ఆ వైసీపీ నేత లెవెల్ పడిపోయిందా ?
మేయర్ కుర్చీ ఊరిస్తోంది. అది కూడా విశాఖలాంటి అతి పెద్ద నగరం. ఆసియా ఖండంలోనే వేగంగా ఎదుగుతున్న మెగా సిటీ. ఏపీలో నంబర్ వన్ మెట్రో సిటీ. [more]
మేయర్ కుర్చీ ఊరిస్తోంది. అది కూడా విశాఖలాంటి అతి పెద్ద నగరం. ఆసియా ఖండంలోనే వేగంగా ఎదుగుతున్న మెగా సిటీ. ఏపీలో నంబర్ వన్ మెట్రో సిటీ. [more]
మేయర్ కుర్చీ ఊరిస్తోంది. అది కూడా విశాఖలాంటి అతి పెద్ద నగరం. ఆసియా ఖండంలోనే వేగంగా ఎదుగుతున్న మెగా సిటీ. ఏపీలో నంబర్ వన్ మెట్రో సిటీ. ఇంకా చెప్పాలంటే పాలనా రాజధానిగా విశాఖ ఉంటే ముఖ్యమంత్రి మొదలు మంత్రులంతా కొలువైన నగరానికి ప్రధమ పౌరిడిగా ఉండడం కంటే గొప్పదనం ఏముంది. అంతే కాదు, అందరినీ కలిపి తానే పాలిస్తున్నానన్న భావనలో ఉన్న ఆనందం, గర్వం వేరేక్కడైనా దొరుకుతాయా. అందుకే మేయర్ సీటు ఆశ పెడుతోంది. ఎంతలా అంటే కలలోకి కూడా వచ్చేస్తోంది. దాంతో వైసీపీలో సీనియర్ మోస్ట్ నాయకుడు. అర్బన్ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ మేయర్ సీటు మీద గంపెడాశలు పెట్టుకున్నారు. ఆల్రేడీ అధినేత జగన్ హామీ కూడా ఇచ్చేశారు, దాంతో ఎన్నికల కోసం అలా చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు.
ఇండైరెక్ట్ ఎన్నికలు……
మేయర్ అంటే విశాఖలోని పాతిక లక్షల జనాభాకు పాలకుడు. ఓ విధంగా ఎంపీ పదవితో సమానమైన పోస్ట్. కానీ డైరెక్ట్ ఎన్నిక కాదు, ముందు కార్పోరేటర్ గా గెలిచి ఆ తరువాత ఈ పదవికి ఎన్నుకోబడాలి. దాంతో వంశీ 21వ వార్డు వైసీపీ కార్పోరేటర్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇపుడు అంతా ఆయన అక్కడే పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజల బాధలే తన బాధలు అనుకుంటున్నారు. కరోనా వేళ సహాయకార్యక్రమాలను కూడా అక్కడికే పరిమితం చేశారు. వంశీ ఇపుడు వైసీపీ సిటీ నేత కాదు, కేవలం 21వ వార్డు లీడర్ అన్నట్లుగా పరిస్థితి ఉంది.
దర్జా తగ్గిపోలా….?
నిజానికి వంశీ అధికార పార్టీకి సిటీ ప్రెసిడెంట్. పైగా రెండు సార్లు విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అటువంటి వంశీ కేవలం ఒక వార్డు స్థాయి నాయకుడిగా మారిపోవడం ఆయనకే అర్ధం కావడం లేదు, వైసీపీ అభిమానులు అయితే అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతటి నాయకుడు ఎలా అయిపోయాడని బాధపడుతున్నారు. గత ఏడాది ఎన్నికల్లో విశాఖ ఎంపీ టికెట్ కూడా వంశీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. అటువంటి స్థాయి, దర్జాను పక్కన పెట్టి వంశీ గల్లీ లీడర్ గా సందుల్లో తిరగడం అంటే ఆయన వర్గానికి తెగ బాధగా ఉందిట.
ఎంతకాలమో…?
నిజానికి వైసీపీలో చాలామందికి మేయర్ కావాలని ఉన్నా కూడా ఇండైరెక్ట్ ఎన్నిక వల్లనే తప్పుకున్నారు.ఇంత బతుకూ బతికి కార్పోరేటర్ గా పోటీ చేయడమేంటి అని సందేహించి ససేమిరా అనేశారు. వంశీకి మాత్రం పార్టీ ఇచ్చిన ప్రామిస్ మేరకు పోటీ చేయకతప్పలేదు. పైగా మేయర్ కావాలన్నది ఆయన చిరకాల కోరిక. మరో వైపు చూస్తే కేవలం పదిహేను రోజులే ఎన్నికలు కదా. ఆ తరువాత ఎటూ మేయర్ పోస్టులోకి వెళ్ళిపోవచ్చు, దర్జా ఒలకబోయచ్చు అని వంశీ భావించారు. ఇపుడు చూస్తే ఎన్నికలు వాయిదా వేశారు. అంతే కాదు ఎపుడు జరుగుతాయో కూదా అయోమయంగానే ఉంది. దీంతో వంశీ లెవెల్ ఒక్కసారిగా వార్డు స్థాయికి పడిపోయింది. దాంతో ఎపుడు ఎన్నికలు జరుగుతాయి. మరెప్పుడు మేయర్ అవుతానో అనుకుంటూ ఆయన భారంగా రోజులు వెళ్లదీయాల్సివస్తోందిట.