అక్కడ గట్టిగానే కొడతారా ?

ఉత్తరాంధ్ర అంటేనే నిన్నటిదాకా టీడీపీకి కంచుకోట. అటువంటి చోట నిలబడి కలబడి జయభేరీ మోగించిన ఘనతను వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే [more]

Update: 2020-03-13 02:00 GMT

ఉత్తరాంధ్ర అంటేనే నిన్నటిదాకా టీడీపీకి కంచుకోట. అటువంటి చోట నిలబడి కలబడి జయభేరీ మోగించిన ఘనతను వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 28, అయిదు ఎంపీ సీట్లతో నాలుగు గెలుచుకుని తిరుగులేని పార్టీగా రికార్డు నమోదు చేసింది. కేవలం తొమ్మిది నెలల్లోనే లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేశాయి. దాంతో ఈసారి కూడా గత మ్యాజిక్ రిపీట్ చేయాలని వైసీపీ ఆరాటపడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ క్లీన్ స్వీప్ చేయాల్సిందేనని వైసీపీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జిగా విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్నీ పర్యవేక్షిస్తున్నారు. అరకొరగా ఉన్న వైరి పక్షం నేతలకు ఈ ఎన్నికలతో పూర్తిగా పట్టు లేకుండా చేయాలని ఆయన క్యాడర్ కి పిలుపు ఇస్తున్నారు.

అచ్చెన్న టార్గెట్…..

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అచ్చెన్నాయుడు టార్గెట్ అని చెబుతున్నారు. పార్టీ నేతల్లో సమన్వయం లేకపోవడం వల్లనే అచ్చెన్న తక్కువ ఓట్లతోనైనా బయటపడిపోయారని, ఈసారి ఆ పరిస్థితి రానివ్వద్దని ఒకటికి పదిసార్లు విజయసాయిరెడ్డి క్యాడర్ కి హితబోధ చేస్తున్నారు. ఇక ఈ జిల్లాకు ఇంచార్జిగా రాజకీయంగా దూకుడు మీదున్న నేత, మంత్రి కొండాలి నానిని నియమించారు. ఆయన ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ సీట్లలో ఎనిమిది వైసీపీ గెలుచుకోవడంతో ఇపుడు అచ్చెన్న సీటు టెక్కలి. మరో సీటు ఇచ్చాపురం మీద వైసీపీ నేతల కన్ను పడింది.

విశాఖ సిటీని కొట్టాలి….

ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే సిటీలో నాలుగు ఎమ్మెల్యే సీట్లూ టీడీపీ ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. దాంతో వాటిని ఈసారి ఎలాగైనా పట్టాలని వైసీపీ వ్యూహకర్తలు పధక రచన చేస్తున్నారు. మేయర్ పీఠాని కైవశం చేసుకోవాలంటే ఎక్కువ వార్డులు గెలవాలి. దాంతో పదునైన వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. బీసీలకు మేయర్ సీటు కేటాయించడం ద్వారా రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టిన వైసీపీ ఇండైరెక్ట్ ఎన్నికల విధానంతో ఆ పార్టీ ఆశలన్నీ నీరుకార్చింది. ఇపుడు సామదాన, భేద దండోపాయాలతో మొత్తం కధను నడుపుతోంది.

అక్కడ విజయమే…..

మరో వైపు తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటుతో మొత్తం క్లీన్ స్వీప్ చేసిన విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీదనే మరోమారు పెద్ద బాధ్యతలు అన్నీ పెట్టారు. ఆయన నాయకత్వంలోనే జెడ్పీ చైర్మన్, మేయర్ సీటు కూడా గెలిపించుకోవాలి. ఇపుడు పార్టీలో కొంత విభేదాలు ఉన్నాఅన్ని వర్గాలు ఒక్కటిగా పనిచేసేలా విజయసాయిరెడ్డి సయోధ్య కుదిర్చారని అంటున్నారు. ఇప్పటికే అక్కడ పూసపాటి రాజా వారు అశోక్ ని మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో నైతికంగా దెబ్బకొట్టిన వైసీపీకి మరో వైపు బొబ్బిలి రాజవారు సుజయక్రిష్ణ రంగారావుని కూడా కట్టడి చేస్తోంది. మొత్తానికి పక్కా ప్లాన్ తోనే ఉత్తరాంధ్రాను జయించేందుకు వైసీపీ బరిలోకి దిగిందని అంటున్నారు.

Tags:    

Similar News