ఆ దెబ్బతో కూసాలు కదిపేయాలనేనా…?

ఎన్నికల జాతర ఇపుడు ఏపీలో సాగుతోంది. పంచాయతీతో కధ మొదలైంది. రెండు నెలల పాటు జరిగే ఈ క్రతువులో మొత్తం ఎన్నికలు జరిగిపోతాయని అంటున్నారు. ఎటూ ప్రభుత్వం [more]

Update: 2021-02-25 14:30 GMT

ఎన్నికల జాతర ఇపుడు ఏపీలో సాగుతోంది. పంచాయతీతో కధ మొదలైంది. రెండు నెలల పాటు జరిగే ఈ క్రతువులో మొత్తం ఎన్నికలు జరిగిపోతాయని అంటున్నారు. ఎటూ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తరువాతనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేస్తారని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే గ్రేటర్ విశాఖలో అపుడే ఎన్నికల సందడి ఆరంభమైంది. కొడితే మేయర్ సీటే కొట్టాలి అంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా సవాళ్ళు చేసుకుంటున్నాయి.

గ్రౌండ్ ప్రిపేర్….

చంద్రబాబుకు విశాఖ మేయర్ సీటు చాలా ముఖ్యం. ఏ ఎన్నిక రిజల్ట్ ఎలా ఉన్నా విశాఖ లో కనుక జెండా పాతితే మాత్రం వైసీపీ కూసాలు కదిలిపోతాయి. విశాఖ పాలనారాజధానిగా జగన్ ప్రకటించారు. దాంతో జనమే అంగీకరించలేదని చెప్పేందుకు ఈ విజయం దన్నుగా ఉంటుందని చంద్రబాబు తలపోస్తున్నారు. ఆయనకు ఈ కీలకమైన సమయంలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం బాగా కలసి వచ్చింది అంటున్నారు. దాంతో ఆయన మేయర్ పీఠం పట్టేందుకు బాగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అని చెబుతున్నారు.

దీక్షా దక్షలతో…

వైసీపీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయిందని అపుడే పెదబాబు చినబాబు వ్యతిరేక ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. మరో వైపు టీడీపీ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ అమరణ దీక్ష కూడా ఉక్కు సెగలను రగల్చేదే. ప్రజలకు నిండా ఉక్కు సెంటిమెంట్ ఉంది. పైగా అధికార పార్టీల మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. కేంద్రం ప్రైవేట్ వేస్తూంటే ఏపీ సర్కార్ ఏం చేస్తోంది అన్న జనాగ్రహం కనుక బయట పడితే గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి డేంజర్ బెల్స్ మోగినట్లే.

బెదురుతున్నారా…?

పంచాయతీలు గెలవడం వేరు, విశాఖ మేయర్ గెలవడం వేరు అన్నది వైసీపీకి బాగా తెలుసు. దాదాపుగా అర కోటి జనాభా కలిగి ఉన్న గ్రేటర్ మేయర్ పీఠం అంటే క్యాబినేట్ మంత్రి ర్యాంక్ కలిగినది. అయిదు వేల కోట్ల వార్షిక బడ్జెట్ తో 98 వార్డులలో జీవీఎంసీ పాలన సాగనుంది. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ సిటీలో వైసీపీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ కొంత బ్యాడ్ గానే ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో నాలుగు ఎమ్మెల్యే సీట్లూ టీడీపీ పరం అయ్యాయి. సిటీలో జనాలను కదిలించే లీడర్ షిప్ ఇప్పటికీ వైసీపీకి లేదు. అదే సమయంలో టీడీపీకి బలమైన నాయ‌కులు ఉన్నారు. దాంతో ఇప్పటి నుంచే గెలుపు కోసం వైసీపీ ప్లాన్ తో రెడీ అవుతోంది. అయితే పులి మీద పుట్రలా ఉక్కు సెగ తగులుతోంది. దాంతో వైసీపీకి ఫీవరే వస్తోందిట.

Tags:    

Similar News