జెండా మోసిన వాళ్లకు షాక్.. బరువు ఇరవై కోట్లట?

విశాఖ మేయర్ సీటు చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. తాము కొలువున్న చోట వైసీపీ జెండా ఎగరేయాలనుకోవడంలో తప్పులేదు. [more]

Update: 2020-03-20 15:30 GMT

విశాఖ మేయర్ సీటు చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. తాము కొలువున్న చోట వైసీపీ జెండా ఎగరేయాలనుకోవడంలో తప్పులేదు. అది అవసరం, అనుకూలం కూడా. అయితే ఈ విషయంలో అధికార పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల కు వైసీపీ పెద్ద పరీక్షే పెడుతోంది. మేయర్ రేసులో ఉంటే మాత్రం కచ్చితంగా ఇరవై కోట్ల మొత్తాన్ని తీయాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా వంద వార్డులు విశాఖ జీవీఎంసీలో ఉన్నాయి. వార్డుకు 20 లక్షలు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులకు మేయర్ క్యాండిడేట్ ఇవ్వాల్సి ఉంటుంది.

తట్టుకున్న వారే …..

ఇలా తట్టుకున్న వారే వైసీపీ నుంచి మేయర్ అవుతారని అంటున్నారు. అయితే వైసీపీ గత ఎన్నికల వేళ తూర్పు నుంచి టికెట్ ఖరారై చివరై నిముషంలో పక్కన పెట్టిన సిటీ అధ్యక్షుడు వంశీ క్రిష్ణ కు మేయర్ సీటును పార్టీ హామీ ఇచ్చింది. దాంతో ఆయన కార్పోరేటర్ గా బరిలో ఉన్నారు. ఆయన ఈ ఖర్చుకుని భరించడానికి ఎంతవరకూ ముందుకు వచ్చారన్నది తేలలేదు. ఇప్పటికే గత పదేళ్ళుగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే పార్టీలో పనిచేస్తూ రాజకీయం చేస్తూ యాభై కోట్ల వరకూ ఖర్చు చేసి చతికిలపడిన వంశీ అధినాయకత్వం ఆశీస్సులు ఉంటేనే తనకు మేయర్ సీటు దక్కుతుందని భావిస్తున్నారు. ఆయన అంత ఖర్చు పెట్టుకునే స్థితిలో లేరని పార్టీ నాయకులు అంటున్నారు.

ధనవంతులకే ….

ఇక వైసీపీ టికెట్ల ఖరారులో కూడా డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతవరకూ పార్టీకి పనిచేసిన వారిని పక్కన పెట్టి మరీ ఎవరి దగ్గరైతే డబ్బు మూటలు ఉన్నాయో వారిని రాత్రికి రాత్రి చేర్చుకుని మరీ టికెట్లు ఇచ్చేసింది. దాంతో వైసీపీలో ఓవైపు క్యాడర్ లో పెద్ద ఎత్తున అసంతృప్తి కనిపిస్తోంది. మరో వైపు డబ్బు ఖర్చు పెట్టిన వారు ఎంతవరకూ జనంలో మన్ననలు పొందుతారన్న సందేహాలు ఉన్నాయి. ఇక ప్రతీ కార్పోరేటర్ అభ్యర్ధి కచ్చితంగా పాతిక లక్షల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పదిహేను కోట్ల పాట…..

మరో వైపు చూసుకుంటే ప్రతిపక్ష టీడీపీ కూడా విశాఖ మేయర్ సీటు మీద కన్నేసింది. అందుకోసం చాలా జాగ్రత్తగా అభ్యర్ధులను ఎంపిక చేసింది. అర్ధబలం, అంగబలం ఉన్నవారే ఆ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అంతే కాదు మేయర్ రేసులో ఉన్న వారు ఎవరైనా కనీసం పదిహేను కోట్లు వరకూ ఖర్చు చేయాల్సిందేనని కూడా పార్టీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో కార్పోరేట్ అభ్యర్ధికి కనీసంగా పదిహేను లక్షల రూపాయలు మేయర్ అభ్యర్ధి ఆర్ధిక సాయం చేయడానికి వీలుగా కోటిన్నర దిమాండ్ ని పార్టీ తెర ముందుకు తెచ్చింది.

బంధుగణానికే….

మొత్తం మీద చూసుకుంటే అధికార వైసెపీ, విపక్ష టీడీపీ డబ్బున్న వారికి, బంధువులకే పెద్ద పీట వేశాయి. దీంతో రెండు పార్టీలలో జెండా మోసిన వారంతా షాక్ తిన్నారు. దాంతో పెద్ద ఎత్తున‌ రెండు పార్టీల నుంచి రెబెల్స్ బరిలోకి దిగిపోయారు. వారిని బుజ్జగించి గెలుపు దిశగా సాగడం రెండు పార్టీలకు కష్టసాధ్యమైన విషయమేనని అంటున్నారు. ఇక డబ్బు, అధికారం విషయంలో అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా నిలబడడంతో జీవీఎం సీ ఎన్నికలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా మారిపోయాయి. విజేతలు, పరాజితులు ఎవరైనా కూడా ఇది భారీ రాజకీయ సంగ్రామానికి ఇది దారితీసేలా ఉంది.

Tags:    

Similar News