అక్కడ వైసీపీలో మంట‌లు.. పెత్తనం చేసేవారు పెరుగుతున్నారా…?

2014లో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రిలో ఐదేళ్లు తిరిగేస‌రికి వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. దాదాపు అన్ని స్థానాల్లోనూ ( పాలకొల్లు, ఉండి ) త‌ప్ప.. [more]

Update: 2020-08-29 05:00 GMT

2014లో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రిలో ఐదేళ్లు తిరిగేస‌రికి వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. దాదాపు అన్ని స్థానాల్లోనూ ( పాలకొల్లు, ఉండి ) త‌ప్ప.. విజ‌య‌దుందుభి మోగించింది. అయితే, ఈ విజ‌యం ద‌క్కించుకున్న ఏడాదిన్నర త‌ర్వాత ఆ పార్టీ ఇక్కడ పిల్లి మొగ్గలు వేస్తోంది. నాయ‌క‌త్వ ‌బ‌లం ఉన్నా.. ఆధిప‌త్య ధోర‌ణి అన్ని చోట్లా క‌నిపిస్తోంది. ఈచివ‌రి నుంచి ఆచివ‌రి వ‌ర‌కు కూడా నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల‌తో పార్టీ ప‌రువు పోతోంది. ముఖ్యంగా కొత్తగా ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన వారితో మ‌రిన్ని సంక‌ట స్థితులు పార్టీకి ఎదుర‌వుతున్నాయి.

ఆధిపత్య పోరుతో….

అయిన‌ప్పటికీ.. ఎప్పటిక‌ప్పుడు సీఎం జ‌గ‌న్ న‌ట్లు బిగిస్తున్నా.. నాయ‌కులు మాత్రం త‌మ ధోరణిని వీడ‌క‌పోవ‌డంతో పార్టీ ప‌రిస్థితి, భ‌విష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. నిజానికి ఇక్కడ కాపు ఓటు బ్యాంకు ఎక్కువ‌. అదే స‌మ‌యంలో రాజుల వ‌ర్గం కూడా గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీకి అండ‌గా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే రాజుల సామాజిక వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌ కృష్ణంరాజు పార్టీకి ఎగ‌స్పార్టీగా మారారు. ఈయ‌న‌ను నిలువ‌రించ‌డం ఎవ‌రిత‌ర‌మూ కావ‌డం లేదు. దీంతో స్థానిక నాయ‌కులు కూడా మేం ఏం చేస్తి అదే చెల్లుబాటు అవుతుంద‌నే ధోర‌ణిలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు ప‌డ‌డం లేదు. కొన్ని చోట్ల మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు కూడా పొస‌గ‌డం లేదు.

మంత్రిగారూ అంతే….

ఇక‌, ఇప్పటికే మంత్రిగా ఉన్న రంగ‌నాథ‌రాజు.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న వ‌ర్గాన్ని పెంచి పోషిస్తున్నారు త‌ప్ప.. పార్టీలో అంద‌రినీ స‌మానంగా చూడ‌లేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. త‌నకు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆయ‌న జోక్యం చేసుకుంటున్నారు. డెల్టాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్న ఆయ‌న త‌న ప్రాంతంలో అయినా పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల్సి ఉండ‌గా.. ఆ ధోర‌ణి పూర్తిగా పోయి.. కేవ‌లం పార్టీపై ఆధిప‌త్యం చ‌లాయించేలా వ్యవ‌హ‌రించ‌డంతో అనేక గ్రూపులు ఏర్పడ్డాయి. మంత్రి చెరుకువాడ‌కు న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద‌రాజుతో పొస‌గ‌డం లేద‌న్న చ‌ర్చలు న‌డుస్తున్నాయి.

పాలకొల్లులోనూ…..

ఇక మంత్రి రంగ‌రాజు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఆచంట‌ ప‌క్కనే ఉన్న పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెడుతున్నార‌ని.. పాల‌కొల్లు ఇన్‌చార్జ్‌గా ఉన్న క‌వురు శ్రీనివాస్‌తోనూ ఆయ‌న‌కు ప్రచ్ఛన్న యుద్ధం న‌డుస్తోంద‌ని అంటున్నారు. పాల‌కొల్లు వైసీపీని ముక్కలు చేయ‌డంతో పాటు బీసీ వ‌ర్గాల్లో బ‌లంగా ఎదుగుతోన్న క‌వురు శ్రీనివాస్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డ‌మే మంత్రి టార్గెట్‌గా ఉంద‌న్న విమ‌ర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఎంపీ ర‌ఘురామ‌ను దూరం పెట్టాల‌ని అధికారికంగా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తే.. మంత్రి రంగ‌రాజు విష‌యంలోనూ అన‌ధికారికంగా పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు ఇదే సూత్రం పాటిస్తున్నారు.

ఈ నియోజకవర్గాల్లోనూ….

ఇక మెట్ట ప్రాంతంలో ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌, ఆయన వ‌ర్గం నేత‌ల‌తో చింత‌ల‌పూడి ఎమ్మెల్యే వీఆర్. ఎలీజాకు ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. ఇక్కడ ఎంపీ వ‌ర్గం పూర్తిగా హ‌వా కొన‌సాగిస్తోంది. అలాగే చాలా మందికి ఎంపీ ద్వారానే ప‌నులు అవుతున్నాయ‌న్న భావ‌న కూడా ఉంది. పోల‌వ‌రం, గోపాల‌పురం, కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్యమేలుతున్నాయి. పార్టీ కేడ‌ర్ నిట్టనిలువునా రెండుగా చీలిపోయింది. ఏదేమైనా పార్టీ గెలిచిన యేడాది కాలంలోనే గ్రూపు త‌గాదాలు తారా స్థాయికి చేరుకోవ‌డం ఇప్పుడు జిల్లాలో పెను చ‌ర్చకు దారితీస్తోంది. మ‌రోప‌క్క, టీడీపీ నాయ‌కులు సైలెంట్‌గా ఉన్నా అవ‌కాశం కోసం మాత్రం ఎదు‌రు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీలోని లొసుగుల‌ను వారు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటే అధికార పార్టీకి మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్పవు.

Tags:    

Similar News