మాజీలకు దారి చూపేది ఉందా జగన్?

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు వారు కింగుల్లా బతికారు. తమ మాటే చలామణీ చేసుకున్నారు. ఓ విధంగా సొంత సామాజ్యాలు నిర్మించుకున్నారు. వారంతా తరువాత కాలంలో ఏది [more]

Update: 2020-06-21 08:00 GMT

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు వారు కింగుల్లా బతికారు. తమ మాటే చలామణీ చేసుకున్నారు. ఓ విధంగా సొంత సామాజ్యాలు నిర్మించుకున్నారు. వారంతా తరువాత కాలంలో ఏది కలసిరాక వైసీపీలో చేరిపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లే జగన్ చేర్చుకున్నారు. వారు ఇపుడు అటునుంచి ఇటు వచ్చేశారు. అంతే తప్ప వారి పొలిటికల్ స్టేటస్ పెరగలేదు సరికదా అలికిడి సందడి మరింతగా తగ్గింది. ఏదో పేరుకు వైసీపీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లుగా సీన్ తయారైంది. ఇలా చాలా మంది విశాఖ వైసీపీలో కనిపిస్తారు.

మైనారిటీ లీడర్ గా….

విశాఖతో పాటు ఉత్తరాంధ్రాకు మైనారిటీ లీడర్ గా ఒక వెలుగు వెలిగిన డాక్టర్ ఎస్ ఏ రహమాన్ జగన్ విశాఖకూ పాలనా రాజధాని ప్రకటన చేయగానే వచ్చి వాలిపొయారు. వైసీపీకి జై అనేశారు. అదే టైంలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉండడంతో మేయర్ సీటు అయినా దక్కుతుంది అనుకున్నారు. కానీ ఆయన్ని ముందు పనిచేయమన్నారు. పార్టీ వారిని గెలిపించమన్నారు. సరే అనుకునేలోగా లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాంతో మరే పనీ పదవీ లేక గోళ్ళు గిల్లుకోవడం రహమాన్ వంతు అవుతోంది. టీడీపీ ఉన్నపుడు అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉండేవారు, అలాగే అంతకు ముందు ఎమ్మెల్యేగా, ఉండా చైర్మన్ గా పనిచేశారు. ఎమ్మెల్సీ హామీ కూడా మైనారిటీ కోటాలో ఉందనగా టీడీపీకి పవర్ పోయింది. ఇపుడు వైసీపీలో ఏమిస్తారో తెలియదు, రాజకీయంగా ఇపుడు బ్రేకులే పడ్డాయని అనుచరులు అంటున్నారుట.

మంత్రిగా చేసినా….

ఇక మరో నాయకుడు ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా అయిదేళ్ల పాటు పనిచేశారు. గిరిజన నాయకుడు అయిన పసుపులేటి బాలరాజు వైసీపీలో ముందే చేరితే ఈ పాటికి ఎమ్మెల్యే అయి ఉండేవారు. లేక అరకు ఎంపీ అయినా దక్కేది, కానీ అటూ ఇటూ కాకుండా ఇపుడు చేరి ఎటూ కాకుండా పోయారన్న బాధ అనుచరుల్లో ఉంది. లేట్ గా వైసీపీలో ఎంట్రీ ఇవ్వడంతో ఆయన కుమార్తె కి జెడీ చైర్ పర్సన్ సీటు కోసం కూడా సొంత పార్టీలో మోకాలడ్డారు. దాంతో ఆయన సైతం ఏమీ చేయలేక సాధారణ వైసీపీ నేతగా కాలం వెల్లబుచ్చుతున్నారు.

తిప్పల తిప్పలు…..

ఇక సొంత బాబాయ్ తిప్పల నాగిరెడ్డి కార్పోరేటర్ గా ఉంటే తాను ఎమ్మెల్యేగా చక్రం తిప్పారు తిప్పల గురుమూర్తిరెడ్డి. ఆయన గతంలో వైసీపీలో ఉండేవారు, తీరా 2014 ఎన్నికల్లో పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో టీడీపీలోకి జంప్ చేసారు. మళ్లీ పార్టీ అధికారంలోకి రావడంతో ఇటు వైపు వచ్చేశారు. ఈ పొద్దుతిరుగుడు పువ్వు రాజకీయాల మూలంగా బంగారం లాంటి భవిష్యత్తు కోల్పోయారని అంటారు. ఆయన కనుక తిన్నగా ఉంటే ఈపాటికి బాబాయ్ ప్లేస్ లో గాజువాక ఎమ్మెల్యే అయి ఉండేవారని కూడా చెబుతారు. మొత్తానికి ఈ మాజీలు ఇపుడు వైసీపీ అధినాయకత్వం వైపు ఆశగా చూడడం మినహా ఏం చేయలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News