వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ గెలవడం కష్టమేనట

గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాకు స‌రిహ‌ద్దుగా, కృష్ణా న‌ది – స‌ముద్రం ఒడ్డున విస్తరించిన నియోజ‌క‌వ‌ర్గం రేప‌ల్లె. రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న రేప‌ల్లెలో మ‌త్స్యకార వ‌ర్గం [more]

Update: 2021-05-25 02:00 GMT

గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాకు స‌రిహ‌ద్దుగా, కృష్ణా న‌ది – స‌ముద్రం ఒడ్డున విస్తరించిన నియోజ‌క‌వ‌ర్గం రేప‌ల్లె. రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న రేప‌ల్లెలో మ‌త్స్యకార వ‌ర్గం హ‌వా ఎక్కువ‌. అలాంటి రేప‌ల్లో వైసీపీకి మాత్రం చ‌క్కన‌మ్మ చిక్కనిది అన్నట్టుగా ఉంది. ఇప్పటి వ‌ర‌కు జిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగిరినా రేప‌ల్లెలో మాత్రం ఆ పార్టీకి విజ‌యం అంద‌ని ద్రాక్షలాగానే ఉంటోంది. విచిత్రం ఏంటంటే ఇది ఆ పార్టీ కీల‌క నేత‌, మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యస‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ నియోజ‌క‌వ‌ర్గం. ఆయ‌న ఇక్కడ రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. టీడీపీకి ఒక‌ర‌కంగా కంచుకోట‌గా ఉన్న ఈనియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఇప్పటి వ‌ర‌కు ఐదు సార్లు విజ‌యం ద‌క్కించుకుంది. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా పార్టీ విజ‌యం సాధించింది. అన‌గాని స‌త్యప్రసాద్‌.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఆయన కనుసన్నల్లోనే…?

ఇక‌, 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రెండుసార్లు పోటీ చేసినా.. ప‌రాజ‌యం పాల‌య్యారు. 2014 ఎన్నిక‌ల్లో మోపిదేవికి 71,721 ఓట్లు ల‌భించ‌గా.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో 78,420 ఓట్లు వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి గ‌త రెండు ఎన్నిక‌ల్లో కొంత మేర‌కు వైసీపీ ఓటు బ్యాంకు పుంజుకున్నా.. విజ‌యం అయితే.. ద‌క్కించుకోలేక‌పోయింది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మోపిదేవికి ఛాన్స్ ఉండేలా క‌నిపించ‌డం లేదు. ప్రస్తుతం ఆయ‌న రాజ్యస‌భ‌కు వెళ్లిపోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆయ‌న ఇక్కడ పోటీ చేసే ప‌రిస్థితిలేదు. పేరుకు మాత్రమే ఆయ‌న రేప‌ల్లో ఇన్‌చార్జ్‌గా ఉన్నా అక్కడ వ్యవ‌హారాలు అన్ని మోపిదేవి సోద‌రుడే చ‌క్క పెడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌ర‌గాల‌న్నా కూడా మోపిదేవి హ‌ర‌నాథ్ బాబు క‌నుస‌న్నల్లోనే జ‌రుగుతోంద‌ట‌.

మోపిదేవి కూడా ఫిక్స్ అయ్యారట…

మోపిదేవి కూడా ఎంపీగా ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ త‌న‌కు పోటీ చేసే ఉద్దేశం లేద‌నే విష‌యాన్ని సైతం ఇప్పటికే వైసీపీ హైకమాండ్ కు చెప్పేశార‌ని టాక్ ? అన‌గాని స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో ఆయ‌న్ను ఢీ కొట్టే సామ‌ర్థ్యం మోపిదేవి సోద‌రుడికి ఉందా ? అంటే సందేహ‌లే ఉన్నాయి. దీంతో కొత్తనేత‌కు అవ‌కాశం క‌ల్పించాల‌న్న చర్చలు అయితే అధిష్టానంలో స్టార్ట్ అయ్యాయి. ప్రతిప‌క్ష పార్టీ నేత‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ఇప్పటి నుంచే ఓ క‌న్నేస్తూ వ‌స్తున్నారు. ఈ క్రమంలోనే రేప‌ల్లెలో బీసీ వ‌ర్గంలో బ‌ల‌మైన నేత కోసం వెయిట్ చేస్తున్నారు.

అదే మైనస్…..

బీసీ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ముఖ్యంగా మ‌త్స్యకారులు ఎప్పటి నుంచో కోరుతున్న డిమాండ్లు అపరిష్కృ తంగా ఉన్నాయి. మోపిదేవి ఆ వ‌ర్గం నుంచే గ‌తంలో వ‌రుస‌గా గెలిచి గ‌తంలోనూ… మొన్నటి వ‌ర‌కు మంత్రిగా ఉన్నా అవేవి ప‌రిష్కారం కాలేదు. ఇవే ఇప్పుడు మోపిదేవికి మైన‌స్ అయ్యాయి. పార్టీ పుంజుకునేందుకు, టీడీపీలోపాల‌ను త‌మ‌వైపు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ఇక్కడ ఎలాంటి ప్రయ‌త్నమూ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మోపిదేవి ప్రత్యక్ష రాజ‌కీయాల ప్రస్థానం ముగియ‌డం.. వైసీపీ నేత‌ల మితిమీరిన పెత్తనాలు ఇక్క‌డ పార్టీని దెబ్బేస్తున్నాయి.వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ప‌రిస్థితి ఇలానే ఉంటే.. రేప‌ల్లెలో గెలుపు వైసీపీకి మ‌రోసారి అంద‌ని ద్రాక్షే..?

Tags:    

Similar News