వైసీపీలో వ‌ర్గ పోరు.. మొత్తానికే ఎస‌రు తెస్తున్న నేత‌లు

అష్టక‌ష్టాలు ప‌డి టీడీపీకి ప‌ట్టున్న శ్రీకాకుళంలో వైసీపీ గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున పుంజుకుంది. కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం టీడీపీని ఓడించింది. అయితే, ఇప్పుడు ఆ [more]

Update: 2020-03-16 14:30 GMT

అష్టక‌ష్టాలు ప‌డి టీడీపీకి ప‌ట్టున్న శ్రీకాకుళంలో వైసీపీ గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున పుంజుకుంది. కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం టీడీపీని ఓడించింది. అయితే, ఇప్పుడు ఆ ప‌రిస్థితి మూడునాళ్ల ముచ్చటగానే మారిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని ప‌ది మాసాలు కూడా గ‌డ‌వక ముందుగానే ఇక్కడ పార్టీలో వ‌ర్గ పోరు తార‌స్థాయికి చేరిపోయింది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైసీపీలో అసంతృప్త జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి. జిల్లా మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ ఒక వ‌ర్గంగా, ఆయ‌న త‌మ్ముడు ధ‌ర్మాన ప్రసాద‌రావుది ప్రత్యేక‌వ‌ర్గంగా, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఒక‌వ‌ర్గంగా, బొత్స బంధువులు మ‌రోవ‌ర్గంగా మారి ఆధిప‌త్య రాజ‌కీయాలు చేస్తున్నారు.

వర్గాలుగా విడిపోయి….

ఇదిలావుంటే పాల‌వ‌ల‌స కుటుంబం మ‌ద్దతుతో గెలిచిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి ఒక‌వ‌ర్గంగా కొన‌సాగుతున్నారు. ప‌లాస ఎమ్మెల్యే సీదిరి అప్పల‌రాజు తాను సీఎం జ‌గ‌న్ వ‌ర్గంగా ప్రచారం చేసుకుంటూ త‌న‌దైన శైలిలో గ్రూపు రాజ‌కీయాలు న‌డుపుతున్నారు. దీంతోపాటు టెక్కలిలో పేరాడ తిల‌క్‌, కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీను వ‌ర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. జిల్లాలో వైసీపీ గ్రూపులు తారాస్థాయిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం టెక్కలియే. ఇక్కడ ఏకంగా మూడు వ‌ర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయిన పిరియా సాయిరాజు, సీనియ‌ర్ నేత న‌ర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే లుల్లూ (న‌రేష్‌కుమార్ అగ‌ర్వాల్‌) వ‌ర్గాలుగా విడిపోయి త‌మ‌వారికే టికెట్లు ఇప్పించుకునేందుకు పోటీప‌డుతున్నారు.

పోటీ తీవ్రమై…

ఇచ్చాఫురం మున్సిపాలిటీలో 23 వార్డులుండ‌గా చైర్మన్ బీసీ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ అయ్యింది. దీంతో మాజీ మున్సిప‌ల్ చైర్‌ప‌ర్సన్లుగా ప‌నిచేసిన వైసీపీ నేత‌లు రాజ్యల‌క్ష్మి, లాభ‌ల స్వర్ణమ‌ణి, కాళ్ల శకుంత‌ల‌లు ఒక్కో నాయ‌కుడిని ఆశ్రయించి రేసులోకొచ్చారు. ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో అంతా తానేన‌న్నట్టు వ్యవ‌హ‌రిస్తున్న ఎమ్మెల్యే సీదిరి అప్పల‌రాజు వ్యవ‌హార‌శైలితో చాలా మంది నాయ‌కులు మౌనం వ‌హించారు. ప‌లాస మున్సిపాలిటీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో దువ్వాడ శ్రీను సోద‌రుడు దువ్వాడ శ్రీకాంత్ ఒక వ‌ర్గంగా బ‌ల్ల గిరిబాబు మ‌రోవ‌ర్గంగా, ఎమ్మెల్యే ఒక వ‌ర్గంగా పోటీకి కాలు దువ్వుతున్నారు. ప‌లాస మున్సిపాలిటీ బీసీ జ‌న‌ర‌ల్ కావ‌డంతో పోటీ తీవ్రంగా ఉంది.

తమ్మినేని వేలు పెట్టడంతో…

ప‌లాస పీఠం ఎలాగైనా చేజిక్కించుకోవాల‌నే వ్యూహంతో వైసీపీ నేత‌లు ఎవ‌రి ప్రయ‌త్నాల్లో వారే ఉండ‌టంతో మూడు వర్గాల రాజ‌కీయాలు పెరిగిపోయాయి. మ‌రోవైపు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అన్ని నియోజక‌వ‌ర్గాల‌లో వేలు పెడుతున్నార‌ని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పెద్దన్నగా పార్టీలో గ్రూపులు చ‌క్కదిద్దాల్సిన మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ ఎవ‌రిని మంద‌లిస్తే ఎవ‌రు ఫీల‌వుతారోన‌నే మొహమాటం చూపించ‌డంతో వ‌ర్గపోరు ఇంకా తీవ్రమైందని, కృష్ణదాస్ మెత‌క‌వైఖ‌రి వ‌ల్లే పార్టీలో గ్రూపులు కంట్రోల్ కావ‌డంలేద‌ని ఇన్‌చార్జి మంత్రి కొడాలి నాని సీఎం జ‌గ‌న్‌కి నివేదిక‌లు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయ‌త్నిస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని వైసీపీ నాయ‌కులు అనుకుంటున్నారు. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.

Tags:    

Similar News