తిరుపతిలో ఆ మూడింట వైసీపీకి డౌట్ కొడుతుందా ?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు అన్ని పార్టీల కంటే కూడా వైసీపీకి ఇజ్జత్ మే సవాల్ గా పరిణమించాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది జగన్. 151 [more]

Update: 2020-12-27 12:30 GMT

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు అన్ని పార్టీల కంటే కూడా వైసీపీకి ఇజ్జత్ మే సవాల్ గా పరిణమించాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది జగన్. 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ముప్పయ్యేళ్ళ సీఎం గా బిగ్ సౌండ్ చేస్తున్న పొలిటికల్ సీన్ ఏపీలో ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి నిండా రెండేళ్ళు కాకముందే వైసీపీ ప్రభ వెలవెలపోతే అది డేంజర్ సిగ్నల్సే మరి. అందుకే ఏ పార్టీకి లేని టెన్షన్ ఒక్క వైసీపీలోనే ఉంది అంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ సీటుని రెండు లక్షల 28 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ గెలుచుకుంది. ఏపీలోని మొత్తం పాతిక ఎంపీ సీట్లలో వచ్చిన నాలుగవ అతి పెద్ద మెజారిటీ అది. దాంతో ఈసారి ఆ మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా కూడా వైసీపీకి బిగ్ షాక్ గానే పరిణమిస్తుంది అంటున్నారు.

సంక్షేమ పాలనకు గీటు రాయి…..

జగన్ అధికారంలోకి వచ్చాక ఖజానాను గోకి మరీ దోచి పెడుతున్నారు. ఎక్కడలేని అప్పులు తెచ్చి కూడా అన్ని వర్గాల ప్రజలకు పధకాలను పంచిపెడుతున్నారు. ఒక్క పైసా కూడా పక్కకు పోకుండా లబ్దిదారుల బ్యాంక్ ఎకౌంట్ లోనే డైరెక్ట్ గా నగదు వేస్తున్నారు. అలాగే తొంబై శాతం హామీలను జగన్ పక్కాగా నెరవేర్చారు. ఇంకా ఇవ్వని హామీలను కూడా అమలు
చేసి చూపిస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్న జగన్ పాలన మీద జనం ఏమనుకుంటున్నారు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగించే అంశం. మరి దానికి తిరుప‌తి ఉప ఎన్నిక ఫలితం గీటు రాయిగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే వైసీపీలో అంతా కిందా మీద అవుతున్నారుట.

మూడింట వీక్ ….

ఇక తిరుపతి లోక్ సభ నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ వీక్ గా ఉందని గ్రౌండ్ లెవెల్ వార్తలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఏడింటికి ఏడూ వైసీపీకి జై కొట్టిన పరిస్థితి. అదే ఇపుడు మాత్రం మూడు సీట్లలో వైసీపీ చాలా బలహీనంగా ఉందన్న సమాచారం పార్టీ వర్గాలకు వణుకు పుట్టిస్తోందిట. గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే వరప్రసాద్ మీద జనాలకు తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఆయన 2014 నుంచి 2019 వరకూ తిరుపతి ఎంపీగా పనిచేశారు. కానీ జనం మీద ఆయన ఏ రకమైన ముద్రా వేయలేకపోయారు. ఇపుడు కూడా అంతే అంటున్నారు. అలాగే సుళ్ళూరుపేటలో కిలివేటి సంజీవయ్య వైసీపీ ఎమ్మెల్యే. ఈయన పార్టీ మీద ఆధారపడి గత ఎన్నికల్లో గెలిచారు. ఇపుడు ఆయన మీద పార్టీని గెలిపించే బాధ్యత పెడితే ఇబ్బందేనని అంటున్నారు. పైగా జనాలకు ఈయన కూడా దూరమే అంటున్నారు. మరో సీటు సత్యవేడు. ఇక్కడ కోనేటి ఆదిమూలం వైసీపీ ఎమ్మెల్యే. ఇది కూడా బాగా వీక్ గా ఉన్న సీటు అని అంటున్నారు.

కష్టమేనా…?

ఇక మరో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు చూసుకుంటే తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మెజారిటీ గ్యారంటీ. అలాగే శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూధన్ రెడ్డి కూడా వైసీపీకి మెజారిటీ తెస్తారు. సర్వేపల్లి నుంచి గోవర్ధన్ రెడ్డి కూడా వైసీపీకి బలమైన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వెంకటగిరిలో ఆనం రామ‌నారాయణరెడ్డి కూడా గట్టిగా పనిచేయాల్సిన సీన్ ఉంది. ఆయన కాకపోతే రెండవ శ్రేణీ వైసీపీ నేతలు దూకుడు మీద ఉన్నారు. అందువల్ల నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీకి గట్టి పట్టున్నట్లుగా చెబుతున్నారు. కానీ వీక్ గా ఉన్న ఆ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను పటిష్టం చేసుకోకపోతే గెలుపు ఖాయం కానీ మెజారిటీ దారుణంగా పడిపోతుంది. చూడాలి మరి వైసీపీ ఏ రకమైన స్ట్రాటజీ అమలు చేస్తుందో.

Tags:    

Similar News