పిల్లి సుభాష చంద్రబోస్‌కానీ, తోట త్రిమూర్తులు కానీ.. సామాజిక వ‌ర్గాల కోణంలో చేసుకున్న రాజ‌కీయాలు ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

సామాజిక ప్రభావం….

శెట్టిబ‌లిజ వ‌ర్గం, కాపు వ‌ర్గం రెండూ కూడా ఇక్కడి రాజ‌కీయాల్లో గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా క‌త్తులు దూసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆ మాట‌కు వ‌స్తే ఈ జిల్లాలోనే ఈ రెండు వ‌ర్గాల రాజ‌కీయం ఎప్పుడూ ర‌గులుతూనే ఉంటుంది. తోట త్రిమూర్తులు కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు, బోస్ శెట్టి బ‌లిజ వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండ‌డం, వేర్వేరు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కావ‌డంతో ఇద్దరి మ‌ధ్యా కూడా ఇటు రాజ‌కీయాల్లో పార్టీలు, సామాజిక వ‌ర్గాల ప్రభావం ఎక్కువ‌గా ఉండేది. అయితే, ఇప్పుడు తోట త్రిమూర్తులు.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత వైసీపీ గూటికి చేరిపోయారు.

రెండు వర్గాలుగా….

అంటే.. రామ‌చంద్రపురంలో గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణకు, కాపు వ‌ర్గానికి చెందిన తోట త్రిమూర్తులుకు రాజ‌కీయ ఆధిప‌త్యం స్టార్ట్ అయ్యింది. నిజానికి ఇప్పుడు శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన‌వారు, కాపు వ‌ర్గానికి చెందిన‌వారు కూడా వైసీపీలోనే ఉన్నప్పటికీ.. వారి మ‌ధ్య వైష‌మ్యాలు మాత్రం కొన‌సాగుతున్నాయి. గ‌తంలో శెట్టిబలిజ వ‌ర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బోస్ వ‌ర్సెస్ కాపు వ‌ర్గానికి చెందిన త్రిమూర్తులు మ‌ధ్య జ‌రిగిన వార్ ఇప్పుడు మ‌ళ్లీ వేణు వ‌ర్సెస్ త్రిమూర్తులు వార్‌గా మారింది. నాయ‌కులు మారినా.. పార్టీలు ఒక్క‌టైనా.. వేర్వేరు అయినా ఈ రెండు వ‌ర్గాల వైరం మాత్రం స‌మ‌సిపోవ‌డం లేదు.

తోటపై దాడి చేయడంతో…

ఇటీవ‌ల చెల్లుబోయిన అనుచ‌రుడు మేడిశెట్టి ఇజ్రాయెల్.. ఉదంతం నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత ఉద్రిక్తత‌కు దారితీసింది. తోట త్రిమూర్తులు వైసీపీలోకి వ‌చ్చాక ఆయ‌నకు అమ‌లాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బాధ్యత‌లు అప్పగించారు. ఈ క్రమంలో త‌న స‌త్తా నిరూపించుకునేందుకు ఆయ‌న పార్టీలో కీల‌క నేత‌ల‌ను ఇక్కడ‌కు ఆహ్వానించి వారితో కొన్ని కార్యక్రమాలు చేయించారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ నాయ‌కుడు టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రామ‌చంద్రాపురం వ‌చ్చారు. ఈ ప‌ర్యట‌న‌లో ఎమ్మెల్యే చెల్లుబోయిన అనుచ‌రుడు ఇజ్రాయేల్ త్రిమూర్తులుపై చెప్పుతో దాడికి య‌త్నించాడు. కావాల‌నే తోట‌పై చెప్పుతో కూడా దాడి చేశార‌ని తోట వ‌ర్గం ఆరోపించింది.

ఎమ్మెల్యే పరామర్శతో……

అయితే, గ‌తంలో తోట త్రిమూర్తులు ఎస్సీ వ‌ర్గానికి చెందిన‌ ఓ వ్యక్తికి శిరోముండ‌నం చేయించార‌న్న టాక్‌ కూడా ఇక్కడ ఆయ‌న్ను వెంటాడుతూ వ‌స్తోంది. ఈ దాడితో దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెరిగింది. వేణు అండ్ అనుచ‌రులు కావాల‌నే త‌మ నేత‌పై దాడి చేయించార‌ని అప్పట్లో తోట అనుచ‌రులు వీరంగం సృష్టించారు. ఇది అక్కడితో ముగిసినా.. తాజాగా మేడిశెట్టిపై ఈ రోజు.. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆసుప‌త్రిలో ఉన్న మేడిశెట్టిని ఎమ్మెల్యే చెల్లుబోయిన ప‌రామ‌ర్శించారు.

మూడు వర్గాలుగా…

దీని వెనుక ఎవ‌రున్నారో త‌న‌కు తెలుసున‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. దీనిని బ‌ట్టి రామ‌చంద్రాపురం వైసీపీలో నేత‌ల మ‌ధ్య ఇంకా సామాజిక వ‌ర్గాల క‌ల‌హం కొన‌సాగుతోంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎక్కడిదాకా వెళ్తుందో ? చూడాలి. ఈ రెండు కీల‌క నేత‌ల మ‌ధ్య వార్ ఇలా ఉంటే ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మంత్రి బోస్ ఏం చేస్తారో ? చూడాలి. ఏదేమైనా త్రిమూర్తులు ఎంట్రీతో రామ‌చంద్రాపురం వైసీపీ మూడు ముక్కలాట‌గా మార‌డంతో పాటు ఉద్రిక్తంగాను మారింది.

Tags:    

Similar News