వైసీపీలో కొంద‌రు ఔట్‌.. ఇంకొంద‌రు ఇన్‌.. చాలా మార్పులే?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎలా మార‌తాయో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఎప్పుడు ఏంజ‌రిగినా.. జ‌రిగింద‌ని స‌రి పెట్టుకోవ‌డం మిన‌హా చేయ‌గ‌లిగేది ఏమీ ఉండ‌దు. నేత‌ల త‌ల‌రాత‌లు [more]

Update: 2020-07-01 05:00 GMT

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎలా మార‌తాయో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఎప్పుడు ఏంజ‌రిగినా.. జ‌రిగింద‌ని స‌రి పెట్టుకోవ‌డం మిన‌హా చేయ‌గ‌లిగేది ఏమీ ఉండ‌దు. నేత‌ల త‌ల‌రాత‌లు ఎలా మార‌తాయో కూడా తెలియ‌దు. నిన్నటి రాజు.. రేప‌టి కి బంటు అయ్యే ప‌రిస్థితి.! నిన్నటి బంటే.. నేడు రాజ‌య్యే మ‌హ‌ద్భాగ్యం. ఇదీ నేటి రాజ‌కీయాల్లో కొత్త ట్రెండ్‌. ఇవ‌న్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వ‌స్తోందంటే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అధికార వైసీపీలో కీల‌క మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌నే ప్రచారం జోరందుకుంది. కొంద‌రు ఔట్‌.. ఇంకొంద‌రు ఇన్‌.. అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అస‌లు ఈ పార్టీలో .. ఈ జిల్లాలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

ఎంపీగారి వ్యవహారంతో…..

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది మాత్రమే గ‌డిచింది. ఇంత‌లోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పెను ప్రకంప‌న‌లు మొద‌ల ‌య్యాయి. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు.. వ్యవ‌హారం రాష్ట్రంలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా అన్ని రాజ‌కీయ ప‌క్షాల్లోనూ తీవ్ర చ‌ర్చకు దారితీసింది. ఏకులా మొద‌లైన విమ‌ర్శల ప‌ర్వం.. మేకులాగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇసుక‌న్నారు… త‌ర్వాత ప‌థ‌కాలు పంచుతూపోతే.. అభివృద్ధి ఎలా అన్నారు. టీటీడీ భూములు అమ్మితే చూస్తూ.. కూర్చుంటామా? అన్నారు. రాజ‌ధాని మార్చడం అవివేక‌మ‌న్నారు. ఇక‌, చివ‌రాఖ‌రుగా పార్టీ ఎమ్మెల్యేల‌ను పందుల‌తో పోల్చేశారు. దీంతో ఆయ‌నకు పార్టీ కీల‌క నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి షోకాజ్ నోటీసు ఇవ్వడం తెలిసిందే.

ముందుగానే వ్యూహం ప్రకారం…..

అయితే, దీనిని కూడా రాజుగారు వివాదం చేసేశారు. ఫ‌లితంగా రేపో మాపో.. ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు సాగ‌నంపుతార‌నే ప్రచారం సాగుతోంది. ఆయ‌నంత‌ట ఆయ‌నే స్వయంగా పార్టీని విడిచిపోతార‌నే ప్రచారం సాగుతుండ‌గా.. కాదు, ఆయ‌న‌ను పార్టీనే సాగ‌నంపుతుంద‌ని అంటున్నారు. మొత్తంగా ఈయ‌న వెళ్లిపోతే.. వెంట‌నే కీల‌క మార్పులు చోటు చేసుకుంటాయ‌ని చెబుతున్నా రు వైసీపీ జిల్లా నాయ‌కులు. వీరి అంచ‌నాల మేర‌కు.. గ‌త కొన్నాళ్లుగా రాజుగారు వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో విసుగెత్తిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈయ‌న‌కు చెక్ పెట్టేందుకు ప‌క్కా వ్యూహంతో రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, బీజేపీ నేత గోక‌రాజు గంగ‌రాజు కుమారుడు రంగ‌రాజును పార్టీలోకి తీసుకుని, కండువా క‌ప్పారు. వెంట‌నే ఆయ‌నకు న‌ర‌సాపురం పార్లమెంట‌రీ జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా నియ‌మించారు.

ఆయనను చేర్చుకునేందుకు…..

ఈ మార్పు జ‌రిగిన‌ప్పుడే రఘుకు పెద్దగా ప్ర‌యార్టీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని స్థానిక ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌కు మెసేజ్ కూడా వెళ్లింది. ఈ ప‌రిణామం రాజుగారికి చెక్ పెట్టేందుకేన‌ని ప్రచారంలో ఉంది. ఇక‌, ఇప్పుడు రాజుగారు క‌నుక వెళ్లిపోతే.. వెంట‌నే రంగ‌రాజుకు బాధ్యత‌లు అప్పగిస్తార‌ని అంటున్నారు. ఇలా అనుకుంటూ ఉంటే.. గొప్ప ట్విస్ట్ వ‌చ్చిప‌డింది.. టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మె ల్యే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి కేవ‌లం 27 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన క‌లువ‌పూడి శివ (వేటుకూరి వెంక‌ట శివ‌రామ‌రాజు) వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నార‌నే ప్రచారం సాగుతోంది. ఒక‌వేళ ఈయ‌న సైకిల్ దిగి.. ఫ్యాన్ కింద‌కు చేరితే.. ఆయ‌న‌కు న‌ర‌సాపురం వైసీపీ క‌న్వీన‌ర్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. శివ‌ను వైసీపీలో చేర్చుకునేందుకు జ‌గ‌న్ సైతం ఎంతో ఆస‌క్తితో ఉన్నార‌ట‌. దీంతో ఇక్కడ ఏం జ‌రుగుతుంద‌నేది కొంత ఆస‌క్తిగా మారింది.

ఉండి నియోజకవర్గంలోనూ…..

ఇదిలావుంటే, మ‌రికొంద‌రు కీల‌క క్షత్రియ‌ నాయ‌కులు కూడా వైసీపీలోకి వ‌చ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నార‌న్న ప్రచారం జిల్లా వైసీపీ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామ ‌రాజు (క‌లువ‌పూడి రాంబాబు) కూడా టీడీపీకి బై చెబుతార‌నే అంటున్నారు. ఎందుకంటే.. ఆయ‌న రాజ‌కీయ మిత్రుడు, గ‌త ఎన్నిక‌ల్లో ప్రోత్సహించిన క‌లువ‌పూడి శివ ఎక్కడుంటే.. ఈయ‌న కూడా అక్కడే ఉంటారు. సో.. ఈయ‌న పార్టీ మారి వైసీపీ చెంత‌కు చేరితే.. ఉండిలో వైసీపీ క‌న్వీన‌ర్‌గా ఉన్న పీవీఎల్ న‌ర‌సింహ‌రాజును అక్కడ నుంచి త‌ప్పిస్తార‌నే ప్రచారం సాగుతోంది. ఈ బాధ్యత‌ల‌ను రామ‌రాజుకు ఇస్తార‌ని అంటున్నారు. వీరిద్దరి రోజు జిల్లా రాజ‌కీయాల్లో చాలా స్పెష‌ల‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

మరింత బలోపేతం అయ్యే దిశగా….

ఉండిలో వైసీపీ త‌ర‌ఫున గ‌త ఏడాది పీవీఎల్ న‌ర‌సింహరాజు పోటీ చేసి.. ఓడిపోయారు. అయితే, ఇక్కడ ఆయ‌న పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో చొర‌వ చూపించ‌లేక పోతున్నార‌నే వాద‌న ఉంది. అదే స‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన మంతెన రామ‌రాజు దూకుడుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీలోకి వీరిని తీసుకువ‌చ్చేందుకు కొంద‌రు నేత‌లు చేసిన ప్రయ‌త్నం ఫ‌లిస్తున్నట్టుగా చెబుతున్నారు. క‌లువ‌పూడి శివ‌, ఎమ్మెల్యే మంతెన రామ‌రాజు కూడా వైసీపీలోకి వ‌చ్చినా వీరిలో ఒక‌రికి ఉండి ప‌గ్గాలు, మ‌రొక‌రికి న‌ర‌సాపురం లోక్‌స‌భ క‌న్వీన‌ర్ ప‌గ్గాలు ఇస్తార‌ని టాక్‌..? మొత్తంగా చూస్తే.. జిల్లాలో స‌మీక‌ర‌ణ‌ల‌ను వైసీపీ చాలా వేగంగా మార్చుకుని మ‌రింత బ‌లోపేతం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్షత్రి‌య సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న జిల్లాలో ఒక‌రు పార్టీ నుంచి బ‌య‌ట‌కు పోయినా.. మొత్తంగా క్షత్రియ వ‌ర్గాన్ని త‌న వైపున‌కు తిప్పుకొని.. మిగిలిన పార్టీల‌కు షాక్ ఇచ్చేలా జ‌గ‌న్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీలకులు.

Tags:    

Similar News