అందరూ సీనియర్లే… పెద్దలే… వైసీపీకి దిక్కెవరు ?

ఉత్తరాంధ్రాలో మూలన ఉన్న జిల్లా శ్రీకాకుళం. స్వాతంత్రం ముందూ తరువాత కూడా అభివృధ్ధికి ఆమడదూరంగా ఉన్న ఈ జిల్లా విషయంలో అన్ని పార్టీలూ ఒకే తానులో ముక్కలుగానే [more]

Update: 2020-06-08 03:30 GMT

ఉత్తరాంధ్రాలో మూలన ఉన్న జిల్లా శ్రీకాకుళం. స్వాతంత్రం ముందూ తరువాత కూడా అభివృధ్ధికి ఆమడదూరంగా ఉన్న ఈ జిల్లా విషయంలో అన్ని పార్టీలూ ఒకే తానులో ముక్కలుగానే వ్యవహరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి పది సీట్లకు గానూ ఎనిమిది దక్కాయి. దాంతో వైసీపీ తొలిసారిగా పసుపు కోటలో పాగా వేసింది. ఏడాది పాలన పూర్తి అవుతున్నా జిల్లాలో వైసీపీ పట్టు సాధించలేకపోతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు అంటే కేవలం సంక్షేమమే. కానీ అభివ్రుధ్ధి విషయంలో ఒక్క అడుగు ముందుకు కదలలేదు. ఇక వైసీపీకి జిల్లాలో పెద్ద దిక్కు ఎవరు అన్నది చిక్కుముడిగా ఉంది. ఎందుకంటే అందరూ పెద్దలే. అందరూ సీనియర్లే.

బ్రదర్స్ కి పడదా…?

జిల్లాలో ధర్మాన క్రిష్ణదాస్ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో ధర్మాన ప్రసాదరావు చక్రం తిప్పేవారు. ఇపుడు అన్నగారికి మంత్రి పదవి రావడం తమ్ముడు గారికి కంటగింపుగా ఉందని అంటున్నారు. కనీసం ఏడాది కాలంలో పార్టీని పటిష్టం చేయడం మాట పక్కన పెట్టి ప్రసాదరావు అలకపానుపు మీదనే గడిపేశారు. పార్టీఎ\ని పూర్తిగా గాలికి వదిలేశారు. మరో వైపు క్రిష్ణదాస్ కి అనుభవం లేకపోవడంతో ఆయన వైసీపీని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. పైగా ఆయనకు ఇతర నాయకుల సహకారం కూడా అంతంతమాత్రంగా ఉంది.

స్పీకరే ఆయన….

సాధారణంగా స్పీకర్ అంటే మాట్లాడరు, సైలెంట్ గా ఉంటారు. కానీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం మాటల దూకుడుతో తనదైన రాజకీయ క‌ధ నడిపిస్తున్నారు. ఆయనే అధికారులను పిలిచి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఒక మంత్రిగా ఫీల్ అయి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో మరో మంత్రి క్రిష్ణదాస్ నొచ్చుకుంటున్నారు. ఇలా ఇద్దరి మధ్యన గ్యాప్ ఏర్పడడంతో అధికారులు సైతం ఎవరి మాట వినాలో, వినకూడదో అర్ధం కాక సతమతం అవుతున్నారు.

కిల్లి మౌనమే…?

ఆమె కాంగ్రెస్ లో ఉన్నపుడు ఒక స్థాయిలో హవా చాటుకున్నారు. పైగా డాక్టర్ గా పేరు మోసిన మనిషి. ఒకసారి ఎంపీగా గెలిచిన్ కేంద్రంలో కీలకమైన కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా పనిచేసి సోనియా చేత శభాష్ అనిపించుకున్నారు. అటువంటి కిల్లి వైసీపీలోకి వచ్చి మౌనమే నా భాష అంటున్నారు. ఆమెను జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా చేశారు. కానీ ఆమె మాట ఒక్క నాయకుడు, మంత్రి వినిపించుకోరు. కాంగ్రెస్ లో ఉన్నపుడే ధర్మానకు, కిల్లికి గొడవలు ఉన్నాయి. ఆమెని వైసీపీలోకి రాకుండా కూడా ఎత్తులు వేశారు. కానీ జగన్ ఆమెని పిలిచి మరీ పార్టీలోకి చేర్చుకున్నారు. ఇక ఆమె ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే ముందు పార్టీని గెలిపించమని జగన్ ఆదేశించారు. ఆమె టెక్కలి సీటు గెలిపించలేకపోయింది. అదొక మైనస్ గా ఉంది. దానికి తోడు జిల్లాలో వైసీపీ పడకేసింది. ఈ పరిణామాల నేపధ్యంలో కిల్లి పేరుకు పార్టీ ప్రెసిడెంట్ అన్నట్లుగా ఉంటున్నారు. మరో వైపు శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్ తన మాటే పార్టీకి వేదం అన్నట్లుగా దూకుడు చేస్తున్నారు. ఇలా వైసీపీకి ఎంతో మంది నాయకులు. అందరూ పెద్దలే కావడంతో పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.

Tags:    

Similar News